Teneloluku


గత సంచికలో పారిజాతాపహరణం లో నందితిమ్మన గారు వ్రాసిన పద్యాలను ఉదాహరిస్తూ మొదటి అక్షరం నుంచి చివరికి, చివరి అక్షరం నుంచి మొదటికి అక్షరాల క్రమం ఒకేలా ఉండేటట్లు ఉన్న 'పాద భ్రమకము' ప్రక్రియ గురించి ప్రస్తావించాను. అందులో ఒక పద్యానికి సంబంధించి ఉపోద్ఘాతముతో ఒక వివరణాత్మక వ్యాసం ‘విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలతో’ మీకు అందిస్తున్నాం. ‘తెలుగు భాష వన్నె తరగని వజ్రం’ అని మరోసారి మనకు బోధపడుతుంది.

చతుర్విధ కవితల్లో, చివరిదైన చిత్రకవిత్వాన్ని, అందరూ కాస్త తక్కువగా చూసినా, పాండిత్యపు సర్కస్ ప్రదర్శనలుగా లెక్కేసినా, ప్రముఖ కవులందరూ తమ విద్వత్ప్రదర్శనకోసం ఎంతో కొంత చిత్రకవిత్వాన్ని రాసినవారే. భారతీయ అలంకార శాస్త్రానికే ఆచార్య ప్రాయుడి వంటి ఆనందవర్ధనులు చిత్ర కవిత అధమమైందని అంటూనే, తన దేవీశతకంలో ఏకాక్షరీ, సర్వతోముఖ భద్ర వంటి చిత్రకవితారీతుల్లో అమ్మవారిని స్తుతించారు. దైవ స్తోత్రాలలో శబ్దాలంకారాలకు, శబ్దచిత్రాలకు, చిత్ర కవితా విన్యాసాలకు ప్రత్యేక శోభామయ స్థానం ఉంది.

Parijaathaapaharanamపారిజాతాపహరణం చివరి ఆశ్వాసంలో, సత్యభామా గర్వభంగం కోసం ఆమెచే పుణ్యక వ్రతం చేయించి, దానంగా-తనకు దాసునిగా - శ్రీ కృషుని పొందిన నారదుడు, ఆ జగన్నాటక సూత్రధారిచే సరదాగా సేవాకార్యాలు చేయించుకొని, ఆ తర్వాత ఆయన అద్భుత మహిమను స్తోత్రగానం చేస్తాడు. ఆ మహిమాద్భుతం నిజంగా అద్భుతమేనని మన హృదయాలకు హత్తుకోడానికై, పాద భ్రమకం, నాగ బంధం, చక్రబంధం, ఛురికాబంధం, కేవలం రెండక్షరాలతోనే పద్యమంతా నడిచే ద్వ్యక్షరి వంటి విచిత్ర పద్యకవితారీతుల్లో తన పద్య రచన సాగిస్తాడు. ఇవన్నీ మన తెలుగు పద్యరచనా ప్రౌఢిమకు గొప్ప ఉదాహరణలు. మన భాషా సంపదకు, జాతి సంపదకు అమూల్య అలంకారాలు.

ఈ పద్యాన్ని 'పాద భ్రమకము' అంటారు. అంటే ప్రతిపాదం అటునుంచి ఇటుచదివినా , ఇటునుంచి అటు చదివినా ఒకే విధంగా ఉంటుంది, అర్థంలో చమత్కార వైవిధ్యం చూపుతూనే....

దీనికి శ్రీమాన్ నాగపూడి కుప్పస్వామయ్యగారు తమ 'పారిజాతపహరణ పరిమలోల్లాస వ్యాఖ్య'లో ఇచ్చిన ప్రతిపదార్ధ వివరణను, పాఠకుల ఆస్వాదన కోసం, దిగువ పొందు పరుస్తున్నాం....చూడండి, మన భాషా శక్తిని గ్రహించండి. వీలువెంబడి మరికొన్ని చిత్రకవితా రీతుల్ని సచిత్రంగా సిరిమల్లె పాఠకులకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాము.

క.

ధీర శయనీయశరధీ
మారవిభానుమతమమత మనుభావిరమా
సారసవననవసరసా
దారదసమ తార తార తామసదరదా.


(వ్యా) ధీర – పండితుడా (సర్వజ్ఞుఁడా యనుట);

శయనీయశరధీ:

శయనీయ–పడకగా నుండెడు; శరధీ–సముద్రముగలవాఁడా; (జలనిధిశయనుఁడనుట);

మార...మమత:

మార-మన్మధుని యొక్క; విభా–కాంతికి; అనుమత–సమ్మతమైన (సమానమైన);

మమత – అభిమానము గలవాఁడా (శరీర సౌందర్యము గలవాఁడని భావము);

మనుభావిరమా:

మను-మననము చేత; భావి-కలిగెడు; రమా-సంపద గలవాఁడా; (లేదా)
మను-మనుష్యకోటి; భావి-కొనియాడెడు; రమా-లక్ష్మీదేవి గలవాఁడా యని యర్థాంతరము;

సారసవననవసరసా:

సార-శ్రేష్ఠమైన; సవన-యజ్ఞములందు; నవసరసా–(శ్రేష్ఠుఁడైన)రసికుఁడైనవాఁడా (యజ్ఞ భోక్త యనుట);

దారదసమతారహార:

దారద–పాదరసమునకు; సమ-సమానమైన; తారతార–స్వచ్ఛమైన ముత్యాల హారము గలవాఁడా; (అతి ధవళమైన ముక్తాహారము గలవాఁడా యనుట).

ఇక్కడ బ్రాచీనముద్రితము లగు గ్రంథములలో “తారతార” యను పాఠము కానంబడియెడు. దానికిని నిదే యర్థము (తార – ముక్తాహారము).

తామసదరదా:

తామస-దుష్టులకు; దరదా-భయమును గలిగించువాఁడా.


ఈ పద్యమురచన పాదభ్రమక మనంబడును. అనఁగాఁ బ్రతిపాదమును త్రిప్పి చదివినను నదే పాద మేర్పడును గాన నీ పద్యము పాదభ్రమక మనఁబడును. ఇదియే ప్రతిలోమానులోమపాద మనంబడును.

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్