మనిషి-మానవత్వం

మానవతా విలువలను మనసుకు హత్తుకునే విధంగా మలిచిన ఈ కథ నాకు ఒక మిత్రుడు పంపించాడు. ఈ కథ వ్రాసిన రచయిత ఎవరో తెలియదు. కథకు పేరుకూడా లేదు. కానీ అంతర్జాల మాధ్యమంలో ఈ కథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ఎందుకంటే కథకు ఉన్న ఆయువుపట్టు అంత ఘనమైనది. నా ఆలోచనా పరిధిలో నిర్ణయించి ఈ కథకు ఒక పేరును కూడా పెట్టాను. ఆ అజ్ఞాత రచయిత/రచయిత్రి కి మనః పూర్వక కృతజ్ఞతలతో ఈ కథను మన సిరిమల్లెలో మీ కొఱకు ప్రచురిస్తున్నాను.  – మధు బుడమగుంట


నాన్న అప్పటికి హాస్పిటల్‌లో జాయినై వారంరోజులైంది. లివర్‌ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డాక్టర్లు తేల్చేశారు.

మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్‌ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను.

ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న- ‘నువ్వు చేయగలవా?’

పెదవులు బిగబట్టాను. ‘మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది... ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది...చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది.’

‘మరో రోజో... రెండురోజులో..! నేనెంతో ఇష్టపడే నాన్న- నన్ను... వూహు... ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు.’

డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు.

నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిశాక ఒక్క కోరిక... ఒకే ఒక్క కోరిక కోరారు.

‘‘ఏరా నవీన్‌, నేను చనిపోతే నా శవాన్ని, మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా?’’

అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా ‘‘అలా అనకు నాన్నా... మీకేం కాదు’’ అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.

‘‘నాకు ఇప్పుడేమవుతుందో, రేపేమవుతుందోనన్న భయం లేదురా... ఎప్పుడు, ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్నడుగుతున్నాను... నాకు కావలసింది చేయగలవా?’’

‘‘తప్పకుండా చేస్తాను నాన్నా.’’

మూడురోజుల క్రితం నాన్నకు మాటిచ్చాను.

మర్నాటి నుంచీ ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. రెండోరోజు నా ముఖంలో నిరాశ కదలాడటం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు ‘‘నేను అడిగింది చేయగలవా?’’

‘‘ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్నా.’’

ఆయనకు విషయం కొంతవరకూ అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కానీ, నాకేసి ఆర్తిగా చూడటం మానలేదు.

ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, కాసింత తెలివి వచ్చినా, నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురుచూస్తున్నారు.

ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్‌లో నా కోసమే ఎదురుచూస్తున్న ప్రమద్వర నా ముఖం చూసి అడిగింది ‘‘ఏంటీ, ఆయన అడిగినదాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా?’’

అవూనూ కాదూల మధ్య తలాడించాను.

ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది... ‘‘చేస్తానన్నారు కదా... చేస్తాననే చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరింగిందన్నది ఆయనకు తెలియదు కదా! మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం.’’

నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం!?

నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈసడింపుగా తల పక్కకు తిప్పుకుని తన పిల్లల దగ్గరకెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది.

నిన్నటి నుంచీ చేసిన నా ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ అలా నిలబడిపోయాను.

* * * * * * * * * * * *

విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది... శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం!

అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన వూరు. నేను పుట్టి పెరిగిందీ ఆ పల్లెలోనే! ఆరేళ్ళక్రితం వరకూ నాన్న, అమ్మతో కలసి ఆ వూళ్ళొనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను.

ఆ వూరు సిటీకి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్‌లో ఆ వూరికి శవాన్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ, శవాన్ని తిన్నగా స్మశానానికి తీసుకెళ్ళలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడినుండి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి.

ఒకప్పుడు ఆ వూళ్ళొ మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కానీ నేను హైదరాబాద్‌ వచ్చేశాక వాళ్ళతో రిలేషన్స్‌ మెయిన్‌టైన్‌ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైనా... పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరంవాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు పొరుగింటితో కూడా సంబంధం అవసరంలేదనుకుని టీవీ, మొబైల్‌ ఫోన్‌లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటినుండి సాగనంపేవాళ్ళెవరు!?

ఆ వూళ్ళొ నాకున్న బంధుమిత్రులను గుర్తుచేసుకున్నాను. వాళ్ళలో నాకు మొదటగా గుర్తొచ్చింది... మా బాబాయి కొడుకు వీరమోహన్‌.

ఈమధ్య కాలంలో వాడికి కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. రెండేళ్ళక్రితం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండటంతో పెళ్ళికి వెళ్ళలేకపోయాను. బిజీ... మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడంకన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేనూ అందుకు అతీతుణ్ణి కాను.

అందుకే వాడికి ఫోన్‌ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను. ‘‘నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం’’ అని అడిగాను.

‘‘ఒక అరగంట ఆగి ఫోన్‌ చెయ్యి’’ అన్నాడు వాడు.

అరగంటాగి ఫోన్‌ చేశాక, అప్పటికే కుటుంబసభ్యులతో మాట్లాడాడేమో, విషయం వివరించాడు. ‘‘సారీ అన్నయ్యా, ఈ వారంలోనే మా పెద్దమ్మాయీ, అల్లుడూ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు... ఏమనుకోకు’’ అన్నాడు.

జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేని స్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్‌ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను.

తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ వూళ్ళొ వాడొక్కడే కాదు...నేను పుట్టి పెరిగిన వూళ్ళొ నాన్నను తమ ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను... ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో! ఒక్కసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది.

అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్‌ రఘు గుర్తుకొచ్చాడు.

మా నాన్నను వాడి ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను.

వాడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను.

వాడు ‘సారీ’ అంటూ, అలా అనడానికి గల కారణాలు వివరించాడు- ‘‘ఒక ఇంటినుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి. పంతులుగారి చేత శాంతిపూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్దకర్మ వరకూ వెలుగుతుండాలి. పెద్దకర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్‌.’’

సాటిజీవిని ఇష్టంగానైనా, కష్టంగానైనా భరించగలిగే మనిషి, పార్థివదేహాన్ని ఏవిధంగానూ భరించలేడన్న నిజం నాకర్థమయింది.

చాలా బాధగా అనిపించింది. బాధకన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది.

ఎలా..? ఎలా..?

 

 

....... సశేషం .......

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఇతరుల్ని జయించిన వాడు బలవంతుడు. తనని తాను జయించిన వాడు శక్తిమంతుడు – లావొట్సే