మన సంస్కృతిలో తల్లి, తండ్రీ దైవంతో సమానం. ఆ తరువాత చదువు నేర్పిన గురువు కూడా దైవంతో సమానం. ఎందుకంటే తల్లితండ్రులు మన నడవడికకు మార్గం చూపిస్తే ఆ మార్గంలో మన జీవన నిర్మాణాన్ని సృష్టించుకునే సృజనాత్మకతను, నైపుణ్యాన్ని నేర్పించేది గురువే. అటువంటి గురువులను స్మరిస్తూ, తమ 50 సంవత్సరాల పాఠశాల పునరేకీకరణ సందర్భంగా డా. శ్రీరామి రెడ్డి గారు రచించిన ఈ పాఠశాల ప్రణామం అనే గీతం నిజంగా ఎన్నో అనుభూతులను మనందరికీ గుర్తుచేస్తున్నది.
పాఠశాల ప్రణామం
సంగీతం: కరణం రాఘవేంద్ర
సాహిత్యం: డా. ఎం. శ్రీరామి రెడ్డి
గానం: ప్రియ పిడపర్తి, ప్రమోద్ కరణం
చదువులు చెప్పిన చక్కని బడికి
దండాలోయ్ ...దండాలు
చనువుగ నేర్పిన గురువులందరికీ
దండాలోయ్ ...దండాలు //చదు
అమ్మ కట్టిన చద్దన్నం మూట ఒక చంక
నాన్న సర్దిన బుక్కుల సంచి మరో చంక
రెక్కలాడిన గాని డొక్కలు నిండని
బడుగు బ్రతుకులు ఒక వంక
పాదరచ్చలు సైతం పొందగ లేని
పరమ దరిద్రం మరో వంక
ఎన్నెన్నో వ్యధప్రయాసలు వెరపక
ఇంకెన్నో ఈతి బాధలు తెరవెనుక
పల్లె పల్లెల నుంచి పరుగుల మీద
పాఠశాలకు వచ్చిన కుర్రకుంకకు //చదు
బ్రతుకలేక బడిపంతులనబడె ఆ రోజుల్లో
బలపంతోనె శ్రీకారం దిద్దిన ఆ రోజుల్లో
బాలశిక్చే పునాది గ్రంధమైన ఆ రోజుల్లో
బరిక బెత్తం విరిగిన కూడ
గురు చిత్తం మాత్రం శుద్ధిదైన ఆ రోజుల్లో
అలుపనక సలుపనక
ఎండనక వాననక
అచ్చర దానం చేయుట పరమార్థం కనుక
మందబుద్దులైన మన విద్యార్థుల వెనుక
ఒక మల్లన్న..ఒక శేషన్న
ఒక రామయ్య..ఒక వరదయ్య
ఇంకెందరెందరో మహోపధ్యాయుల మననం గొలిపె //చదు
మనుషులందరినీ ఒక్కటి చేసి
మమతలందరికీ చక్కగ పంచి
జాతి మత కుల భాషా బేధాలకు చరమం పాడి
అందరి దైవం ఒకటని చాటి
ఆనంద మంటపం ఆత్మని పలికి
ఆత్మ పరమాత్మలు రెండూ ఒకటని తెలిపి
ఎంత పంచినా తరగని కల్పం
దొంగలించినా దొరకని చాపం
తరతరాలుగ ఙ్ఙానస్వరూపం
యుగయుగాలుగ విఙ్ఙానపు దీపం ......అయిన //చదు