అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

మానాభిమానాలకి పడిచచ్చే మనిషి కాడు భేతాళుడు. "నూరు తిట్లు తిడితేనేమిలే, ఒక బొబ్బట్టు పెడితే చాలు" అనుకునే రకం వాడు! అకస్మాత్తుగా తల్లిభూమికి తిరిగి వచ్చిన భేతాళుణ్ణి చూసి, బెస్తవాడలోని వాళ్ళు అందరూ ఒకే ఇదిగా తెల్లబోయారు. వాడు మళ్ళీ కనిపిస్తాడనిగాని, కనిపించాలనిగాని వాళ్ళెవరూ అనుకోలేదు. చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయిన తమ్ముడు తిరిగి ఇన్నాళ్ళకి ఇల్లు చేరాడన్న సంతోషం ఏ కోశానా లేదు నీలమ్మలో కూడా. ఈ తంపులమారి తెంపి ఊళ్ళోకి దిగబడ్డాడు, ఈమాటు వీడు ఎవరి కొంప కూలుస్తాడో, ఏ పుట్టి ముంచుతాడో ఏమోనని ఆమెకు లోలోన భయం మొదలయ్యింది. వీడివల్ల తన తల్లిదండ్రులు పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి ఆమెకు.

ఐదుగురు కూతుళ్ళ తరువాత చాలా కాలానికి అపురూపంగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకని తల్లిదండ్రులు గారాబం చేశారు. అంతేకాదు, వీడికంటే బాగా పెద్దవాళ్ళైన ఐదుగురు అక్కలు కూడా వీడిని చాలా ముద్దు చేశారు. గారాబపు పాలు బాగా ఎక్కువవ్వడంతో భేతాళుడు పెంకిగా, మంకుగా తయారై, అరిచి గీపెట్టి అన్నది అన్నట్లుగా సాధించుకుంటూ ఏ బాధ్యతా తెలియకుండా, "అడ్డగాడిదలా" పెరిగాడు, లోక కంటకుడయ్యాడు.

వేడిని సముద్రుడు, కన్నయ్య లాంటి శ్రద్ధగా బడికివెళ్ళే వాళ్ళతో జతచేసి వీడిని కూడా బడికి పంపితే, వీడు అక్కడ చదువుకోడానికి బదులుగా తోటి పిల్లల దగ్గర బలపాలూ, పెనిసిళ్ళు, తెచ్చుకున్న తినుబండారాలు ఊడలాక్కుని, వాళ్ళని ఏడిపించేవాడు. వయసుతోపాటు వాడి దుర్గుణాలసంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో గాని, వీడి మూలంగా వచ్చే జట్టీలు తీర్చలేక తల్లికి, తండ్రికి తలప్రాణం తోకకి వచ్చేది - అన్నది తలుచుకుని నీలమ్మ నిట్టూర్చింది.

కులవృత్తిని ఏవగించుకునే వాడు భేతాళుడు. పోనీ అలాగని మరో వృత్తివిద్య ఏదైనా నేర్చుకున్నాడా అంటే అదీ లేదు. అసలు కష్టించి పనిచేయ్యడమే ఇష్టం లేదు వాడికి. నీటుగా ముస్తాబై, రోడ్లవెంట తిరగడమే తప్ప కష్టపడి పని చేసి, నాలుగు డబ్బులు సంపాదించడ మన్నది వాడికి అసలు నచ్చేది కాదు. కన్నందుకు అడగ్గానే వాడికి అడిగినంత డబ్బూ, సమయానికి తన దగ్గర లేకపోతే ఎక్కడైనా అప్పో సొప్పో చేసైనా సరే, తెచ్చి వాడికి ఇవ్వక తప్పేదికాదు తండ్రికి.

పెద్దవాడైనకొద్దీ అవసరాలు పెరగడంతో, తండ్రి ఇచ్చిన డబ్బు సరిపోయేది కాదు వాడికి. ఇంతకంటే ఇవ్వడం నా వల్ల కాదని తండ్రి చేతులెత్తెయ్యడంతో, సినిమాహాలు దగ్గర బ్లాకులో టిక్కెట్లు అమ్మి, అందితే జేబులుకొట్టీ - ఇలా శరీరానికి అలసటలేని పద్ధతుల్లో ఎలాగైనా డబ్బు సంపాదించాలని చూసేవాడు. ఒకసారి తండ్రి మందలిస్తే, వీడు తండ్రిమీద తిరగబడ్డాడు. తల్లి అడ్డం వచ్చిందని ఆమె చేయి మెలిదిప్పి విరిచేశాడు. నలుగురూ చేరి పోలీసు కేసు పెడతామని బెదిరించడంతో వీడు ఉన్నబడంగా ఇల్లొదిలి పారిపోయాడు. ఆ పోకపోక - ఇదే తిరిగి రాక! వీడి ఆగడాలన్నీ సహించి, వీడిని చూసి మురిసిపోడానికి ఇప్పుడు అమ్మా నాన్నా కూడా లేరు. మిగిలిన అక్కలు వేరే ఊళ్ళలో దూరంగా ఉన్నారు. ఇప్పుడు వీడు తనకు "తప్పనిసరి తద్దినం"లా, భరించలేని తలనెప్పిగా తయారయ్యీలా ఉన్నాడు - ఆనుకుంది నీలమ్మ భయం భయంగా. కానీ, "వీడేమైనా ఈ సరికి మారి ఉంటాడేమో" అని మనసు మూలల్లో ఒక చిన్న ఆశ పుట్టింది నీలమ్మకి, పాపం! అంతలోనే మళ్ళీ, "ఏమో! అలాంటి ఆశలు తీరుతాయన్నా నమ్మకంలేదు. "కుక్కతోక వంకర, మనిసి బుద్ది వంకరా ఒకే తీరు! సచ్చినా మారవు" అంటారు  గందా! ఏమో, సూత్తావుండు, అదేదో ఇంకో రెండు రోజుల్లో బయటపడకపోతుందా ఏంటి" అనుకుంది.

"ఈడి జిమ్మడిపోను! అసలు, పోయినోడు పోకుండా నా పాల మళ్ళీ ఏడనుండి ఊడిపడ్డాడుట, ఈ దొంగ సచ్చినోడు? ఈడిమీది బెంగతోనే గందా అమ్మా, అబ్బా గుండెపగిలి అద్ధంతరపు సావు సచ్చారు! ఇప్పుడింక ఎవరి కొంప ముంచడానికి వచ్చాడో ఈడిక్కడకు" అని కూడా అనుకుంది నీలమ్మ. దుష్టుడైన తమ్ముడి రాకతో దిగులుపడిన నీలమ్మ మనసులోకి, వాడి గత చరిత్రను గురించిన రకరకాల ఊహాపోహలు వస్తూ, పోతూ ఉండడంతో ఆమె వాడిని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించ లేకపోయింది. కానీ వాడు అలాంటి పట్టింపులేమీ పెట్టుకోకుండా తనంతట తానే లోపలకి వచ్చేశాడు.

నీలమ్మ నిరసనని చూసి, ఆమెను చూడనట్లే తప్పించుకు తిరుగుతున్నాడు భేతాళుడు. ఊరు విడిచి ఎలా వెళ్ళాడో అలాగే కట్టుబట్టలతో తిరిగి వచ్చిన భేతాళుడికి ఇప్పుడా ఊళ్ళో నీలమ్మ తప్ప మరో దక్షతేమీ లేకపోయింది. కష్టపడి తిండి సంపాదించుకోడం తెలియని ఆ పరాన్నజీవి, బదనిక - అప్పగారిపైనే ఆధారపడ్డాడు. మానాభిమానాలు, సిగ్గు బిడియాలు లాంటివేమీ పట్టించుకోకుండా వాడు సరిగా అన్నాలు తినే వేళకు అప్పగారి ఇంటి గుమ్మంలోకి వచ్చి కూర్చునేవాడు. ఆకలి కడుపుతో గుమ్మంలో కూర్చున్నవాడిని "ఛీ, ఫో" అని తరిమెయ్యలేక, తల్లి తండ్రులని తలుచుకుని వాడికి కూడా పిల్లల పక్కన విస్తరి వేసి, అయిష్టంగానే వడ్డించసాగింది నీలమ్మ. రెండు పొద్దులా అక్కడే భోజనం చేసి, రాత్రి ఆ ఇంటి అరుగుమీదే పడుకుంటూ - అలా క్రమంగా నీలమ్మ కుటుంబంలో ఒకడయ్యాడు భేతాళుడు. సముద్రంలో, తోటి చేప పొలుసుల క్రింద జేరి, ఆ చేపల్ని కరిచిపట్టి, దాని రక్తం పీల్చి బ్రతికే పరాన్నజీవియైన "పైజారుకట్టు" అనే సోమరి చేపలాంటి వాడు భేతాళుడు. నిరంతర శ్రమజీవులైన బెస్తలలో చెడబుట్టిన వాడు వీడు!

ఎవరైనా మాటవరసకు, "వొయసు అయిపోతున్నాది, నీ తమ్ముడికి పెళ్ళి సెయ్యవా నీలమ్మా!" అని అడిగితే - ఆ అడిగినవాళ్ల మీద విరుచుకుపడేది నీలమ్మ. ఒకసారి అదే ప్రశ్న అచ్చమ్మ అడిగింది. వెంటనే "కస్సు"మంది నీలమ్మ...

"పనిపాటలు సేతకాని ఈ బేవార్సునాయాలుగాడికి ఇక పెళ్ళొక్కటే తక్కువoట! బీడీలగ్గూడా నన్ను డబ్బులడుక్కునేటోడు ఓలి ఏడనుండి తెస్తాడంట? పెళ్లి సేసుకోగానే సరా ఏటి, పెళ్ళాం బిడ్డల్ని పోశించుకోడం సేతనవ్వద్దా? ఆల్లని కూడా నేనే పోసించాలా ఏంటీ? ఈడితోటోడే గందా కన్నయ్య! ఆడిని సూడు, ఆడికీ ఈడికీ సాపత్తెం ఉందా ఏడనైనా? సిగ్గూ ఎగ్గూ లేని ఈ బేవార్సు సచ్చినోడి ఊసు నాకాడ తేమోకు అచ్చమ్మ పిన్నీ! నా ఒళ్ళు సిరసిరలాడిపోద్ది. సొరగంలోఉన్న మా అమ్మా అయ్యా కుసిళ్ళుతారని ఈడికింత ముద్దేస్తన్నాగాని, ఈడిమొగం సూసి కాదు" అంది నీలమ్మ చీదరింపుగా.

సరిగా అప్పుడే అటుగా వచ్చిన భేతాళుడు విన్నాడు ఆ మాటలు. వాడికి చాలాకోపం వచ్చింది - అది అప్పగారిమీద కాదు, కన్నయ్యమీద! తన కంటే అన్నివిధాలా గొప్పగా అందరికీ కనిపిస్తున్నందుకు కన్నయ్యమీద అసూయతో రగిలిన వాడి మనసు పగతో కుతకుత ఉడికింది. తన అసమర్ధత కాదు దానికి కారణం, కన్నయ్య సమర్ధత! కన్నయ్య తనకంటే అదృష్టవంతుడు కావడం వాడికి ఎంతమాత్రం నచ్చలేదు. "సూత్తావుండు, తొందరలోనే ఈడి పని పడతా, ఈడ్ని ముప్పుతిప్పలూ పెట్టి మూడు సెరువుల నీల్లు తాగించకపోతే నా పేరు భేతాళుడే కాదు! నా తడాకా ఏంటో సూపిత్తా" అంటూ అప్పటికప్పుడు మనసులోనే  భీషణప్రతిజ్ఞ చేసుకున్నాడు వాడు.

నక్క ఒకచోట గౌరీకళ్యాణమూ మరోచోట ఈలపాటా పాడుతుందా ఏమిటి? అది ఎప్పుడూ ఊళలే వేస్తుంది! చిన్నప్పటినుండీ భేతాళుడు చేసీవన్నీ చెడ్డపనులే. అవి వయసుతోపాటు పెరుగుతూ వచ్చాయి, అంతే!

#########

అప్పుడు భేతాళుడి వయసు పదహారో, పదిహేడో ఉంటాయి, కానీ అప్పటికే వాడికి రకరకాల వ్యసనాలు అబ్బాయి. దాంతో తండ్రి ఇచ్చిన డబ్బు చాలక దొంగతనాలు చెయ్యడం కూడా మొదలుపెట్టాడు. భేతాళుడి మీద తండ్రి శరభయ్య దగ్గరకి రకరకాల పితూరీలు వచ్చేవి...

ఒకరోజు నాలుగేళ్ళపిల్ల ఒకతె మట్టిలో ఆడుకుంటూంటే దాని చెవిరింగులు ఊడదీసుకు పారిపోయాడని ఇంటిమీదికి జట్టీ రావడంతో అవమానపడ్డ శరభయ్య, కొడుకు ఇంటికి రాగానే మందలించాలనుకున్నాడు. భేతాళుడు ఇంటికి రాగానే తండ్రి వాడిని నిలదీసి అడిగాడు. వాడు తప్పు ఒప్పుకోకుండా బుకాయించాడు. కోపంవచ్చి తండ్రి వాడి చెంపమీద ఒక్క టిచ్చుకున్నాడు, బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో.

అసలే ఆ దవడలో పిప్పిపన్ను సలుపుతూండడంతో భేతాళుడికి ఆ దెబ్బ నసాళానికి అంటింది. తాగిన నిషాలో ఉండడంతో వాడికి ఒళ్ళు, పైన తెలియలేదు. తండ్రిపై తిరగబడి ఒంగదీసి వీపుపై దబదబ కొట్టడం మొదలుపెట్టాడు వాడు. తల్లి అది చూడలేక అడ్డుపడింది. వెంటనే భేతాళుడు తల్లిచెయ్యి మెలిదిప్పి విరిచేశాడు.

అర్ధరాత్రి సమయంలో ఆమె పెట్టిన కేకలకి ఇరుగుపొరుగుల వాళ్ళు లేచి పరుగున వచ్చారు. అందరూ తలోమాటా మాటాడడంతో అక్కడ కలకలం మొదలయ్యింది. కొందరు, తెల్లవారి ఆసుపత్రికి వెళ్ళేలోగా, ఆమె చేతికి ఉపశమనంగా ఉండేలా ఏదైనా వైద్యం చేయాలని చూస్తూంటే, మరికొడరు భేతాళుడి మొహాన దుమ్ము చెరిగి పొయ్యసాగారు. ఇది పోలీసులకు చెప్పి, కొన్నాళ్ళపాటు వాడిని జైల్లో పెట్టిస్తేగాని వాడికి బుద్ధి రాదు - అని తీర్మానించారు. మంచి కోపం మీద ఉండడంతో శరభయ్యకూడా దానికి ఒప్పేసుకున్నాడు. భేతాళుడికి అది నచ్చలేదు. వాళ్ళకు దొరక్కూడదని, హఠాత్తుగా అందరినీ తప్పించుకుని చీకటిలోకి బాణంలా, ఎవ్వరికీ అందకుండా రివ్వున దూసుకుపోయి, ఎవరికీ అందకుండా పరుగుపరుగున పారిపోయాడు.

#########

ఎవరికీ దొరక్కుండా ఆ చీకట్లో వాడు అలా పరుగు పెట్టిపెట్టి, “హైవే” మీదికి వచ్చాడు. మంచి అలవాట్లు లేక దుర్బలుడైన వాడికి ఇక పరుగుపెట్టే శక్తి లేదనిపించింది. అవి కృష్ణ పక్షపు రోజులు కావడంతో అప్పుడప్పుడే వెన్నెల వెలుగు పొడజూపుతోంది. ఆ చిరు వెలుగులో వాడికి రోడ్డు పక్కన ఒక లారీ, నిండా కొబ్బరికాయలతో ఉన్నది, కనిపించింది. ఆ లారీలో మనుష్యులు ఎవరూలేరు. ఇదే మంచి సమయమని, భేతాళుడు వెనకబారుగా ఆ లారీ ఎక్కి, కొబ్బరికాయలమధ్య ముడుచుకుని పడుకున్నాడు. వెంటనే అలసి ఉన్న వాడికి  కళ్ళు మూతలుపడ్డాయి.

ఆ లారీ హైదరాబాదులో అమ్మడానికి కొబ్బరిబొండాలు తీసుకెడుతోంది.

డ్రైవరుకి కాలుమడుచుకునే అవసరం రావడంతో, రోడ్డువార లారీ ఆపి, దిగి కొంచెం పక్కకి వెళ్ళాడు. పని పూర్తిచేసుకుని వచ్చి, లారీ ఎక్కి, దాన్ని పట్నం వైపుగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ లారీలో భేతాళుడు ఉన్న సంగతి ఆ డ్రయివర్కి తెలియదు. రాత్రంతా ప్రయాణం చేసి చేసి, తెలతెలవారుతున్న వేళలో ఆ లారీ ఒక లెవెల్ క్రాసింగును చేరింది. గేటు మూసి ఉండడంతో అక్కడ అది ఆగింది. డ్రైవర్ ఇంజన్ ఆపేసి, క్రిందకు దిగాడు. రైలు వచ్చి వెళ్ళాకగానీ గేటు తెరవబడదు. పది నిముషాలు గడిచాక గాని రైలు రాలేదు.

ధనాధనా చప్పుడు చేసుకుంటూ పట్టాలపై వేగంగా వస్తున్న రైలు సిగ్నల్ పడకపోవడంతో గేటు పూర్తిగా దాటాకముందే ఆగిపోయింది. రైలు వేసినకూతతో మెలకువ వచ్చింది భేతాళుడికి. వాడు రైలును చూడడం అదే మొదటిసారి కావడంతో, లారీ దిగి రైలు దగ్గరకు వచ్చాడు. రైల్లోని కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు రైలు దిగి, అటూ ఇటూ మట్టిలో పచార్లు చెయ్యసాగారు. అంతలో సిగ్నల్ స్తంభం మీది రెక్క వాలింది.

బయలుదేరుతున్నదానికి హెచ్చరికగా రైలు కూసి, కదిలింది. క్రిందికి దిగినవాళ్ళు కంగారు పడుతూ గబగబా రైలు ఎక్కేశారు. వాళ్ళతోపాటుగా భేతాళుడు కూడా ఆ రైలు ఎక్కేశాడు.

"కొత్తొక వింత, పాతోక రోత" అంటారు. అలా కొత్త కావడంతో రైలు ప్రయాణం మంచి సరదాగా అనిపించింది భేతాళుడుకి. సరదా తీరా రైళ్లు ఎక్కుతూ దిగుతూ, అవి తనని ఎటు తీసుకుపోతున్నాయో కూడా గమనించకుండా, సరదాగా కొన్నిరోజులు గడిపేశాడు. జేబులో, పాప చెవిరింగులు అమ్మిన డబ్బు ఉన్నంతవరకూ అవీ ఇవీ కొనుక్కుతిన్నాడు. తనదగ్గరున్న డబ్బులు అయ్యిపోగానే అడుక్కు తిన్నాడు. నిద్రవస్తే పై బెర్తు ఎక్కి నిద్రపొయేవాడు. మధ్య మధ్య టికెట్ కలక్టర్లకి దొరికిపోయేవాడు. టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కినందుకు వాళ్ళు మందలించి రైలు దింపేసేవారు. ఒక రైలు దింపితే మరో రైలు ఎక్కేవాడు. అలా పదిరోజులు గడిచాయి. వాడికి తల్లిదండ్రులు గుర్తొచ్చారు.

"ఏడనీయి, ఏడనీయి! మా బలే శాత్తి సేశా నాళ్ళకి. నేనేమైపోయానో తెలీక బెంగపడి తీసుకు తీసుకు సత్తారు" అనుకున్నాడు ప్రగల్భoగా. అమ్మా నాన్నలకు శిక్ష వెయ్యగలిగినందుకు వాడి మనసులో ఒకమూలగా రవంత గర్వం కూడా పొడజూపింది.

వాళ్ళకి తనపైనున్న ప్రేమ ఎంత ఎక్కువో వాడికి తెలుసు. కానీ అది వాడు వాళ్ళను తనకు చెయ్యిలోకువగా చేసుకునేందుకు ఉపయోగించుకున్నాడేగాని, ఏనాడూ విశ్వాసంతో తిరిగి వాళ్లని ప్రేమతో గౌరవంగా చూసి సంతోషపెట్టిన పాపాన పోలేదు.

ఒకరోజు టికెట్ కలెక్టర్ రైలు దింపెయ్యడంతో ఫ్లాట్ఫారం మీద తిరుగుతూ మరో రైలు రాక కోసం ఎదురుచూస్తూన్న భేతాళుడికి అదోలా అనిపించింది. గొంతుక బొత్తిగా ఎండిపోయినట్లు తోచడంతో, నీళ్లు తాగుదామని కుళాయి దగ్గరకు వెళ్ళాడు. కానీ కుళాయిలో నీరు రాలేదు. అంతలో ఒక రైలు ఫ్లాట్ఫారం మీదకి రావడంతో, దాన్ని ఎక్కాలని పరుగెత్తిన భేతాళుడు కళ్ళు తిరిగి ఫ్లాట్ఫారం మీద ఉన్నబడంగా పడిపోయాడు. అంతలో వాడికి స్పృహ పోయింది.

#########

భేతాళుడు మళ్ళీ కళ్ళుతెరిచే సరికి గవర్నమెంటు హాస్పిటల్ లో జనరల్ వార్డులోని బెడ్డుపైన విపరీతమైన జ్వరంతో పడివున్నాడు. వాడికి వచ్చింది టైఫాయిడ్ జ్వరం అన్నారు. ఆ తరవాత బాష తెలియని ప్రదేశంలో, మంచం దిగలేని స్థితిలో వాడు పడిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు. ఎట్టకేలకు జ్వరం తగ్గింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జైనాడు. చూడ చుట్టమూ, మ్రొక్క దైవమూ లేని నికృష్ట దశలో, వల్లమాలిన నీరసంతో అడుగు ముందుకు వెయ్యలేని స్థితిలో వాడు ఆసుపత్రి బయట కాలుపెట్టి, తిండికోసం అడుక్కోడం మొదలుపెట్టాడు. కానీ, “యాచకః యాచకో శత్రు:” అంటారు. అడుక్కునే వాడికి అడుక్కునే వాడే శత్రువు - అంటారు. సరిగ్గా అలాగే జరిగింది. అంతకు ముందునుండీ అక్కడ అడుక్కునే వాళ్ళకి ఈ కొత్తబిచ్చగాడు కంటకమయ్యాడు. ఒకరి మాట ఒకరికి తెలియకపోడంతో వాళ్ళు, భేతాళుడు అప్పటివరకూ అడుక్కుని సంపాదించిన డబ్బులు కాసినీ ఊడలాక్కుని, వాడి బట్టలు చింపి, జుట్టు పీకి అల్లరి పెట్టి వాడిని ఏడిపించి, ఆ విధంగా వాడు అక్కడ బిచ్చమెత్తుకోడానికి వీలులేదన్నది తెలియజేసి వెళ్ళిపోయారు. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో భేతాళుడు ఏడుస్తూ వాళ్ళని తల్లిభాష యైన తెలుగులో తనకు వచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలుపెట్టాడు. అలా తెలిసిందన్నమాట అప్పలకొండకి వాడు తెలుగువాడనీ, ఆపదలో ఉన్నాడనీను. అప్పలకొండ కూడా తెలుగుదేశం నుండి వచ్చినవాడే! అతడు రొయ్యపప్పు వ్యాపారి. శ్రేష్ఠ మైన రొయ్యపప్పు కొనడంకోసం కేరళ దేశం వచ్చాడు.

తెలుగువాడని అర్ధంచేసుకుని, వాడి పరిస్థితికి జాలిపడి భేతాళుణ్ణి పలకరించి విషయమడిగాడు. ఉన్నదున్నట్లుగా చెపితే వాడు భేతాళుడే కాడు. అంతా మార్చి తన గురించి, తను పడుతున్న కష్టాలను గురించి కథలల్లి చెప్పాడు...

వృద్ధులైన తల్లిదండ్రుల్ని విడిచి బతుకుతెరువును వెతుక్కుంటూ, ఇటు వచ్చినట్లుగా చెప్పాడు. తాను జాలరివాడనీ, ఇక్కడ వేరొక జాలరి దగ్గర పని చేస్తూ కులవిద్యలోని మెళకువలు తెలుసుకోవాలని కేరళ వచ్చినట్లుగా చెప్పి, భాష తెలియకపోడం వల్ల ఎవరిని కలుసుకోవాలో తెలియక అల్లాడుతున్నట్లూ, సరిగ్గా అదేసమయంలో జబ్బుపడి మరింత ఇబ్బందుల్లో పడ్డట్టూ చెప్పాడు. తాను జబ్బుపడి ఒళ్ళుతెలియని స్థితిలో ఉన్నప్పుడు, తన బట్టలూ, తను తెచ్చుకున్న డబ్బూ కూడా ఎవరో ఎత్తుకుపోయారనీ, చివరకు అడుక్కోడానికి కూడా కుదరకుండా చేశారనీ చెప్పుకు ఏడిచాడు వాడు. భేతాళుడు చెప్పిన కథకు అప్పలకొండ మనసు కరిగి నీరయ్యింది. ఎలాగైనా వాడికి సాయం చెయ్యాలనుకున్నాడు. వెంటనే తన కేరళ మిత్రుడైన జాలరి అయ్యప్ప దగ్గరకు భేతాళుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళాడు. అప్పలకొండ చెప్పింది విని, మరి ఆలోచించకుండా భేతాళుణ్ణి తన కమతంలో చేర్చేసుకున్నాడు అయ్యప్ప.

అయ్యప్ప తోటి జాలర్లకు తలమానికం లాంటివాడు. వృత్తికి మత్యకారుడైనా జ్ణాని, వితరణశీలి. ఒక పెద్ద సమిష్టి కుటుంబానికి యజమాని. కులవృత్తిని గౌరవించేవాడు. నాటుపడవలపై సముద్రంలో చేపలవేట చేసేవాళ్ళకి అతడు నాయకుడు. మూడుతరాలవాళ్ళు ఒకే పెద్ద ఇంట్లో ఉంటూ, పరస్పర సహకారంతో కులవృత్తిని చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు వాళ్ళు. అలాంటి ఇంట్లో పెట్టాడు అప్పలకొండ భేతాళుడిని. గాదికింది పందికొక్కులా, ఏలోటూ లేకుండగా ఆ సమిష్టి కుటుంబంలో ఒకడుగా బ్రతికేస్తున్నాడు వాడు. 
మిగతా రోజులు ఓ మాదిరి శ్రమతో గడిచిపోయినా రొయ్యల సీజన్ వచ్చిందంటే మాత్రం అక్కడున్న వాళ్ళందరికీ చేతినిండా ఎడతెగని పని ఉంటుంది. సీజన్ వస్తే చాలు, ఆరేబియా సముద్రంలో శ్రేష్టమైన రొయ్యజాతులు అసంఖ్యాకంగా పుట్టుకొస్తాయి. ఆ రొయ్యల్ని, కొందరు పడవలపై వెళ్ళి వలలుపన్ని, తోడి తెస్తూంటే - ఒడ్డునున్నవాళ్ళు వాటిని ఆవిరి పట్టీ, క్యూర్ చేసీ, ఐసు పెట్టేల్లోవుంచి లారీలకెత్తి దూరప్రాంతాలకి ఎగుమతి చేస్తారు. కొందరు రొయ్యపప్పు తయారీలో బిజీగా ఉంటారు. ఇలా ఎడతెగని పనులతో అయ్యప్ప కుటుంబీకులు యావన్మందీ రోజంతా సతమతమౌతూంటారు. ఈ మహా రసకంధాయనంలో భేతాళుడు, ఎవరైనా చూస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పని అందుకు చేస్తూ, ఎవరూ చూడకపోతే ఏమీ పట్టించుకోకుండా ఉంటూ, సాధ్యమైనంతవరకూ ఒళ్ళు అలవకుండా జాగ్రత్తపడుతూ అయ్యప్పగారి కమతంలో హాయిగా బ్రతికేస్తున్నాడు.

#########

అకస్మాత్తుగా పొలాల్లో విరుచుకుపడ్డ మిడతలదండులా, పడమటి సముద్రంలో లెక్కకుమిక్కిలిగా వచ్చిపడి, చేపల్ని వేటాడుతున్న స్టీమ్ బోట్లు కనిపించసాగాయి. పగలూ రాత్రీ అన్న భేదం లేకుండా అవి అరేబియా సముద్రాన్ని అల్లకల్లోలంచేస్తూ చేపల్ని దేవి తీసుకు పోతున్నాయి. చూస్తూండగా తీరజలాల్లో చేపలసంఖ్య అనూహ్యంగా తగ్గిపోతూవుండడంతో, నాటుపద్ధతిని వేట సాగించే వాళ్ళకి దొరికే చేపలసంఖ్య రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోసాగింది. దాంతో పశ్చిమతీరంలోని బెస్తవాడల్లో కలకలం ప్రారంభమయ్యింది. భారతదేశపు తీరజలాల్లో చేపలను పట్టేందుకు నార్వేదేశం మనదేశంతో ఒప్పందంతో ఒప్పందం కుదుర్చుకుందని  తెలియడంతో, ఇది అన్యాయమంటూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు జాలర్లు. కానీ ఫలితం శూన్యం కావడంతో అనూహ్యమైన రీతిలో ప్రతిఘటన మొదలయ్యింది. తెగింపుతో కేరళలోని బెస్తలు ఒడ్డున ఆఫీసులు పెట్టుకున్న నార్వే కంపెనీలతో తలపడ్డారు. ఇరుపక్షాల మధ్య పరస్పరం తిట్టుకోడాలు, కొట్టుకోడాలు, ఆస్తులు తగలపెట్టుకోడాలు, చంపుకోడాలు  ముమ్మరమయ్యాయి. ఒడ్డునున్న మరపడవలను, వాటి తాలూకు ఆఫీసులను తగలబెట్టారు. వాటి ఏజంట్లకు బ్రతుకు దుర్భరమయ్యింది. మరపడవలను రేవుకు తీసుకురావడానికి భయపడసాగారు.

నార్వే వాళ్ళ ఏజంట్లలో ముఖ్యుడు కరడి భీముడు. అతనికి ఎలాగో భేతాళుని గురించి తెలిసింది. వాడికి డబ్బు ఆశ చూపించి తనవైపుకి తిప్పుకున్నాడు. నీచుడైన భేతాళుడు ఏమాత్రం సంకోచించకుండా డబ్బుకోసం స్వామిద్రోహానికి ఒడిగట్టాడు. “ఎలా సంపాదించినా రూపాయి విలువ నూరు నయాపైసలే” అన్నది వాడి సిద్ధాంతము.

స్టీమ్ బోట్ల వాళ్ళతో వివాదం మొదలయ్యింది లగాయితూ నాటుపడవలమీద వేటచేసీవాళ్ళందరూ జాలరి అయ్యప్ప ఇంట్లో సమావేశమై ఏమిచెయ్యాలన్నదాన్ని గురించి చర్చలు జరుపుకునే వాళ్ళు. ఇంట్లో మనిషిగా మసిలే భేతాళుడు వాళ్ళ మాటలను విని, ప్రతిపక్షాలవాళ్ళకి గుట్టూమట్లన్నీ చేరవేసి డబ్బు తీసుకునే వాడు.
అయ్యప్ప కూటం లోని జాలర్లు, ఎంతో పకడ్బందీగా తాము ప్లానుచేసుకున్న వ్యూహాల్లో కొన్ని ఫలించకపోడానికి కారణం ఏమిటో తెలియక బాధపడేవారు. ఐనా వాళ్ళు విజయమో, వీరస్వర్గమో అనుకుని ముందంజ వేశారే గానీ ఎంతమాత్రం పట్టు విడవలేదు. చాలా జననష్టం ఆస్తి నష్టం జరిగింది. పోరు భయంకరరూపం దాల్చే సరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పెద్దలందరూ జేరి, ఇరుపక్షాల సమ్మతితో ఒక ప్రణాళికను తయారు చేశారు. ఒడ్డునుండి ముప్ఫై కిలోమీటర్ల దూరం వరకు ఉన్న సముద్రాన్ని నాటుపడవల వాళ్ళకు వదలి, ఆ పైనున్న సముద్రజలాల్లో మాత్రమే నార్వే నుండి వచ్చిన మరపడవలవాళ్ళు వేటచెయ్యాలి - అని తీర్మానించారు. ఆ ఒప్పందంపై ఇరుపక్షాల వాళ్ళు సంతకాలు చేశారు. అక్కడితో తీరంలో శాంతి నెలకొంది. వెనకటి స్నేహాలు మళ్ళీ పుంజుకున్నాయి.

కేరళలో అక్షరాస్యుల సంఖ్య ఎక్కువ. అక్కడి వాళ్ళు ఎంత చదువుకున్నా కులవృత్తిని నిరశించరు. కరడి భీముడు, జాలరి అయ్యప్ప ఒకప్పుడు స్నేహితులు, కలిసి చదువుకున్నవాళ్ళు. వృత్తి పరంగా వాళ్ళమధ్య అభిప్రాయభేదాలు వచ్చినా, గొడవలు సద్దుమణగగానే మళ్ళీ పాతస్నేహం తలెత్తడంతో ఇద్దరూ ఒకటయ్యారు. ఒకరోజు మాటలమధ్య భేతాళుడుని గురించి మిత్రుడు చెప్పినది విని నిర్ఘాంతపోయాడు అయ్యప్ప. భేతాళుడు ఎంత నీచుడో తెలిసిపోయింది అందరికీ.

"ఇంత స్వామిద్రోహం చేస్తాడా! వీడిని నరికి సముద్రం లోని చేపలకు పార వేసినా పాపంలేదు. ఉండు, వీడి పనిపడతా" అంటూ లేచాడు అయ్యప్ప చిన్న కొడుకు.

"ఇలాంటి విషప్పురుగు బ్రతికుంటే మళ్ళీ ఎవరికో ద్రోహం తలపెట్టకపోడు! చంపిపారెయ్యడమే మంచిది" అంటూ కత్తి నూరడానికి లేచాడు అయ్యప్ప మేనల్లుడు.

వేళ కావడంతో, భోజనానికని గుమ్మందాకా వచ్చిన భేతాళుడి చెవిన పడ్డాయి ఆ మాటలు. వాడి గుండె బేజారయ్యింది. ప్రాణాలు దక్కించుకోడానికి ఎవరికంటా పడకముందే పారిపోవడం ఒక్కటే మార్గం - అనుకున్నాడు. వెంటనే కాలికి బుద్ధిచెప్పి, రైలు స్టేషన్ వైపుగా పరుగు లంకించుకున్నాడు.

ధనాశా పిశాచికి తన ఆత్మను కుదువబెట్టి, చెదపురుగులా తనకు ఆశ్రయమిచ్చిన వాళ్ళకే ద్రోహం తలపెట్టి భేతాళుడు సంపాదించిన డబ్బు మొత్తం, వాడికి అందుకోలేనంత ఎత్తులో, అయ్యప్ప తాలూకు గొడ్లపాకలోని అటకమీదున్న గడ్డికి అడుగునున్న అట్టపెట్టెలో పదిలంగా ఉండిపోయింది. భేతాళుడు మాత్రం కట్టుబట్టలతో, కానిడబ్బు చేతిలో లేకుండా, ఎలా వచ్చాడో అలాగే, అప్పుడే స్టేషన్ విడిచి పోబోతున్న రైలులోకి - ప్రాణాలను దక్కించుకోడం కోసమని ఎక్కేశాడు తెగింపుగా.

ఆ తరవాత రొయ్యపప్పు కోసం కేరళ వెళ్ళిన అప్పలకొండకు జరిగినదంతా చెప్పాడు అయ్యప్ప కొడుకు. సాటివాడనీ, ఆపదలో ఉన్నాడనీ భేతాళుడికి మేలుచేసినందుకు ప్రతిఫలంగా, వాడు చేసిన స్వామిద్రోహానికి తలవంచుకుని అయ్యప్పముందు నిలబడి అప్పలకొండ క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. ఆ తరవాత భేతాళుడు తన ఊరని చెప్పిన చోటుకు వెళ్ళి అప్పలకొండ వాకబు చేస్తే, అక్కడ అలాంటివా డెవడూ లేడనీ, అసలు ప్రత్యేకం బెస్తవాడన్నదే అక్కడ లేదనీ తెలిసింది.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్