సీతాకళ్యాణ వైభోగమే....
- డి వి ఆర్ భాస్కర్

Sita Rama Kalyanamచైత్రం ప్రారంభం అవుతోందంటే ఇంటింటా, వాడవాడలా, వీధి వీధినా చలువ పందిళ్ళు, మామిడాకు తోరణాలు.. ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. అదేమి విచిత్రమో గాని, ఆ వేడుకకు ప్రతి ఒక్కరూ పెద్దలే. ఇంతకీ ఆ వేడుక ఏమంటే-సీతారాముల కళ్యాణం. వధూవరులు ఎవరంటే తరతరాలుగా ఆదర్శ దంపతులైన సీతారాములే!

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ఎనలేని విశిష్టత వుంది. శ్రీ రాముని చరితం యావజ్జగతికీ తెలుసు. అంతటి కమనీయ కావ్యం రామాయణం. రామాయణం వేదం అయితే శ్రీ రాముడు సాక్షాత్తూ వేదపురుషుడు. వేదమంత్రాలలో రామకథ ప్రస్తావన కనిపిస్తుంది. రామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశ ధర్మ పాలన గురించి ఋగ్వేద సంహితలో వివరణ వున్నది.

రాముని వంటి (పితృవాక్య) పరిపాలకుడు, సీత వంటి మహాసాధ్వి, వసిష్టుని వంటి గురువు, సుమంత్రుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, విభీషణుని వంటి శరణార్ధి, రావణబ్రహ్మ వంటి ప్రతినాయకుడు మరే ఇతర కావ్యంలోనూ కాదు...కాదు ఈ విశ్వవిశాల ప్రపంచంలోనే కానరారు.

రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజు కోసం – రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ... “అంతా రామ మయం....ఈ జగమంతా రామ మయం” అని ప్రస్తుతించారు.

“చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్”

అన్నారు. అంటే రామచరిత్ర ఎంత ఉదాత్తమైనదో, రామనామం కూడా అంతటి మహిమాన్వితమైనది, సర్వపాపాలను నశింప జేసేంతటి విశిష్టమైనది. శ్రీరాముని నమ్ముకున్న వారికి శత్రుజయం కలుగుతుందని, భయపరాభవాలుండవని రామాయణ గాథ విశదం చేస్తుంది. మనుస్మృతి రామనామాన్ని మోక్షప్రదంగా పేర్కొంటే, పద్మపురాణం రామ నామాన్ని సహస్రనామ తుల్యంగా శ్లాఘించింది. రామనామ మహిమను గురించి అగస్త్య సంహిత, ఉమా సంహిత, రామార్చన చంద్రిక వంటి గ్రంధాలు కూడా పరి పరి విధాలా కీర్తించాయి. శ్రీరాముడు అయోధ్యానగరాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని తరింపజేస్తే, రామనామం భువనత్రయాన్నే పరవశింపజేస్తుందని ప్రతీతి. ఆపదలను హరించువాడూ, సమస్త సంపదలనూ ప్రసాదించే వాడూ, లోకాభిరాముడు అయిన రామచంద్రునికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను.

ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి నాడు శ్రీ రాముని కళ్యాణోత్సవాన్ని భద్రాచల క్షేత్రంలో రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు పావన గోదావరి తీరాన వున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ క్షేత్రంలో కూడా శ్రీరామ నవమి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. సాధారణంగా సీతారామ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఇతరుల్ని జయించిన వాడు బలవంతుడు. తనని తాను జయించిన వాడు శక్తిమంతుడు – లావొట్సే