హెచ్చరిక
- ఆచంటహైమవతి

 


గత సంచిక తరువాయి »

"పిన్నీ....ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకవేంటి?" అంటూ కళ్యాణి చేతిని కుదిపేసరికి పూర్వ జ్ఞాపకాలనుంచి -ఇహలోకానికి వచ్చి పడింది కళ్యాణి.

"తాను బావగారి కొడుకుతో కబుర్లు చెప్తూ, ఆ పిల్లాడు వేస్తున్న బొమ్మని మెచ్చుఁకుంటూ అలా అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఈ పాటికి 'కూర' మాడి, మసైపోయి బొగ్గుల రూపం దాల్చి ఉంటుంది" అనుకుంటూ గాబరాగా లేచి వంటింట్లోకి పరుగెత్తింది కళ్యాణి.

కూర బాగా ఇగిరి, చక్కగా పూర్తై 'డిష్' లో విశ్రాoతి తీసుకుoటోoది.

ఆ పక్కనే తోడికోడలు చిరునవ్వుతో కనిపించింది. కృతజ్ఞతా భావంతో ఆమె వైపు చూసి, తలవంచుకుoది కళ్యాణి.

"పరవాలేదులే! నేను కూడా ఇలాగే అప్పుడప్పుడు 'తీపి' జ్ఞాపకాల్లోకి ప్రయాణం చేస్తూ ఉంటాను. అప్పుడిలాగే 'అత్తయ్య' సర్దుకుపోతుంటారు" అంటూ కళ్యాణి భుజం తట్టిందామె.

"నిజంగానే నేను అదృష్టవంతురాలిని అక్కా! గిరీష్ చెప్పినట్లు నేను కూడా తొందరపడి, తప్పు మార్గం పట్టిఉంటే .... ఇంత చక్కని ఆత్మీయుల్ని కోల్పోయి ఉండేదాన్ని. ఆ పరిస్థితి తల్చుకుంటే ఇప్పటికీ నా గుండె 'లయ' తప్పుతుంది" అంది సజల నేత్రాలతో కళ్యాణి.

"ఒద్దులే కళ్యాణీ! చేదు జ్ఞాపకాల్నితరిమేయాలి. తీపి జ్ఞాపకాల్ని నెమరువేసుకుని ఆనందించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది అదేగా! భూతకాలాన్నిగురించి ఆలోచించి ప్రయోజనంలేదు. గడిచిన కాలం వెనక్కి రాదుగదా!! కానీ....ఆ అనుభవాలతో మనం చెడుదారికి పోకుండా నియంత్రిoచుకోగలగాలి. భవిష్యత్తుని గురించి అతిగా ఆలోచించి, ఆశించి మనల్ని మనం కలవరపరచుకోకూడదు. ఇక మనకు మిగిలింది వర్తమానం! అంటే ప్రస్తుత కాలం. దాన్ని 'దీప్తి' వైపు మళ్లిoచుకుంటూ, కర్తవ్యాలను నెరవేరుస్తూ మున్ముoదుకు పయనించటమే మన ధ్యేయమూ - ధర్మమూను" అందామె కళ్యాణితో!

"చూశావా అన్నయ్యా! నే చెప్పలేదూ? వదిన ఏ సందర్భంలోనైనా భగవద్గీత....పురాణాలు, శ్రీ కృష్ణపరమాత్మ .... సర్వాoతర్యామి అంటూ ఉపన్యసిస్తూ ఉంటుందనీ?" కొంటెగా అంటూ పెద్దన్నగారి భుజానికి వేల్లాడుతూ అక్కడికొచ్చింది యమున.

"నేను నమ్మిన మార్గాన్నే నలుగురికీ చెప్తూంటాను...అందులో తప్పేంలేదుగా!" దొంగ కోపం అభినయిస్తూ - ఆడపడుచుని మొట్టుతున్నట్లు గుప్పెట మూసి చెయ్యెత్తిందామె.

వదినగారికి అందకుండా తప్పించుకుంటూ తన తలస్థానంలో అన్నగారి తల యిరికించి, తను పక్కకి జరిగింది యమున.

"ఏయ్... కొంటెపిల్లా!" అంటూ ఆడపడుచుని దగ్గిరకి తీసుకుంది పెద్ద వదిన.

"కబుర్లతోనే కడుపు నింపేసుకోవాలనుకుంటున్నారా యేమిటి? భోజనాలకి సిధ్ధం చెయ్యండి ... నేను వచ్చి వడ్డిస్తాను" అన్నఅత్తగారి పురమాయింపుకి డైనింగ్ టేబుల్ సర్దటానికి బయలుదేరారు వదినలిద్దరూ!

"సర్దుతున్నట్లు నటించటానికి మాత్రమే సుమా నేను వస్తున్నది" అంటూ.... తను కూడా వారితో బయలుదేరింది ఇద్దరు వదినగార్ల ముద్దుల ఆడపడుచు యమున.

 

…. అయిపోయింది ....

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్