Sravanthi

 

ఉగాది

   
పంచచామరము

విళంబినామ వత్సరంబు వేడ్క మీఱ వచ్చుతన్
గళంబు విప్పి కోకిలల్ సుఖంబుగా కుహూ కుహూ
కళాన్వితస్వరాల మంజుగాన మాలపింపగా
ఫలింప యత్నముల్ బిరాన భావిముత్ప్రదాయియై

   
ఉ.

ఆరురసాలమేళవము ఆంధ్రుల పాలిటి కల్పవల్లి పెం
పారెడి నూత్నవత్సరమహాఽగమనంపుడవాలుబిళ్ళ వ
హ్వారె అనంగజేసి పలుబంధుసఖాళికి ప్రీతిపాత్రమై
ఊరగజేయు జిహ్వలను యోచనజేసిన తత్క్షణంబునన్

   
మత్తకోకిల

క్రొత్తబట్టలు క్రొత్తకోర్కెలు క్రొత్తజంటల ముచ్చటల్
చిత్తముల్ హరియింప నందఱు జేరి యిండ్లను పండుగే
ఇత్తరిన్ గొని వచ్చె గాన్కల నిన్నిరీతుల సంబర
మ్మత్తమిల్లగ() నంచు నెంచు మహాప్రభాత మిదే కదా
         () వ్యాపించగా

   
తే. గీ.

ఈ యుగాది మనందఱి కీయుగా ది
గంతకీర్తియు ఆరోగ్య మాయువును స
మస్తసన్మంగళంబులు స్వస్తివచన
పూర్వకంబుగ తనువులు పులకరింప

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్