మూడు ముఖాలు
- సి. వసుంధర

 


“పొద్దున లేవగానే ఏవిటా సోకులు. పొద్దున్నే తలదువ్వుకోవడం అవ్వా! అనకూడదు గాని భోగం సోకులంటారు తెలుసా? ఇక చాల్లే సంబడం. మొహం తుడుచుకొని బొట్టు పెట్టుకొనిరా!” వంటింటి గడప దగ్గర నిల్చొని సుగుణ తట్టు గుడ్లురుమి చూస్తూ అంది అనంతమ్మ.

అమ్మ మాటలతో ఉలిక్కిపడ్డ సుగుణ దువ్వెనను గబుక్కున పక్కన పడేసి తలలేపేసుకొని,

“తల దువ్వుకోలేదమ్మా! బొట్టు పెట్టుకొనే వస్తున్నా” అంటూ ముఖం మీద కుంకుమ పెట్టుకొని హాల్లోకి వెళ్ళింది తడబడుతూ.

“ఏం మాయదారి కాలమో! మొహానికి బూడిదలు (పౌడర్) పూసుకోవడం, వేళా పాళా లేకుండా తలదువ్వుకోవడాలు, సొగసులు, వాకిట్లోకి వెళ్లి గేట్లో నిలబడడాలు – వింత సంతయిపోయింది” అమ్మ నసుగుడు హాల్లోకి వినబడుతున్నది సుగుణకు. పన్నెండేళ్ళ వయసులో ఉన్న సుగుణ మనసులో ఏదో తెలియని తపన, తనకు తెల్సిన అతి చిన్న ప్రపంచంలోనే చోటు చేసుకొంటున్న మార్పులు – సుగుణలో ఏదో అస్థిరత్వానికి ఆహ్వానం పలుకుతున్నాయి.

============

ఒక మోస్తరు గ్రామంలో స్కూలు మాస్టరు రంగనాధంగారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. సుగుణ మూడో పిల్ల. అక్కలిద్దరికీ వారి పదమూడోయేట పెండ్లయి పోయింది. ఇరవైవయేటికే వారిద్దరూ ముగ్గురు బిడ్డలకు తల్లులయ్యారు. రెండో అమ్మాయికి ముగ్గురు అమ్మాయిలే కాబట్టి మగపిల్లాడి కోసం దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సుగుణకు పన్నెండవ యేడు వచ్చింది మొదలు ఆంక్షలు, ఆదేశాలు ఎక్కువైనాయి. పెళ్లి ప్రయత్నాలు ముమ్మరమయినాయి.

“నాన్నా! నేను కూడా పట్నానికి వస్తా! పెద్దమ్మ వాళ్ళు – వున్నారు గదా.” సుగుణ నెమ్మదిగా అడిగింది.

“ఆ! పెద్దమ్మ ఉంటే ఏవిటట. ఈడు కొచ్చిన పిల్లవి ఇలా ఊర్లు బట్టుకొని తిరుగుతుంటే...ఏవక్కర లేదు. ఇంట్లో ఉండి బుద్ధిగా సంగీత సాధన చెయ్యి. వచ్చే వారం పెళ్లి చూపులకు తిరుపతి నుండి వస్తారు. అప్పుడు పాడాలి” రంగనాధం గారి రుసరుసలతో సుగుణలో పొంగుతున్న ఉత్సాహం పాలు నెమ్మదిగా కిందకి జారుకొన్నాయి.

============

తెలిసీ తెలియని వయసు; మనసు. ఏవిటో కావాలి. ఏదో .. ఏదో వ్యక్తం చెయ్యలేని ఆలోచన, చెయ్యలేక పోతున్నానే అన్న ఆవేదన ఒకవైపు; తన ఊహలలో ఏదో ఆనందం – తనను ఉయ్యాలలూపుతుంటే తను అను – కొన్నట్లే జరుగుతుందన్న ఒక గుడ్డి నమ్మకం – కమ్మని కలల్ని ప్రసాదిస్తుంటే – రెంటిమధ్య ఆ పసిమనసు నలిగి పోతూ ‘తనకు పెళ్లి చూపులు’ అన్నమాట పదే పదే తలుచుకొంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకొన్నది సుగుణ.

పదమూడవ పుట్టినరోజు జరుపుకొన్న సుగుణకు వెంటనే పెళ్లిరోజు కూడా తరుముకొచ్చింది. పెళ్ళయిన తర్వాతగాని ఊహలేవో నిజాలేవో తెలిసిరాలేదు సుగుణకు. కాని ఒకటి మాత్రం తెలిసొచ్చింది. వివాహ సంద్రంలో మునిగితే రాళ్ళు, రత్నాలు రెండూ తగులుతాయని. మన ఊహలు, కోరికలు, ఆదర్శాలు వగైరాలు సముద్రంపైన కనపడే అలలలాంటివే గాని సముద్రపు లోతున వున్న అనంత వస్తు సముదాయంలాంటివి కాదని. అయినా ఊహలు గబ్బిలాల్లాంటివి. మనసును పట్టుకొని ఊగులాడుతూనే ఉంటాయి. ఇలా అనుకొంటూనే సుగుణ ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.

============

“సభ కు నమస్కారం,

నేను కొన్ని కొన్ని సందర్భాలలో పడ్డ మానసిక క్షోభ మన, నా పిల్లలు పడకూడదు. ఎందుకంటే చెప్తాను వినండి!

ధన మార్జాయ కాకుత్స
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్యచ

ధనం లేనివాడు చచ్చిన వానితో సమానం. అందుకే ప్రపంచ గమనానికి మూలమైన ధనం ఆడ మగ తేడా లేకుండా అందరూ సంపాదించుకోవాలి. కూడబెట్టి దాచి పెట్టుకోవాలి. మా అమ్మ అయిదు రూపాయల కోసం మా నాన్న చేత చివాట్లు తినడం నాకు తెలుసు. ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక స్వాతంత్ర్యం మనిషికి కొండంత అండ. అందుకే మనం మన పిల్లలకు ఆ లోటు రాకుండా చూడాలి. మా తరం మాతృమూర్తులు మాతృత్వాన్ని ఎన్నో కోణాలనుండి ప్రదర్శించి మన పిల్లలకు పాత కొత్తల మేలు కలయికగా వారి జీవితాలను తీర్చిదిద్దామనే చెప్పాలి.

మా అమ్మ తరంలో, ఆమె- ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్నిగనే యంత్రం. బురద నీరులా పారుతున్న మూఢాచారాలకు ప్రతినిధి. అది ఆనాటి సంఘానికి సరిపోయింది. కానీ ఈ నాటికి కాని, ఏనాటికి గాని, మూడు కాలాలు త్రివేణీ సంగమంతో పోల్చవచ్చు. మూడు కాలాల లాలాజలంతో కలిపి నమిలి తిన్న జీవితాహారం మానవునికి మంచి పుష్ఠిని, దృష్టిని ప్రసాదిస్తుంది. అయితే వచ్చిన చిక్కు – మనిషి ఏదైనా మొదలు పెడితే దాన్ని ఒకచోట ఆపి తృప్తిపడడు. అందుకే మంచి కూడా మించిపోతే – దానిలోని మంచి, చెడుగా మారి పోతున్నది. ఏది ఏమైనప్పటికీ మా తరం అమ్మలు పాత విషయాలను మరిచిపోకుండా కొత్త విషయాలను కలుపుకొంటూ సమపాళ్ళుగా పిల్లలకు వారి జీవితానికి కావాల్సిన మానసిక పరిపక్వతను సమకూర్చామనే చెప్పవచ్చు.

ఇక ఈ తరం తల్లులు, వారి పిల్లలు – వారి మధ్య గల సంబంధాలు – వీటిని గూర్చి ఈ తరం ఆడవారే మాట్లాడితే సహజంగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకే ఇక్కడున్న వారిలో ఎవరైనా వచ్చి వారి అభిప్రాయాలను చెప్పమని ఆహ్వానిస్తున్నాను” అంది సుగుణ.

సుగుణ మాటలకు సభలో కలకలం రేగింది కొద్దిగా. రెండు నిమిషాల తర్వాత ఒక అమ్మాయి లేచి నెమ్మదిగా స్టేజి వైపు నడిచింది.

“వెల్ కమ్!” సుగుణ అన్నది. ఆ అమ్మాయి మైక్ ముందు నిలబడి సుగుణకు ముందుగా నమస్కరించి తర్వాత సభవైపు తిరిగి,

“నా పేరు సహృదయ. సహృదయులైన పెద్దలందరికీ నమస్కారాలు. కాలప్రవాహంలో మార్పులు తప్పనిసరి. మార్పు వచ్చినప్పుడల్లా ఏదో పెనుముప్పు వచ్చినట్లు బాధపడడం సహజమైనప్పటికీ, అది అంత సమజసం కాదు. సుగుణా మేడం గారు తమకు కల్గిన చిన్నప్పటి అనుభవాలను చెప్పినప్పుడు మనకీ విషయం బోధపడుతుంది. కాబట్టి ప్రతి మనిషి మూడు కాలాలకు ప్రతినిధిగా నిల్చి, తాను గడిపే నిండు నూరేళ్ళ జీవితాన్ని త్రివేణి సంగమ పవిత్ర జలాల వంటి మూడు కాలాల లోని మంచితో జతచేసి సాగిస్తే అంతకంటే ధన్యత ఏమీ ఉండదని నా అభిప్రాయం. ఇదే విషయం సుగుణ గారు కూడా చెప్పారు.

ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి కుటుంబంలో తల్లి స్థానం అతి ప్రత్యేకమైంది. కాబట్టి ఆ స్థానానికి నేడు కొరత ఏర్పడిన మాట వాస్తవం. అందుకు ప్రతి ఒక్కరు కుటుంబంలో బాధ్యతేననవచ్చు.

నేడు తల్లి-బిడ్డ మధ్య ఒక తెలియని అగాధం ఏర్పడింది. దీనికి మానసికమైన కారణాల కన్నా సమాజపరమైన కారణాలే ఎక్కువ. నూరేళ్ళ క్రితం సమిష్టి కుటుంబాల వల్ల తల్లీ పిల్లలు అందరూ ఒకేచోట జీవించేవారు. బ్రతుకుతెరువు కోసం దూర దూరాలకు వెళ్ళవలసిన పనిలేదు. కానీ నేటి పరిస్టితులలో చదువుల కోసం పదవ తరగతి నుండి హాస్టలు జీవితం, చదువుల తరువాత ఉద్యోగరీత్యా దేశ విదేశాలకు ప్రయాణం. అంతేగాక పెళ్ళిళ్ళ వల్ల మానసికంగా దూరమవడం – ఇలాంటివన్నీ పిల్లలగన్న తల్లులకు తీవ్ర మనస్తాపాన్ని మిగులుస్తున్నాయి. అందువల్ల మాతృమూర్తికి ఇలాంటి పరిస్థితి కల్గించడం ఆమె పిల్లలకు గానీ బయటనుంచి వచ్చి కోడలుగా, ఆ ఇంటి దేవతగా ఆరాధింపబడవలసిన నా లాంటి యువతులకు గానీ మంచిదికాదు. మనం కూడా తల్లులమవుతున్నాం. అది మనం మరిచిపోకూడదు.

ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తమ అమ్మలను, అలాగే అమ్మలాంటి స్త్రీలను కూడా మనస్ఫూర్తిగా అభిమానిస్తూ, ఆరాధిస్తే, ఆ కుటుంబాలు పూర్ణకుంభాలుగా విరాజిల్లుతాయి. నా చివరి మాట – అందరూ ఒకరినొకరు ప్రేమాభిమానాలతో ఆదరించుకోండి! హిమాలయ శిఖరాగ్ర సమానమైన మాతృస్థానాన్ని ప్రతివారు పొందండి. అమ్మతనం లోని ఔన్నత్యాన్ని గుర్తుంచుకోండి. ఇదే ఈ మాతృదినోత్సవ దివ్యసందేశం. మన భారత దేశ కుటుంబ వ్యవస్థకు మూలస్థంభం అమ్మ. ఆమెను నిలబెట్టండి.

పాలసంద్రాన్ని చిలికితే అమృతం పుట్టింది
అమృతాంబుధిని మధిస్తే
అమ్మ పుట్టింది
అమ్మ హృదయ సాగరాన్ని చిలికితే
అమృతమే పుట్టాలి
హాలాహలం పుట్టకుండా చూచుకోండి
అమ్మ రుచి చూపే ప్రేమామృతం
అనితర సాధ్యం, ఆమెకే అది సాధ్యం

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

చెప్పేవాడూ, వినేవాడూ ఉన్నచోటే సంపదలు విహరిస్తాయి – విక్రమార్కచరితం