Pakshula Prapancham


గత సంచిక తరువాయి »

పిచ్చుక

Sparrowఇంటి పిచ్చుక -  శాస్త్రీయ నామం: ఫస్సెర్ దొమెస్తిచుస్. ఇది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉంటుంది. ఆడ పక్షులు, యువ పక్షులు రంగులేని, ఊదారంగు, గోధుమ రంగులో ఉంటాయి. మగ పక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపుతో కూడిన గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. ఇలా వీటి రంగులనుబట్టీ  ఆడో, మగో గుర్తించవచ్చు.

పిచ్చుక చిన్నదే ఐనా చాలాతెలివైనది. గొప్ప ఇంజనీరు. తన గూటిని ఎంత అందగా, భద్రంగా కట్టుకుందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది.  “పిచ్చుకంతలేవు. ఎందుకలా ఎగురుతావు?” అని పల్లెటూరి ప్రజల ఊతపదం.

ఐతే, నేడు పిచ్చుకలు జీవించడానికి అనువుగా అసలు చెట్లే ఉండటంలేదు. ఇహ అవి ఎలా, ఎక్కడ ఉంటాయి, ఎక్కడ బతుకుతాయి? భావితరాల పిల్లలకు – ‘సిరిమల్లె’ లోని పిచ్చుక బొమ్మ - విషయం చదువుకునే గతిపట్టవచ్చు.

“పిచ్చుక బొమ్మ”ను చూపించి 'ఇది పిచ్చుక అనే పక్షి, పూర్వం మన ఇళ్లలోనే తిరిగేదని' చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:

ఇంధన కాలుష్యం, పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు, సాంకేతిక మార్పు లతో పాటు సెల్ టవర్ల నిర్మాణం. సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగు భాగంలో, పూరిళ్ల వరండాల్లో చూరుక్రిందా గూళ్లు నిర్మించుకునేవి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్ణయించుకున్నాక అంటే ఎంగేజిమెంట్ అన్నమాట – గూడు నిర్మాణం చేపడుతాయి. కలసి జీవించడం ప్రారంభిస్తాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లు పెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి బాధ్యత వహించుతాయి. ఇవి ఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యం గింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి.

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కినట్లు-  అనే సామెతలాగా  పిచ్చుకలు బతికే పరిస్థితులు లేకుండా చేస్తూ – ‘పిచ్చుకల రోజొకటి మొదలెట్టడం చిత్రం కదూ!.

ఔను. ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అని జరుపు కుంటున్నాం.

పిచ్చుకలు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ, గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా, చూడముచ్చటగా ఉండేవి.

పల్లెప్రాంతాల్లో పూర్వం ఉండే దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకునే గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పెద్ద సివిలింజనీర్లు.

వీటికి తమ బిడ్డలపై ఎంతో ప్రేమ! నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందింస్తూ, వాటికి రెక్కలొచ్చి ఎగిరే వరకు జాగ్రత్తగా కాపాడుతూ తల్లిదండ్రులుగ అవి తీసుకునే జాగ్రత్త మురిపిస్తుంటుంది.

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

చెప్పేవాడూ, వినేవాడూ ఉన్నచోటే సంపదలు విహరిస్తాయి – విక్రమార్కచరితం