Pakshula Prapancham


గత సంచిక తరువాయి »

ముందుగా నేలపైన జీవించే పక్షుల గురించి చెప్పుకుందాం. ఆతర్వాత ఆకాశంలో విహరించే వాటినీ, అడవుల్లో ఉండే వాటినీ, నీటి పక్షుల గురించీ ఒక్కోదాన్ని గురించి చెప్పుకుందాం.

పిచ్చుక, కాకి వంటివి మానవుల నివాస ప్రాంతాలలోనే నివసిస్తుంటాయి. ఇటీవల పిచ్చుకల అదృశ్యం గురించి అంతా బాధపడుతూనే ఉన్నా, అనేక కారణాలవలన కిచ కిచమని అరుస్తూ ఇంట్లోని, అద్దాల వెనుకా ఫోటోల వెనుకా గూళ్ళు పెట్టి, నిద్రిస్తున్నసమయంలో అలారంలా అరిచి లేపే పిచ్చుకలు మాత్రం కనిపించడం అరుదైంది.

కాకి - కాకి ని ఆంగ్లంలో క్రో అంటాం. ఇది నల్లని పక్షి. దీనిని సంస్కృతంలో వాయసము అంటారు. కాకికి Crowతెలుగులో అనేక పేర్లున్నాయి -అన్యభృత్తు, అరిష్టము, అళి, ఆత్మఘోషము, ఆళ్లకోస, ఏకదృష్టి, ఏకాక్షము, కంటకము, కటఖాదకము, కరటము, కారవము, కృష్ణము, కృష్ణశకుని, గుమికాడు, చలాచలము, చిరజీవి, దివాటనము, దీర్ఘాయువు, ద్వికము, ధూంక్ష్ణ, పరభృత్తు, పర్వి, పికవర్ధనము, పిశునము, ప్రత్యులూకము, ప్రాతర్భోక్త, బలిపుష్టము, బలిభుక్కు, మహానేమి, మౌకలి, యమదూత, యమరాడ్దూత, రతజ్వరము, లుంఠాకము, శ్రావకము, సకృత్ప్రజము, సూత్రి, కాకము.

ఇవి కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి ‘కావ్ - కావ్ ‘అని అరుస్తుంటాయి. కాకి పెంపుడు పక్షికాదు. ఐతే ఈ కాకులు మానవులుండే ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పర్చుకుని ఉంటాయి. కాకి పిరికి పిట్ట.

ఆసియా ఖండంలో ఉండే పొడుగు ముక్కుఉన్న కాకిని మాలకాకి -జంగిల్ క్రో అంటారు. దురదృష్టవశాత్తూ మానవులకు తిండికి కరువై కాకులను సైతం పట్టుకుని దాని మాంసం కూడా తినడం సాగించాక, కాకుల సంఖ్యా తగ్గి పోతున్నది. హిందూ పురాణాలలో కాకులప్రస్థావన ఉంది. కాకి శని దేవుని వాహనం.

రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడుట. ఆయన ప్రాణులకు రోగాలను కలిగించి, ప్రాణాలు హరించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందున ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రాకుండా, చిరాయువులై ఉండేలా వరమిచ్చాట్ట! యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు, మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకం లోని వారికి శాంతి కలుగుతుందని హిందువుల నమ్మకం. అందుకే ఈ నాటికీ పితృకర్మల విషయంలో వాయస పిండాలు పెడుతున్నారు.

శ్రీరాముడు, సీతా లక్ష్మణ సహితంగా అరణ్య వాసం చేసే సమయంలో ఒక రోజున సీతమ్మ వారి ఒడిలో రాముడు విశ్రాంతిగా పడుకుని ఉన్నప్పుడు ఇంద్రుని కుమారుడైన జయంతుడు సీతమ్మను ముక్కుతో వక్షస్థలం మీద పొడిచి బాధిస్తాడు. ఆమె కదిలితే రామునికి నిద్రాభంగ మవుతుందని ఓర్చుకుని ఉంటుంది, రక్తం కారి తడి తగిలి రాముడు మేలుకుని, సీతను బాధించిన కాకిపై ఒక గడ్డిపోచను మంత్రించి బ్రహ్మాస్త్రం విడుస్తాడు. ఆ కాకి ముల్లోకాలూ తిరిగి చివరకు రాముణ్ణే ఆశ్రయిస్తుంది. ఆశ్రయించిన వారికి అభయమిచ్చే రాముడు కాకిని ఏదోఒక అవయవం బ్రహ్మాస్త్రానికి ఇవ్వమంటాడు. కాకి ఒక కంటిని అర్పిస్తుంది. దాంతో కాకి ‘ఏకాక్షి’ ఐంది అని రామాయణంలో ఒక కథ ఉంది.

ఒకే కన్ను ఉన్నప్పటికినీ కాకి రెండు వైపుల చక్కగా చూడగలదు.

హిందూ సంప్రదాయంలో కాకి శకునానికి చాలా ప్రాముఖ్యం ఉంది కాకి కుడినుంచి ఎడమకు వెళితే కట్టడమనీ, ఎడమనుంచి కుడివైపు వస్తే తీర్చడమనీ అంటారు. కాకి తీరిస్తే వెళ్ళేపని తప్పక అవుతుందనీ, కడితే పనికాదనీ నమ్మకం. అనుభవం వలన ఆ నమ్మిక ఏర్పడి ఉండవచ్చు. మూఢనమ్మకమూకావచ్చు. కానీ, ఈ మాట జనావళి నోట వింటూనే ఉన్నాం. కాకి అరిస్తే బంధువులు వస్తారనే నమ్మకమూ ఉంది. కాకి తలమీద తంతే చెడు అనే నమ్మికతో తల స్నానం చేస్తారు. కాకి తినే ఆహారం చచ్చిపోయిన ఎలుక, ఇతర జంతువుల కుళ్ళిన మాంసం. ఆ చచ్చిన జంతువుల మీద వాలి అది ముక్కుతో పొడుచుకొని ఆ మాంసాన్ని తింటుంటే ఆ జంతువులమీద ఉన్న సూక్ష్మక్రిములు, అనారోగ్య కారక పదార్థాలు దాని కాలి వేళ్లలో అంటుకుంటాయి. ఆ విధంగా కాకి వలన అంటురోగాలు ప్రబలే అవకాశం మెండుగా ఉంది. అయితే అవే క్రిమికీటకాలను తింటూ రోగాలు రాకుండా కూడా ఉచితసేవ చేస్తున్నది. కనుక కాకి మానవులకు మిత్రుడే!

‘కాకతాళీయము’ అంటాం కదా! ఏంటది?

ఒక వేసవిలో మండుటెండలో ప్రయాణం చేసి అలసిపోయి కాస్త నీడ కోసం ఒక బట్టతల వ్యక్తి ఒక తాటి చెట్టు క్రింద నిల్చున్నాడట. ఒక కాకి ఎగురుతూ వచ్చి ఆ తాటి చెట్టు కున్న తాటిగెల మీద వాలిందట. వెంటనే బాగా పండి రాలటానికి సిధ్ధంగ ఉన్న ఒక తాటి పండు ఠపీమని రాలి ఆ బాటసారి తల మీద పడి తల పగిలి అతడు మరణించాడట. ఈ ఘటనా క్రమం అంతా అనుకోకుండా జరిగినది . ఇదంతా కాకివల్ల జరక్కపోయినా దీన్ని ‘కాకతాళీయము’ అనడం మొదలైంది.

కాకుల ఐకమత్యం ఎలాంటి దంటే ఒక కాకి చనిపోతే వందలకొలది కాకులు వచ్చిచేరి కా కా అంటూ అరిచి గోలపెట్టి మనందరి దృష్టీ వాటి మీదికి మళ్ళించి, ‘శ్రద్ధాంజలి’ ఘటిస్తాయి. కాకి పండ్లను విత్తనాలతో సహా మింగి, తమ రెట్టల ద్వారా విసర్జిస్తూ ఆ యా వృక్షజాతుల వ్యాప్తికి సహకరిస్తాయి.

‘ఎద్దు పుండు కాకికేం ముద్దు ?’ అన్న లోకోక్తి. కాకి అత్యంత పిరికి పక్షుల్లో ఒకటి. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ ’కాకి ముక్కుకు దొండ పండు’ ఇలా అనేక సామెతలున్నాయి. కాకికీ మానవులకూ చాలా బాధవ్యం ఉంది.

’ఎంగిలిచేత్తో కాకిని విదిలించరని‘ పిసినారి వారిని గూర్చిన సామెత ఉంది.

కాకి గడుసుపక్షి. ఒక కంటితో చుట్టూ గమనిస్తూనే ఉంటుంది, మెతుకులు ఏరు కుంటున్నా ఏమారదు. కాకిని చూసి మానవులు కలసి మెలసి ఉండటాన్ని నేర్చుకోవల్సి ఉంది. కాకి ఏనాడూ వంటరిగా ఏమీతినదు. తిండి కనపడగానే ' కా..కా' గానం తో తన జాతివారికి ఆహ్వానం పంపి, అందరితో కలసి తింటుంది. అందుకే నేమో కాకిని ' పాకీ పక్షి '[స్కావెంజర్ బర్డ్] అంటారు. మానవ నివాసాలకు దగ్గర గా జీవించే ఏకైక పెంపుడు పక్షి కానిది కాకేనేమో!

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్