మనదైన ఉగాది
- డా. మల్లాది సావిత్రి

పఠితలకు, ప్రేక్షకులకు అందరికీ ‘విళంబినామ’ సంవత్సర శుభాభినందనలు. లోగడ ‘హేవళంబిని’ చవిచూశాం, నేడు ‘విళంబిని’ చూడబోతున్నాం. అందరికీ మంచే జరగాలని, ‘సర్వేభవంతు స్సుఖినః’ గా ఆశిస్తున్నాను. జీవితంలో ప్రధానపాత్ర ‘కుటుంబం’ వహిస్తుంది. ఆ బంధం లేకపోతే సామాజిక పటిష్టత, దేశ భద్రత అంతగా ఉండే అవకాశం లేదు. కుటుంబం అందిస్తున్న ప్రేమ, ఆప్యాయత, సేవ, సౌకర్యాల వల్ల మనం ఈ మాత్రం నిలబడి ఉన్నాం. కుటుంబం మనల్ని పట్టుకోలేదు. మనకి మనమే కుటుంబం పట్టుకుని ఉందన్న భ్రాంతిలో వదిలించుకునే యత్నం చేస్తే మనం పట్టు తప్పిపోతాం సుమా! అందుకే కుటుంబ వ్యవస్థ మంచి పట్టుగా ఉంటే ఆ ఇల్లు, ఆ వీధి, ఆ సమాజం, ఆ దేశం ఎంతో ఔన్యత్యాన్ని పొంది ఉంటుంది. ప్రతి పండగకి వెనుక ఆంతర్యం, ఔదార్యం, ఆరోగ్యం, ఆహార్యం, ఉన్నాయి. వీటన్నింటినీ యోచించే సమయం తక్కువగా ఉంటుందేమోనని ముందే మన పెద్దలు శోధించి అందించారు. వాటిని మనం అనుసరించడం కనీస ధర్మం. వారి బాటలు మనకి బంగారు బాటలు.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన సంప్రదాయాలు. ఆచారాలు. వీటిని అనుసరిస్తే ధర్మ రక్షణను మనం పొందుతాం. దానితో పాటు మనం రక్షణను పొందగలుగుతాం. కాలగణనంలో భారతీయులే దిట్ట. సశాస్త్రీయంగా అందించిన ఘనత ఆనాడే, మన పూర్వీకులదే అని సగర్వంగా చెప్పుకోవాలి. శాస్త్రీయంగా, విజ్ఞానంగా, సనాతనంగా మన దేశంలో అనూచానంగా వస్తున్న పద్ధతుల్ని వదిలేసి, ఏమాత్రం శాస్త్రీయత లేని ‘జనవరి’ పై ఎందుకో వ్యామోహాన్ని పెంచుకొన్నాం. నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాం. వైజ్ఞానికంగా ప్రకృతి సహజంగా మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ‘ఉగాదిని’ ఆనందోత్సాహాలతో, నూతన సంవత్సరంగా వినూత్నంగా జరుపుకుందాం. షడ్రుచుల మేళవింపుతో కూడిన ఉగాది పచ్చడి ఎంతమందికో కాదు అందరికీ ఆరోగ్యకరం. నేనందించబోయే ‘ఉగాది పండుగ’ వివరణ అందరికీ అందాలన్నదే నా ఆకాంక్ష. ఆనందాతిశయాలతో అందరం ఉగాదిని జరుపుకుందాం.

గమ్మత్తు ఏమిటంటే ‘జనవరి1’ ‘న్యూ ఇయర్’ కాదు. అర్థరాత్రి 12 గంటలకు డిసెంబర్ 31 నుంచి జనవరి1 గా ఎలా మారుతుంది. ఏ మార్పు కనిపిస్తుంది. ఈ తేదీ మార్పుకు ఆధారం ఏమిటి? అంటే వివరణ లభ్యం కాదు. ఉగాది పండుగ సందర్భంలో, మన భారతీయకాలమానంలో సూర్యోదయంతో వెలుగు రేఖలు ప్రసరించాక, వసంత ఋతువు రాకతో, క్రొత్త చివుళ్ళ చెట్లతో, కోయిల కూతలతో సహజంగా వచ్చిన మార్పుతో తేదీ మారుతుంది.

ప్రస్తుతం మనం అనుసరించే కాలెండర్ ‘గ్రెగేరియన్ కాలెండర్’. క్రీ.శ. 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన కాలెండర్ ఇది. దీని ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాం. ఈ ప్రకారం, 3,513 ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జాన్ వార్షల్ ఈ లోపాన్ని సవరిచడానికి ఆకాలంలోనే క్రీ.శ. 4000 ‘లీప్ ఇయర్’ గా లెక్కించకుండా వదిలేయమన్నాడు. ఈ లోపాన్ని సరిచేయడానికి నాటి నానాజాతి సమితి (నేటి ఐక్యరాజ్యసమితి) ఏర్పరిచిన కమిటీ 1926 లో ఒక నివేదిక సమర్పించింది. అయినా అది కార్యరూపం దాల్చలేదు.

  • ఒకప్పుడు ప్రపంచం అంతా కొత్త సంవత్సరం ‘ఉగాది నాడు’ ఆరంభం అయ్యేది.
  • బైబిలు లోని ‘ఎజ్రా’ పుస్తకం 10;17 వచనం: సంవత్సంలోని మొదటి నెల ‘మార్చి-ఏప్రిల్’ లో ఆరంభమౌతుందని తెలుపుతోంది.
  • ఫ్రాన్స్ లో క్రీ.శ.1582 వరకు, ఇంగ్లాండ్ లో క్రీ.శ. 1752 వరకు నూతన సంవత్సరం మార్చి 25న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెప్పుతోంది. కాలగమనంలో ఇది ఏప్రిల్ కి మారింది.
  • అయితే నూతన సంవత్సరం మార్చ్ లేదా ఏప్రిల్ అన్నది సమస్యగా మారిన తరుణంలో 15వ శతాబ్దం చివరలో ఫ్రాన్స్ చక్రవర్తి “ఛార్లెస్” అంతవరకు 11వ నెలగా ఉన్న జనవరిని మొదటినెలగా నూతన సంవత్సరాన్ని ఆరంభించాడు. ఇట్లా ఆరంభమైంది నేటి నూతన సంవత్సరం. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయమై, ప్రకృతిపరమైన ఆధారం లభ్యం కాదు. పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దంలో తమ అధీనంలో ఉన్న అన్ని దేశాల్లో ఆంగ్లేయులు ఈ నూతన కాలెండర్ ప్రవేశపెట్టడం, అందరూ దాన్ని అనుసరించడం జరిగింది.

ఈ జనవరి-డిసెంబర్ ఏర్పడిన విధానం గమనిద్దాం:

జనవరి - రోమ్ దేవత పేరు జేవరు. ఆ పేరు నుండి ‘జనవరి’
ఫిబ్రవరి – ఫెరు అనే రోమన్ పండుగ నుంచి ‘ఫిబ్రవరి’
మార్చి – రోమన్ ల యుద్ధ దేవత పేరుతో ‘మార్చి’
ఏప్రిల్ – ‘ఎపెరిల్’ అనే లాటిన్ భాషా శబ్ధంతో ‘ఏప్రిల్’
మే – రోమన్ల దేవి పేరు ‘మయిమా’ తో ‘మే’
జూన్ – స్వర్గానికి రాణి ‘జానో’. ఆ పేరుతో ‘జూన్’
జూలై – జూలియస్ సీజర్ పేరుతో ‘జులై’
ఆగష్టు – రోమన్ చక్రవర్తి ‘అగస్టస్’ పేరుతో ‘ఆగష్టు’
సెప్టెంబర్ – లాటిన్ భాషలోని పద ఆధారంగా ‘సెప్టెంబర్’
నిజానికి లాటిన్ భాషలో సెప్టెం అంటే ఏడు. పాత కేలండర్ ప్రకారం సెప్టెంబర్ ఏడవ నెల అవుతుంది. అయితే ఏడూ, తొమ్మిది కలిపి ‘సెప్టెంబర్’ అని పెట్టారు. అదే విధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు పేర్లు పెట్టారు.
అక్టోబర్ – ‘అకో’ అనే లాటిన్ శబ్ధం నుండి ‘అక్టోబర్’
నవంబర్ – ‘నవమ్’ లాటిన్ శబ్ధం నుండి ‘నవంబర్’
డిసెంబర్ – ‘డసమ్’ అనే లాటిన్ శబ్ధం నుండి ‘డిసెంబర్’

ఇది ప్రస్తుతం మనం అనుసరిస్తున్న నెలల వివరణ. కానీ అత్యంత పురాతనమైన మన భారతీయ కాలెండర్ వేదపండితులైన ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి మహా శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఏ సంవత్సరంలో, ఈ నెలలో, ఏ రోజున, ఏ సమయంలో ఏ గ్రహణం వస్తుందో, వారం, వర్జ్యంతో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది. అంతటి విజ్ఞత మనది. మన ఋషులు దార్శనికులు అంటే తపోధనంతో ఆవిష్కరించే శక్తితో అందించిన బంగారు బాటగా మన కాలగణనం ఏర్పడింది. ఈ కాలగణన వివరణను గమనించండి:

100 తృటికలు - 1 వేధ
3 వేధలు - 1 లవము
3 లవములు - 1 నిమిషం
3 నిమిషాలు - 1 క్షణం
5 క్షణాలు - 1 కాష్ట
15 కాష్టలు - 1 లఘువు
15 లఘువులు - 1 నిశిర
6 నిశిరలు - 1 ప్రహర
4 ప్రహరలు - 1 దినం
15 దినాలు - 1 పక్షం
2 పక్షాలు - 1 మాసం
2 మాసాలు - 1 ఋతువు
3 ఋతువులు - 1 ఆయనం
2 ఆయనాలు - 1 సంవత్సరం
12 సంవత్సరాలు – 1 పుష్కరం
100 సంవత్సరాలు – 1 శతకం
10 శతకాలు - 1 సహస్రం
4 సహస్రాలు - 1 యుగం
4 యుగాలు - 1 మన్వంతరం
100 మన్వంతరాలు – 1 బ్రహ్మ దినం

-అయితే బ్రహ్మకల్పం – మరోయుగం అంటే ఎంత కాలం?

దేవతల కాలప్రమాణం, మానవ కాలప్రమాణానికి 360 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే మన ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక పగలు + ఒక రాత్రి. మన 30 సంవత్సరాల కాలం వారికి ఒక నెల. మన 360 సంవత్సరాలు వారికి ఒక (దివ్య) సంవత్సర ప్రమాణం. ఇటువంటి 12000 దివ్య సంవత్సరాలు వారికి ఒక దివ్య యుగం (మహా యుగం). ఇది మనకు ఒక చతుర్యుగ కాల సమానం.

కృత యుగం = 4800 దివ్యసంవత్సరాలు (17,28, 000 మానవ సంవత్సరాలు)
త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు ( 12,96,000 మానవ సంవత్సరాలు)
ద్వాపర యుగం = 2400 దివ్య సంవత్సరాలు ( 8,64,000 మానవ సంవత్సరాలు)
కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు ( 4, 32,000 మానవ సంవత్సరాలు)
మొత్తం = 12,000 దివ్య సంవత్సరాలు (43,20,000 మానవ సంవత్సరాలు)

ఇవన్నీ కలిసి ఒక దివ్య యుగం (చతుర్యుగం, మహా యుగం) గా చెప్పబడుతుంది. ఇటువంటి వేయి దివ్య యుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు, బ్రహ్మ పగలు ఓ కల్పం (సర్గం) గా చెప్పబడింది. మరో వేయి దివ్య యుగాలు బ్రహ్మకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయం అంటారు. అటువంటి 360 దివారాత్రులు బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుః కాలం.

ఇదీ మన కాలగణనం. ఇంత నిశితంగా ప్రపంచంలో మరెక్కడా లేదు. నానో సెకండ్స్ ని మన వాళ్ళు ఎంతగా గుణించారో కదా! అందుకే అజ్ఞానం అంటే చీకటిని తొలగించాలి అంటే జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతిని అందరితో వెలిగించేలా చేయాలి. ఆ వెలుగు, వెలుగును చూడాలి. అంటే పైన తెలిపిన కాలగణనాన్ని మనస్సుకి బాగా ఎరుక చేస్తే, మనందరం విజ్ఞాన ప్రపంచంలో ఉగాదిని వేడుకగా చేసుకుంటాం. ఇప్పటికైనా, అవగాహన చదువరులందరికీ కలిగిందని అనుకుంటున్నాను. భారతేతరులకు జనవరి 1 నాడు మాత్రమే సంవత్సరం మారుతుందని భావిస్తున్నారు. చివరికి మనం కూడా అదే అనుసరిస్తున్నాం. దేశ, కాల స్థితిని బట్టి అయితే జనవరి 1, డిసెంబర్ 31 నాటికి ప్రకృతిలో గాని, వాతావరణంలో గానీ, గ్రహాలస్థితిలో గానీ, భూమి గమనంలో గానీ, ఏ మార్పు ఉండదని ఇప్పటికైనా గమనించారా? సంవత్సరాది అంటే ‘ఉగాది’ నాడు ప్రకృతిలో కొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో శోభాయమానంగా ఉన్న వాతావరణంలో, కొత్త శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పును కొత్త సం|| గ భారతీయులు, భారతీయ దార్శనీకులు భావిస్తారు.

అంతే కాదు, పాశ్చాత్యుల కాలెండర్లో వారాలు, తేదీలు తెలుస్తాయి. అంతేకానీ, ఏ రోజులో ఏమి చెయ్యాలి? ఎప్పుడు తెలవారుతుంది? ఎప్పడు ఏ ఏ మార్పులు వస్తాయి (ప్రకృతి పరంగా)? మొ || అంశాలు మనకు కనపడవు. కానీ మన ఉగాది కాలెండర్ అదే మన పంచాగంలో తిథి, వార, నక్షత్ర, కరణ, యోగ లనే పంచ అంగాలతో, సంవత్సరం పొడవునా చేయవలిసిన పనుల వివరాలన్నీ పొందుపరచారు. చక్కగా ‘విళంబిని’ ని అందరం ఆహ్వానిద్దాం. గొప్పగా చైత్రమాస శుద్ధపాడ్యమి రోజున మన క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుందాం. “తస్మాత్ శాస్త్రం ప్రహంతే” గా అందరం ఉగాది పచ్చడిని ఆస్వాదిద్దాం. ఆ పచ్చడి ఎట్లా చేయాలో కూడా శాస్త్రం చెప్పింది:

“తద్వార్షా దౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం,
భక్షితాం పూర్వయా మేస్య తద్వార్షా దౌ సౌఖ్యదాయకం”

ఆరోగ్యానిచ్చే వేపపూవును, బెల్లం ముక్కల్ని, చింతపండు రసంలో, మామిడి ముక్కల్ని కలిపి ఆవునేయిని మిళితం చేసి ఆస్వాదిద్దాం. దీనికి నీరును కూడా కలపాలి. నూతన సంవత్సరంలో కొత్త మాసంలో, వినూత్నంగా మన పనులను ఆరంభిద్దాం. ‘సర్వే భద్రాణి పశ్యంతు’ గా అందరికీ శుభాభినందనలు. మరో మారు మనదైన

“ఉగాది విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు”

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్