వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 66


- విద్యార్థి

Vikshanam


వీక్షణం 66వ సమావేశం మిల్పిటాసు (కాలిఫోర్నియా) లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయమందు, ఫిబ్రవరి 12, 2018 నాడు జరిగినది. ఈ సభకు శ్రీ చెన్నకేశవ రెడ్డిగారు అధ్యక్షత వహించినారు.

సాహిత్యంలో తత్త్వ దర్శనం గురించి అధ్యక్షులవారు ప్రసంగిస్తూ చెప్పిన విశేషములు - "అష్టాక్షరీ మంత్రము "ఓం నమోనారాయణ" లోని రా శబ్దమునకు పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" లోని మ అక్షరం కల్పితే వచ్చేది రామ శబ్దము. ఆ రామ అయనము అనగా రాముని ప్రయాణము యొక్క తత్త్వాన్ని వివరించేదే రామాయణము. సాహిత్యములో కబీర్, తుకారాం, వేమన, బసవడు మొదలగు వారి రచనలలో తత్త్వ దర్శనం ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యములో బహు రచనలు తత్త్వ బోధనతో కూడి ఉన్నాయి".

మొదటి ప్రసంగకర్త, శ్రీ అన్నే లెనిన్ గారిది. వారి ప్రసంగ విశేషములు - "నవీనాంధ్ర కవిత్వములో ఆత్మ, తత్త్వము పలువురి రచనలలో కనబడుతుంది. సముద్రాల, సిరివెన్నెల మొదలగు సినీ రచయితల గేయాలలో కూడా తత్త్వ దర్శనం ఉంటుంది. ఆ కోవకు చెందిన వారే శ్రీ కిరణ్ ప్రభ గారు. వారి కవితలలోనూ, కౌముది పత్రిక సంపాదకీయాలలోనూ, రేడియో టాక్ షో ప్రసంగాలలోనూ ఒక ఆత్మ, తత్త్వము ఉంటుంది. ఒకరి కవిత్వమైనా, రచన అయినా, చెప్పేవారి లోపలికి వెళ్ళేది తత్త్వము, బయటకు వచ్చేది కవిత్వము. ఈ నిర్వచనము ప్రకారము ఉత్తమ కవితా రచన శ్రీమతి షంషాద్ గారి "ఈ కిటికీ తెరుచుకునేది ఊహలలోకే .."

తర్వాత శ్రీమతి షంషాద్ గారు లెనిన్‌గారికి ధన్యవాదములు తెలుపుతూ, "నెగెటివ్", "కిన్నెరసాని" కవితలని సభకు చదివి వినిపించారు.

ఆ తరువాత శ్రీమతి ఉదయలక్ష్మి గారు కిరణ్ ప్రభగారి అంతర్జాల ప్రసంగాల ద్వారా చేస్తున్న విశిష్ఠ కృషి కి ధన్యవాదముల తో కూడిన అభినందన వ్యాసం చదివారు. అలాగే, కిరణ్ ప్రభ గారు, కాంతి కిరణ్ గారూ నెల నెల అందిస్తున్న ఉత్తమ అంతర్జాల తెలుగు పత్రిక పాత తరం యువను గుర్తు చేస్తున్నదని అన్నారు.

ఆ తరువాతి కార్యక్రమము శ్రీ కిరణ్ ప్రభ గారి క్విజ్. అది ఎప్పటి లాగానే ఉత్సాహముగా జరిగినది.

విరామానంతరము శ్రీ అప్పాజీ గారు సంస్కృత భాగవతం లోని రామాయణ కథ యొక్క తత్త్వం గురించి చేసిన ఒక విశిష్ఠ వివరణలోని ప్రధానాంశములు - "వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రచించారు. ఆ రామాయణ కథను పలువురు ఋషులు పలు ప్రమాణాలతో, వారి వారి తాత్త్విక దర్శనముతో రచించారు. వ్యాసుడు భాగవతంలో రెండు అధ్యాయాలలో రామాయణ కథను తెలిపారు.

దేవతలు ప్రార్ధించగా సాక్షాత్తు బ్రహ్మమయుడైనటువంటి శ్రీ హరి తన అంశలో అంశగా నాలుగు రూపాలుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారు. బాహ్యార్థములో ఒక కుటుంబము, ఆ కుటుంబీకుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు రామాయణ కథలో కనిపిస్తాయి.

రామాయణ కథలో ఋషి దర్శనము ఏముందో కొంత తరచి చూస్తే ఒక విశిష్ఠార్థము కనపడుతుంది. దశరథుడు అనగా పది రథములు కలవాడు అని, లేక పది గుఱ్ఱములతో లాగబడే రథము కలవాడని అని ఒక అర్థము. ఒక మహా చక్రవర్తికి పది రథములే ఉన్నాయనటములో ఒక విశిష్ఠత కనబడదు. ఇక్కడ ఋషి యొక్క తాత్త్విక దర్శనము ఐదు జ్ఞానేంద్రియములు (త్వక్కు (చర్మము), చక్షువు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు), ఐదు కర్మేంద్రియములచే (వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థలు) ఒక మనిషి ఎప్పుడూ లాగబడుతూ ఉంటాడు. ఈ పది ఇంద్రియములని ఒక ఉన్నతమైన ధ్యేయము కొరకు వినియోగించే ప్రతి మనిషీ దశరథుడు.

బ్రహమయమైన సగుణ ఆనంద తత్త్వాన్ని సూచించేది రామ శబ్దము. రామ శబ్దానికి వివరణ "రమతే ఇతి రామః" లేక "రమంతే యోగినః సర్వే అస్మిన్ ఇతిహి రామః" అనగా సమస్త యోగులు ఏ ఆనంద తత్త్వములో రమిస్తూ ఉంటారో, ఏ తత్త్వమైతే సమస్త ప్రాణులని ఆనందింప చేస్తుందో అది రామ శబ్దము.

ఆ సగుణ బ్రహ్మముయొక్క లక్షణములు లేక చిహ్నములు లక్ష్మణుడు. లక్ష్మణయ ఇతి లక్ష్మణః. ఈ ఆనంద తత్త్వము మనసులో ఉన్నవారికి ఉత్తమమైన భరణ శక్తి ఉంటుది. అదే భరత తత్త్వము. భరణాత్ భరతః. ఒక మనిషికున్న పంచేంద్రియములని నియంత్రించేది మనస్సు. ఈ పంచేద్రియములు బందిపోటు దొంగల వంటివి, అవి మనిషిలోని ఆనంద తత్త్వాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆ అంతః శత్రువులని జయించినవాడే శత్రుఘ్నుడు. శత్రు ఘ్నంతి ఇతి శతృఘ్నః. అంతః శత్రువులని జయించటమే మోక్ష మార్గము.

రామ శబ్దము ధర్మము. ధ+రమ = ధర్మము. రమ శబ్దమూ, రామ శబ్దము ఒకటే.

కామనలు తీర్చుకోవటానికి అర్థము. అర్థ యోచనతో అంతః ఘర్షణలు లేక బాహ్య ఘర్షణలు సంభవించవచ్చు. ఆ అర్థాన్ని ఘర్షణ రహితం కావించేదే ధర్మము. కామాన్ని తీర్చుకోవడానికే అర్థము, అర్థము తీర్చుకోవడానికే ధర్మము అనే వలయములోనుంచి విముక్తి కోరితే మోక్షము.

పైన చెప్పిన విధముగా కాకుండా, ధర్మాన్ని ధర్మము కోసమే ఆచరిస్తే మోక్షమనేది ఋషి దర్శనము. ధర్మము కోసమే అర్థము, మోక్షము కోసమే కామన వాడితే జీవితము పూర్తిగా ఘర్షణ రహితము.

ఇప్పుడు ఇక్కడ అర్థమనగా లక్ష్మణుడు. అర్థాన్ని ధర్మానికి కలపాలి. అందుకే, లక్ష్మణుడు ఎప్పుడూ రాముడికి వెన్నంటివుంటాడు. అలాగే శతృఘ్నుడు అనగా కామన. కామనని మోక్షానికి కలపాలి.

సత్త్వ తమో రజో గుణాలతో కూడినది త్రిగుణాత్మకమైన ప్రపంచము. ఈ ముగ్గురూ దశరథునికి ఉన్న భార్యలు. ఈ మూడు గుణాలు ధర్మార్థ కామ మోక్షముల కొరకు ప్రాకులాడుతూ ఉంటాయి. అర్థాన్ని (లక్ష్మణుడు) ధర్మముతో (రాముడు)తో కలపాలి, కామాన్ని (భరతుడుని) మోక్షం (శతృఘ్నుడి) కొరకు వినియోగించాలి. ఆ విధముగా ఆచరిస్తే జీవితములో ఘర్షణలు ఉండవు.

దశరథుడు పుత్ర కామేష్ఠి చేసి సగం పాయసం కౌశల్య కిచ్చాడు. నాల్గవ వంతు సుమిత్ర కిచ్చాడు. మిగలినదానిలో ఒక ఎనిమిదవ భాగాన్ని కైకేయికి, ఇంకొక ఎనిమదవ భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. అనగా, దశరథుడి ఇంద్రియాలని అర్థ భాగం ధర్మము కొరకు, నాల్గవ భాగాన్ని అర్థము కొరకు, ఒక ఎనిమిదవ భాగాన్ని కామము కొరకు, మిగిలినది మోక్షము కొరకు నియోగించాడు. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఎనిమిదవ భాగమైన కామాన్ని ధరమ మోక్షముల కొరకు వినియోగిస్తే ఘర్షణా రహితమైన జీవతము. ఆ కామాన్ని కామము కొరకే, లేక అర్థము కొరకు వినియోగిస్తే ఘర్షణ హేతువు అవుతుంది. ఆ కామ విచక్షణ, నియమన ఎవరికి ఉంటుందో వారు బ్రహ్మమయమైన ఆనందాన్ని రమించగలరు.

ఆ తరువాత కవి సమ్మేళనములో యువ కవులు శశి, సాయి కృష్ణ, రేష్మా లతో బాటూ శ్రీ చరణ్, షమ్షాద్, డా|| గీతా మాధవి, అప్పాజీ గార్లు పాల్గొన్నారు.

ఆద్యంతం అత్యంత ఆసక్తి దాయకంగా జరిగిన ఈ సమావేశంలో శ్రీ జయరామ్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ సి.బి రావు, శ్రీ వేమూరి, శ్రీ  గాంధీప్రసాద్, శ్రీమతి  ఆర్. దమయంతి, శ్రీమతి శారద, శ్రీమతి ఉమ, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి రమణ తదితరులు పాల్గొన్నారు.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్