Kummi

ధారావాహిక నవల

గత సంచిక తరువాయి »

"కావచ్చు. కానీ నాకు బిట్టు చెంత లభించిన చనువు, చొరవ మీ చెంత ఉంటుందని అనుకుంటున్నాను" అని అంది కుమ్మీ.

"కేవలం మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన ధోరణిలో నేను అలా మీతో మాట్లాడేను. మీ ముందు అంతేలా తిరిగాను. దానిని మీరు మీ ధోరణిలో స్వీకరిస్తున్నారు. అది మీరు గుర్తించాలి." అని చెప్పాడు శేఖర్ నిదానంగానే.

"సరే. పెద్దల భావాలు, సడలింపుతో సరళంగా, నేటికి తగ్గట్టుగా ఉండాలి అని కోరుకుంటున్న వారు మీరు. అవునా?" అని అడిగింది కుమ్మీ.

"అవును. వస్తున్న మార్పులుకు తగ్గట్టుగా అంతా మెసులు కోవడం మంచిది అనుకుంటున్నాను" అని చెప్పాడు శేఖర్.

"కదా. మీకు భార్య లేదు. నేను నా లవర్ని కోల్పోయి ఉన్నదానిని. పైగా నేను మీలో ఆ నా లవర్ని చూసుకుంటున్న దానిని. కనుక మనం మన పెళ్లికి మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాను" అని చెప్పేసింది కుమ్మీ.

శేఖర్ గబుక్కున ఏమీ అనలేదు. కుమ్మీని చూస్తూ ఉండిపోయాడు.

"ఏమంటారు" అడిగింది కుమ్మీ ఆగి.

"నాకు ఆ ఆలోచనలేదు. రాలేదు" అని చెప్పాడు శేఖర్.

"పోనీ ఇప్పడు చెప్పండి." అంది కుమ్మీ.

"నాలో మీకు మీ బిట్టు మళ్లీ కనిపించాడు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను అర్ధం చేసుకున్నాను. కానీ నాలో మళ్లీ పెళ్లికి ఏ తలంపు లేదు, రాలేదు. కనుక ఇప్పటికిప్పుడు ఏమీ తేల్చలేను. నన్నూ అర్ధం చేసుకోవాలి మీరు" అని అన్నాడు శేఖర్ కాస్తా ఇబ్బందిగానే.

"సరే. ఇప్పటికిప్పుడు ఏమీ తేల్చుకోలేను అంటే, ఆలోచిస్తాననేగా. కనుక ఆలోచించే చెప్పండి. నేను వేచి ఉంటాను" అంది కుమ్మీ.

శేఖర్ మరేమీ మాట్లాడలేదు. మరి ఈ సంభాషణ పెంచరాదు అనే భావంతో అతను ఉన్నాడు.

కుమ్మీ, "నేను మళ్లీ కలుస్తాను. ఈ సారి మనం కలిసినప్పటికి మీరు తప్పక పాజిటివ్ ఆలోచనకు రావాలని కోరుకుంటున్నాను" అని వెళ్లిపోయింది అక్కడ నుండి.

శేఖర్ కాఫీ బిల్లు చెల్లించి అక్కడ నుండి కదిలాడు.

*** *** *** ***

జాబ్ రీత్యా ఏర్పడిన పని ఒత్తిడితో బిజీగా ఉన్నాడు శేఖర్ గత వారం రోజులు నుండి.

ఆఫీస్ టైమింగ్స్ కూడా పాటించ లేక పోతున్నాడు. త్వరగా వస్తున్నాడు, ఆలస్యంగా వెళ్తున్నాడు. వేళలు దాటి తిండి తింటున్నాడు. దాంతో కాస్తా అనీజీ ప్రదర్శిస్తున్నాడు.

ఆ తీరులోనే ఉన్నాడు శేఖర్ ప్రస్తుతం ఆఫీసులో.

అప్పుడే, తన ఎదురుగా వచ్చి తచ్చాడుతూన్న వారికై తలెత్తాడు.

అంతే, ఆ వచ్చిన వారు శేఖర్ని చూసి భయపడిపోయారు.

నోళ్లు చాపి కొద్దిసేపు అలా ఉండిపోయారు.

"ఏం కావాలి" అన్నాడు శేఖర్ కాస్తా చిరాకుగానే.

వాళ్లు కదిలారు. వాళ్లు బిట్టు సొంత మనుషులు. ఒకరు బిట్టు తండ్రి. మరొకరు బిట్టు మామయ్య.

ఆ ఆఫీస్ పని పడి వచ్చారు. హెడ్ క్లర్క్, శేఖర్ సీట్ వద్దకు పంపాడు వీళ్లను.

"ఏమిటి. ఎందుకు వచ్చారు" అని అడిగాడు శేఖర్ ఇబ్బందిగానే.

"మీరు, నువ్వు..." అని అంటున్నాడు బిట్టు తండ్రి.

శేఖర్‌కు ప్రస్తుతం తను ఉన్న స్థితి మూలంగా, మరింత అనీజీగా కదిలి, "ఏమిటా తడబాటు దెయ్యాని చూస్తున్నట్టు" అని అన్నాడు అరిచినట్టే.

"అదే, ఏదో, అలానే మాకు అనిపిస్తోంది" అన్నాడు బిట్టు మామయ్య కంగారులా.

"ఏమిటీ నేను దెయ్యాన్నా" అని అనేశాడు శేఖర్ కోపంగానే.

"మాకు ఏమీ అర్ధం కాకుంటుంది" అన్నాడు బిట్టు తండ్రి.

"ఆ హెడ్ సారూ, శేఖర్ గారిని కలవండి అంటూ మీ వద్దకు పంపారు. మీరు శేఖర్ కాదు" అన్నాడు బిట్టు మామయ్య భయం భయంగా.

"ఏమిటీ నేను శేఖర్ని కానా. నేను శేఖర్‌నే." చెప్పాడు శేఖర్.

"ఏమో, మీరు మా బిట్టులా అనిపిస్తున్నారు" చెప్పేశాడు బిట్టు తండ్రి.

"ఏమిటీ, మీకు పిచ్చి ..." అంటూ ఆగి వాళ్లను చూస్తూ, "మీది ఏ ఊరు" అని అడిగాడు శేఖర్ కాస్తా తగ్గుతూ.

వాళ్లు చెప్పారు.

శేఖర్ సర్దుకుంటున్నాడు. కుమ్మీ చెప్పినది గుర్తుకు తెచ్చుకున్నాడు.

"మీ బిట్టులా ఉన్నానా" అన్నాడు శేఖర్.

"అవును. అదే మిమ్మల్ని చూస్తుంటే మా బిట్టును చూస్తున్నట్టే ఉంది" చెప్పాడు బిట్టు తండ్రి.

"అవును మా బిట్టూలానే ఉన్నారు. కానీ వాడు చనిపోయాడు. అందుకే మిమ్మల్ని చూడగానే మేము అదిరిపోయాం" అన్నాడు బిట్టు మామయ్య.

శేఖర్ ఏమీ అనలేదు.

వాళ్లు శేఖర్‌నే చూస్తూ ఉన్నారు.

"ఆఁ ఆఁ. నేను మీ బిట్టును కాదు. శేఖర్‌ను. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి" అని అడిగాడు శేఖర్ గబగబా.

"బోరింగ్‌కు కాగితం పెట్టుకోడానికి వచ్చాం. మీరు ఒప్పుకుంటేనే మా ఊరు బ్యాంకోళ్లు అప్పు ఇస్తామన్నారు. ఆ కాగితాన్ని హెడ్ సారు మీకు ఇమ్మంటే ఇలా వచ్చాం" చెప్పాడు బిట్టు తండ్రి.

ఆ కాగితం అందుకున్నాడు శేఖర్. చదివాడు. "సరే, మేము అన్నీ చూసి శాంక్షన్ ఐంది లేంది తెలుపుతూ  మీ ఇంటి అడ్రస్‌కే కాగితం పంపుతాం. అందుకు పదిహేను రోజులు వరకు ఆగండి. ఇక మీరు వెళ్లవచ్చు" అని చెప్పాడు.

వాళ్లు ఇంకా కదలలేదు. శేఖర్‌నే చూస్తున్నారు.

"నేను శేఖర్ని. మీ బిట్టును కాదు. పైగా మీ బిట్టు చనిపోయాడుగా. అది మీకు తెలుసు. మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నారుగా. ఇది అట్టిదే. మీరు వెళ్లండి" అని చెప్పేసి తిరిగి తన పనిలోకి వెళ్లాడు శేఖర్.

కొద్ది సేపు ఆగి, తిరిగి వెను తిరిగి వెళ్లిపోయారు ఆ బిట్టు మనుషులు. పైగా అలా వెళ్తూ చాలా మార్లు వెనుతిరిగి చూశారు.

వాళ్లు అలా వెళ్లిపోగానే పని ఆపి చాలా సేపు ఆలోచించాడు శేఖర్. పిమ్మట కుమ్మీకి ఫోన్ చేసి సాయంకాలం ఆఫీసుకు వచ్చి తనను కలవమని చెప్పాడు.

"ఆలోచించి పోజటివ్ నిర్ణయానికే వచ్చేశారా" అని అడిగింది కుమ్మీ వెంటనే.

"ఆ సంగతి కాదు. మరొకటి. కలవండి ప్లీజ్" అన్నాడు శేఖర్.

కుమ్మీ సరే అనేసింది.

*** *** *** ***

సాయంకాలం -

శేఖర్ ఆఫీసులో ఆ చెట్ల నీడన బెంచీ మీద కూర్చున్నారు శేఖర్, కుమ్మీలు పొందికగా.

మాట్లాడుకుంటున్నారు.

"అలాగ జరిగిందా. నా గురించి మీరు చెప్పారా" అంది కుమ్మీ కాస్తా బెరుకుగా.

"లేదు లేదు. అవేమీ కదప లేదు. వాళ్లు వచ్చారు. నన్ను చూశారు. నేను వాళ్ల బిట్టులా ఉన్నానన్నారు. నేను శేఖర్‌ను అని చెప్పాను. అంతే" అని చెప్పాడు శేఖర్.

"మొదట్లో వాళ్లకు నా మీద కోపం ఉంది. నా మీద కేసులు పెడతామన్నారు. మా ఊరు పెద్దలే నచ్చ చెప్పారు. అది లగాయితు నా వైపు కానీ నా వాళ్ల వైపు కానీ వాళ్లు రాలేదు." అని చెప్పింది కుమ్మీ.

శేఖర్ ఏమీ అనలేదు.

"ఇప్పుడు మిమ్మల్ని చూశారు. ఇక మీరు నాకు తెలుసు అన్నది వాళ్లకు తెలిస్తే ఏమవుతోందో" అంది కుమ్మీ భయంగా.

"ఏమీ కాదు లెండి. ఎట్టి భయం పెట్టుకోకండి" అన్నాడు శేఖర్.

"ఏమో. వాళ్లు ఆవేశపరులు. బిట్టును కోల్పోయి ఉన్నారు. పైగా అందుకు కారణం నేనే అన్నారు" అని అంది కుమ్మీ డీలాగా. ఆ వెంటనే, "మీతో నేను తిరగడం వాళ్లు చూస్తే ఏమంటారో. నా మీద కోపంతో మీకు ఏ ముప్పు తెస్తారో" అని కూడా అంది కుమ్మీ.

"మీరు ఏవేవో ఊహించేసుకుంటున్నారు. భయపడిపోతున్నారు. అవి వద్దు. ఏమీ కాదనుకుందాం." అన్నాడు శేఖర్ కాస్తా ఇబ్బందిగానే.

కుమ్మీ ఏమీ అనలేదు.

"నేను మీతో ఇది కదపడానికి కారణం మీ ఊరు వాళ్లు, పైగా మీ బిట్టు సంగతి అని. అంతే కానీ ఇది చెప్పి మిమ్మల్ని బెంబేలు పర్చడానికి కాదు" అన్నాడు శేఖర్ కొద్దిపాటి అనునయంగా.

"ఏమో. ముందు ముందు ఏ ఉపద్రవం వస్తోందో" అంది కుమ్మీ.

"మీది తెరచాప లాంటి హృదయం." అన్నాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ.

"అదేమిటి అలా అనేశారు" అంది కుమ్మీ.

"మరే. మిమ్మల్ని చాలా వరకు గ్రహించగలిగాను. దయచేసి మీరు స్థిర చిత్తంలోకి రండి. అదే మీకు రక్ష అవుతోంది." అన్నాడు శేఖర్.

"ఏమంటున్నారో నాకు తెలియడం లేదు" అంది కుమ్మీ చిత్రంగా తన కనురెప్పలు ఆడిస్తూ.

"అదే మొదట నా మాటలు మీకు అనుగుణంగా మార్చుకున్నారు. నాలో మీ బిట్టును చూసుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు వాళ్లు మనలను చూస్తే ఏమవుతోందో అంటున్నారు. ఇలా ఎక్కడా మీరు స్థిరంగా లేరు. అదే అంటున్నాను. మీరు తొలుత స్ధిమితం అవ్వండి. అప్పుడే మీరు ఒక స్థిరంతో ఆలోచించగలరు" అని చెప్పాడు శేఖర్.

కుమ్మీ తలాడించింది. కానీ తను అవుటాఫ్ మైండ్ లో ఉంది.

అది గుర్తించిన శేఖర్, "వెళ్లి కాఫీ తాగుదామా" అని అడిగాడు లేస్తూ.

కుమ్మా లేస్తూ, "వద్దు. రూంకు వెళ్తాను" అని అంది.

"సరే. ఏదీ పెద్దగా ఆలోచించకండి. బై" అని అనేశాడు శేఖర్.

"బై" అంటూ కుమ్మీ అక్కడ నుండి కదిలింది.

తను కనిపించినంత వరకు శేఖర్ అక్కడే నిల్చుని, పిమ్మట ఆఫీసులోకి నడిచాడు.

*** *** *** ***

పది రోజులు తర్వాత -

శేఖర్ పని ఒత్తిడి తగ్గింది.

ఈ మధ్య కుమ్మీ పత్తా కానరాక పోవడంతో అటు దృష్టి పెట్టాడు శేఖర్.

తను ఎలా ఉంది.

తను ఏం చేస్తోంది.

తను నన్ను ఎందుకు కలవలేదు.

తను ఏం ఆలోచిస్తుంది.

తను స్థిరం ఐందా.

తను స్థిమితం ఐందా.

ఇలా వరస పెట్టి ప్రశ్నించుకుంటున్నాడు శేఖర్, కుమ్మీ గూర్చి.

అలాగే అతడు దేనికీ సరైన సమాధానం పడలేదు.

ఇక ఎందుకు ఈ ఊగిసలాట అనుకున్నాడు అతడు.

కుమ్మీకి ఫోన్ చేశాడు.

కుమ్మీ ఫోన్ కలిపి, "మళ్లీ వాళ్లు వచ్చారా" అని అడిగింది.

శేఖర్ నిజంగానే అదిరాడు.

"ఏమిటండీ మీరు ఇంకా ఆ ఆలోచనల్లోనే ఉన్నారా" అన్నాడు గాభరాగా.

కుమ్మీ ఏమీ అనలేదు.

"దయచేసి కూల్ అవ్వండి. రేపు ఆదివారం. మనకు సెలవు. కనుక మీరు ఉదయం పదికి మనం కలిసే ఆ కాఫీ షాపు చోటుకు రండి. నేను వచ్చి ఉంటాను" అని చెప్పేసి ఫోన్ కట్ చేసేశాడు శేఖర్, కుమ్మీకి మరో ఎట్టి ఛాన్స్ లేకుండా.

*** *** *** ***

కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు కుమ్మీ, శేఖర్.

"రాత్రే మా నాన్నతో ఫోన్లో మాట్లాడేను. నాకు పెళ్లి సంబంధాలు చూడడం ఎంత వరకు వచ్చిందని" అని చెప్పింది కుమ్మీ.

వింతయ్యాడు శేఖర్.

"త్వరగా ఏదో పెళ్లి చేసేసుకుంటాను. ఒంటరిగా ఉంటే ఏవో ఆలోచనలు. నాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా బిట్టు తలంపు నాకు కుదరదు." అని అంది కుమ్మీ.

శేఖర్ ఇంకా తేరుకోలేదు.

"నా వలన ఇక మరెవరికీ నష్టం రాకూడదు" అని చెప్పింది కుమ్మీ.

శేఖర్ తల విదిలించుకున్నాడు. "మీరు దయచేసి ఆ మాటలు ఆపండి. కొద్ది సేపు ఆగితే నేను మాట్లాడతాను." అంటూ కాఫీ తాగడం ఐందనిపించి ఖాళీ కప్పును తమ మధ్యన ఉన్న టేబుల్ మీద ఓ పక్కన పెట్టి గుండె నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా దాన్ని ఒదిలి పెట్టాడు.

అర నిముషం తర్వాత, కుమ్మీని చూస్తూ శేఖర్, "నేను చెప్పేది పూర్తిగా వినండి." అంటూ, "మీరు నిజంగా మంచివారు, కానీ అస్థిరులు. ప్రతిదీ మీరు సాగతీసుకుంటారు. ఎక్కడిదక్కడ కట్ చేసెయ్యరు. అందుకే మరోలా అనుకోవద్దు ఈ మీ జాఢ్యం వలనే మీరు బిట్టును కోల్పోయారు. నిజంగా ఇది నిజం. లేకపోతే అప్పుడే మీరు సంయమనంగా నడిచి ఉంటే ఇప్పుడు మీ అనుభవం మరోలా ఉండేది. సరే అది ఐపోయింది. వదిలేయండి. ఇకనైనా మీరు కుదురుగా ఆలోచించండి. మంచి అనిపిస్తే నెరవేర్చుకోడానికే పంతం పట్టండి. అంతే కానీ మీ మూలంగా ఎదుట వారికి ఏదో అవుతోందని మిమ్మల్ని మీరు వంచించుకోకండి. ముందుగా మీరు కచ్ఛితంగా ఉంటే ఎదుటవారిని అందుకై ఒప్పించుకోవచ్చు. అదే లేకపోతే మీ ఆలోచనలు నవ్వులుపాలవుతాయి, నవ్వులుపాలు చేస్తాయి" అని చెప్పి ఆగాడు.

కుమ్మీ వింటుంది.

"ఏమంటున్నారు, ఆ బిట్టు మనుషులు మనల్ని చూస్తే ఎలా రియాక్టు అవుతారో అని కదా. చూడండీ మీరు అనుకుంటున్నట్టు వారు ఏమీ రెచ్చిపోరు. అలాగే మీ మూలంగా వాళ్లు నన్ను ఏమీ చేయరు. వాళ్లు నాలో వాళ్ళ బిట్టూనే చూసుకుంటారు తప్పా ఏం కాదు. నిజానికి మీ పెద్దలు మాదిరి గానే బిట్టు మనుషులు తమకున్న పట్టింపులు వలన మీకు బిట్టుకు పెళ్లి వద్దన్నారు కానీ మీ ఇద్దరి ప్రేమను వాళ్లు కాదనలేదు. బిట్టు అంతట బిట్టు చని పోయాడు తప్పా అతడి మనుషులు అతడిని చంపేయలేదు. ఎంతైనా ఎవరు ఎవరు బిడ్డను చంపేసుకుంటారు. బిట్టూయే లేడు అని తెలిసిన అతడి మనుషులు మీ స్వవిషయాలు మరి ఎందుకు పట్టించుకుంటారు. ఇక ఇప్పుడు మీ మీద వాళ్లకు పంతం ఎందుకు. కక్ష ఎందుకు. మీ ఆలోచనే తప్పు. మీరే ఆ కావేశాన్ని, ఆవేశాన్ని వదిలేయాలి" అని చెప్పాడు శేఖర్.

కుమ్మీ తల దించుకుంది.

"ముందు ఆ కాఫీ తాగండి. చల్లారి పోతోంది" అన్నాడు శేఖర్.

కుమ్మీ తాగలేదు.

మళ్లీ చెప్పాడు శేఖర్.

కుమ్మీ ఇప్పుడు ఆ కాఫీ గబగబా తాగేసి ఖాళీ కప్పును పక్కకు తోసింది.

"నా మాటలు మీకు నొప్పిస్తే నన్ను మన్నించండి. కానీ నేను చెప్పిందాంట్లో యదార్థమే ఉంది. నింపాదిగా ఆలోచించండి నా కోణంలో. మీరూ ఒప్పుకుంటారు అవునని." చెప్పాడు శేఖర్.

కుమ్మీ తలెత్తింది. శేఖర్ని చూసింది.

అతడూ ఆమెనే చూస్తున్నాడు.

ఆ పిమ్మట నెమ్మదిగా ఇద్దరూ తమ చూపులును మార్చుకున్నారు.

ఆ తర్వాత ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు కొంత సేపు.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్