Sahithi Pudota

భాస్కర శతకము

 

దానము సేయగోరిన వ|దాన్యున కీయఁగ శక్తిలేనిచో
నైనఁబరోపకారమున|కై యొకదిక్కునఁదెచ్చియైన నీఁ
బూనును, మేఘుఁడంబుధికి|బోయి జలంబులదెచ్చియీయడే
వాన సమస్తజీవులకు|వాంఛిత మింపెసలార భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మేఘములు తన వద్ద జలము లేనిచో సముద్రమునకు పోయి జలమును తెచ్చి సర్వ ప్రాణులకు వర్షముగా ధారపోయును. అట్లే పరోపకార బుద్ధిగల దాత తన వద్ద దానము చేయుటకు శక్తి లేకున్ననూ, ఇంకొకచోటి నుండియైనను తెచ్చి దానము చేసి తన వంతు పరోపకారము చేయుచుండును. అతడికి సంపద ఉన్ననూ లేకున్ననూ రెండూ సమానమే.

 

 

దానము సేయనేరని|యధార్మికు సంపద యుండియుండియున్
దానే పలాయనంబగుట|తథ్యము; బూరుగు మ్రానుగాచినన్
దాని ఫలంబు లూరక వృ|థా పడిపోవవే యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁ|గాక యభోజ్యములౌట భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరావు. అవి ఎండిపోయి గాలి వలన వృధాగా అడవిలో పడిపోవును. అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవ్వరికీ ఉపయోగ పడక కొంత కాలము ఉండి నశించి పోవునని దీని భావము.

 

 

నుడువుల నేర్పు చాలని మ|నుష్యుఁడెరుంగక తప్పునాడినం
గడుఁగృపతోఁజెలంగుదురు|గాని యదల్పరు తజ్ఞులెల్లఁద
ప్పడుగులు వెట్టుచున్నప్పుడు|బాలుని ముద్దుసేయగా
దొడగుదు రింతెకాని పడఁ|ద్రోయుదురే యెవరైన భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మాటలయందు నేర్పులేక త్వరపడి తప్పుగా మాట్లాడినను పండితులు వానిఎడల చాలా దయతోనే ప్రవర్తించెదరు. కానీ కోపముతో బెదిరించరు. అది ఎట్లనగా తప్పటడుగులు వేయు పిల్లవానిని పెద్దలైన వారు ముద్దిచ్చి దగ్గరకు తీసికొందురే కానీ కోపముతో దండించరు గదా!

 

 

నొగిలిన వేళ నెంతటి ఘ|నుండును దన్నొకరొక్కనేర్పుతో
నగపడి ప్రోదిసేయక త|నంతటఁబల్మికి రాఁడు నిక్కమే;
జగమున నగ్నియైనఁగడు |సన్నగిలంబడి యున్న నింధనం
బెగయగఁద్రోచి యూదక మా|ఱెట్లు రగుల్కొన నేర్చు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! అగ్ని క్షీణించి, క్రమేపి తగ్గి బూడిదయగుచున్నచో పుల్లలను లోపలకు నెట్టి ఊదనిచో మరల పూర్వము వలే ప్రజ్జ్వలించదు. అట్లే గొప్పవానికి పేదరికము వచ్చినచో మరియొకరు సహాయమివ్వనిచో మరల ధైర్యము వహించి బలమును తిరిగి పొందడని భావము.

 

 

నడవక చిక్కిలేమియగు|నాఁడు నిజోదర పోషనార్థమై
యడిగి భుజించుటల్ నరుల|కారయ వ్యంగ్యము కాదు పాండువుల్
గడు బలశాలులేవురు న|ఖండవిభూతిఁదొలంగి బైక్ష్యముల్
గుడువరె యేక చక్రపురిఁ|గుంతియుదారొక చోట భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మిక్కిలి బలవంతులైన పంచపాండవులు సంపూర్ణ సంపదలు విడిచిపోవుట చేత తల్లియగు కుంతితో కూడి ఏకచక్రపురము చేరి భిక్ష్యమెత్తుకొని అన్నమును తిని జీవించితిరి గదా! అట్లే పేదరికము చేత కుటుంబమునకు జరుగుబాటు సరిగా లేనపుడు తమ కడుపు నింపుకొనుటకు పరుల నాశ్రయించుట తప్పుకాదని దీని భావము.


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్