నూరబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి
- వెంపటి హేమ (కలికి)

 


గత సంచిక తరువాయి ↓

సుబ్బులమ్మ ముఖం ఆనందంతో విస్తరించింది. "అద్గదీ అసలైన మాట" అంటూ ఉప్పొంగిపోయింది. ఆ మాటకోసమే ఎదురుచూస్తున్న సుబ్బులమ్మ. అక్కడితో ఊరుకోకుండా "అలా గడ్డెట్టండిబాబూ, బుద్ధివస్తుంది. ఒక ఆడపిల్ల బతుకు నిష్కారణంగా అన్యాయమైపోతే ఊరు చూస్తూ ఊరుకోదని తెలియజెప్పండి" అంది.

సుబ్బరామయ్యకి చెల్లెలిమీద తలమునకలుగా వచ్చింది కోపం. "కానిమాట కప్పెట్టుకోవాలంటారు! కాని ఏమిటిది, తీరి కూచుని కన్నెపిల్ల  కామాక్షి బ్రతుకుని ఇలా రచ్చకెక్కిస్తోంది, ఎందుకో ?" సుబ్బులమ్మ పధకమేమిటో ఆయన కేమీ అర్థం కాలేదు. కాని లౌక్యం తెలిసినవాడు కనక సమయానికి తగినవిధంగా ప్రవర్తించడం ఉచితమని అనుకుని, వెంటనే వెళ్ళి రామేశం ముందు బోర్లా పడి ఆయన కాళ్ళూ రెండూ పట్టేసుకున్నాడు.

"బావగారూ! మీరే రక్షించాలి నన్ను. మీరు "ఊ" అనక తప్పదు. మీరు కాదంటే నా కూతురు బతుకు నాశనమై పోతుంది. దాని నింకెవరూ కోడలిగా అంగీకరించరు. మీకూ ఉంది కదా నా కూతురు వయసు ఆడపిల్ల! న్యాయం ఆలోచించండి స్వామీ" అంటూ కన్నీళ్ళతో ప్రాధేయపడసాగాడు.

రామేశం కంగారుపడుతూ వంగి ఆయనను లేవదీశాడు. ఈ గందరగోళానికంతకీ కారణమైన కొడుకుమీద ఆయనకు 
మొదటిసారి కోపం వచ్చింది. "ఏమిటిరా ఇదంతా" అంటూ ప్రిన్సుని ప్రశ్నించారు.

అసలే ఖిన్నుడై ఉన్న ప్రిన్సుకి ఒకపట్టాన నోట మాట రాలేదు. ఎంతో కష్టం మీద చెప్పాడు, "ఏమో నాన్నా! నాకూ అదే అర్థమవ్వడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నేను ఎవర్నీ కావాలని ఎక్కడకీ తీసుకెళ్ళలేదు. నేను ఫొటోలు తీసుకోవాలని కొండమీది గుడికి వెడుతూంటే దారిలో నడవలేక కష్టపడుతూ మొక్కుతీర్చుకోడానికి ఒంటరిగా గుడికి వెడుతూన్న కామాక్షి కనిపించింది. తెలిసిన వాళ్ళ పిల్లేకదాని నేను లిఫ్టు ఇచ్చా. తిరిగివస్తూండగా బైక్ కి ......"

అతని మాట ఇంకా పూర్తి కాకముందే అక్కడున్న ఆ ఊరివాళ్ళందరూ ఘొల్లున అవహేళనగా నవ్వారు. వెంటనే ఒక మాటకారి అన్నాడు, "హ్హు! అబద్దాలు చెప్పినా అతికేలా ఉండాలి.  ఆమె నీకలా "మొక్కు ఉందని ఎందుకు చెపుతుంది? ఆ గుడిలో అసలు  విగ్రహం ఉంటే కదా అక్కడ పూజలు చెయ్యడానికీ, మొక్కులు చెల్లించడానికీను! ఆ సంగతి కొత్తగా వచ్చిన నీకు తెలియకపోవచ్చుగాని కామాక్షికి ఎందుకు తెలియదు, ఈ ఊరిలో పుట్టి పెరిగిన పిల్ల" అంటూ పడీ పడీ నవ్వాడు అతడు.

ప్రిన్సు కంగు తిన్నాడు. నిస్సహాయంగా తండ్రి వైపు చూశాడు. "నాన్నా! నన్నునమ్ము, నేను చెప్పిన దాంట్లో ప్రతి అక్షరము సత్యమే! ఆమె నాకు అలాగే చెప్పింది. జాలిపడి లిఫ్టు ఇచ్చి ఇంటికి తీసుకువస్తూంటే టైర్లలో గాలిపోయి బైక్ డౌన్ అయ్యింది. నడిచి రావలసి వచ్చింది. క్షేమంగా ఇల్లు చేరాక ఇంకా ఈ గొడవేమిటీ?" అమాయకంగా అడిగాడు ప్రిన్సు.

వెంటనే సుబ్బులమ్మ ముందుకువచ్చి, అతని మాటల్ని ఖండిస్తూ మాటాడింది, "ఎందుకొచ్చిన మాటలివిగాని, మా అమ్మాయి నీ మాటలు ఏరోజువి ఆరోజు నాకు చెపుతూనే ఉంది. అదంటే నీకు చాలా ఇష్టమనీ, అది నీ చెల్లెలి కోసం మీ ఇంటికి వచ్చినప్పుడల్లా నువ్వు దానిచుట్టూ తిరుగుతూ కబుర్లు చెపుతావని చెప్పింది. ఈ రోజు కూడా నువ్వే దాన్ని సైకిల్ ఎక్కమన్నావుట కదా? మీ ఇద్దరి మధ్యా ఉన్న చనువు ఎంత దూరం పోయిందో ఎవరు చెప్పగలరు! ఇప్పుడు మాత్రం మీ ఇద్దరూ కలిసి రావడాన్ని అందరూ చూశారు. ఒక ఐనింటి ఆడపిల్లఏ భరోసా లేకుండా అలా నీ వెంట ఒక్కనాటికి రాదు. నువ్వామెకు పెళ్ళిచేసుకుంటానని ఆశపెట్టి ఉంటావు."

సుబ్బులమ్మ మాటలు వినగానే రామేశం మనసు లోచనలో పడింది. తన భార్యా కూతుళ్ళ ఒరవడిలోనే ఆడవాళ్ళందరినీ ఊహించుకునే అతనికి కొడుకు మాటల మీద నమ్మకం తగ్గింది. మగపిల్లవాడు తొందరపడతాడనీ ఆడపిల్లలు రిజర్వ్డుగా - ఒద్దికగా ఉంటారనీ ఆయన అభిప్రాయం. కూతురు పెళ్ళి ముందు చెయ్యాలి - అని తను అనుకున్నాడుగాని, తన కొడుకు పెళ్ళికోసం తొందరపడుతున్నాడేమో! - ఇలా సాగుతున్నాయి రామేశం ఆలోచనలు.

అక్కడితో జరిగిన మోసమంతా తెర తొలగి కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనట్లనిపించింది ప్రిన్సుకి. ఒక్క సారిగా అతనికి అంతా  అర్ధమయ్యింది. ఒక్కసారిగా కోపం పెల్లుబికి అతని ముఖం ఎర్రబడింది. అప్రయత్నంగా పిడికిళ్ళు బిగవడంతో పట్టుసడలి పెద్ద శబ్దంతో బైక్ కిందపడింది. కాని దానివైపు చూసిన వారెవరూ లేరు. ఆ ప్రదేశమంతా బ్రహ్మాండమైన టెన్షన్తో ఉంది.

రామేశం గారికి కొడుకుమీద బాగా కోపం వచ్చింది. "తనకు పెళ్ళిచేసుకోవాలనిపిస్తే, నాకు ఆ సంగతి చెప్పొచ్చు లేదా తల్లికో చెల్లికో చెపితే సరిపోయేదిగా, చక్కని సంబంధం కుదిర్చి వైభోగంగా పెళ్ళి జరిపించి ఉండేవాళ్ళం, ఇలా డొంకదారులు పట్టవలసిన కర్మం వీడికెందుకు?" అడ్డగోలు వ్యవహారాలతో తనను అప్రతిష్ట పాలుచేసి ఇలా పంచాయితీకి రప్పించిన ప్రిన్సు మీద ఆయనకి వల్లమాలిన చిరాకు వచ్చింది. అతనుకి బి.పి. ప్రకోపించడంతో మనసు వశం తప్పుతోంది.

సుబ్బరామయ్య, "అయ్యా! రామేశంగారూ! మీరు కష్ట సుఖాలు తెలిసినవారు.ఈ పిల్లని మీ పిల్లగా భావించి న్యాయమేమిటో చెఫ్ఫండి" అంటూ రామేశం చేతులుపట్టుకుని బ్రతిమాలసాగాడు. అక్కడున్న అందరూ కూడా. "రామేశంగారే చెప్పాలి న్యాయం" అంటూ గోల మొదలుపెట్టారు.

ప్రిన్సుకి అంతా అర్ధమయ్యింది, తన ఇష్టా ఇష్టాల ప్రమేయం లేకుండా బలవంతంగా తనచేత ఆ కామాక్షి మెడలో మూడుముళ్ళూ వేయించేయాలన్న ప్రయత్నమిది. నా చడువు, నా తెలివి అన్నీ ఏమైపోయాయి, ఇంత తేలికగా నేను ఉచ్చులో చిక్కుకున్నానేమిటి" అని లోలోన బాధపడ్డాడు.

రామేశం చేతులు జోడించి, అక్కడున్న జనాన్నుద్దేసించి చెప్పసాగాడు, "జరిగినదానికి మమ్మల్ని క్షమించండి" అన్నాడు. ఆ తరవాత మాటాడడానికి అతని కంఠం ఒణికింది. ఆయనకి తెలుసు, కామాక్షి ప్రిన్సుకి తగిన వధువు అవ్వదని! కాని ఆయన చెప్పాలనుకున్న మాటని చెప్పక మానలేదు, "భగవంతుని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఇక్కడున్న మీ అందరి సాక్షిగా చెపుతున్నాను, కామాక్షిని నేను మా కోడలిగా అంగీకరిస్తున్నాను." అలా అంటూంటే ఆయన మనసు మూలిగింది. "అయినా ఇదంతా వాడు స్వయంగా చేసుకున్న నిర్వాకమేకదా, నేనేం చెయ్యను" అనుకుని, గుండెరాయి చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు ఆయన.

తండ్రిమాటలు విన్న ప్రిన్సు మనసంతా దుఃఖంతో నిండిపోయింది. "మా నాన్నకు కూడా అక్కరలేదా నాశ్రేయస్సు" అని బాధపడ్డాడు." సత్యం అసత్యానికి దాసోహమా! అలా ఒక్కనాటికి జరగనియ్యను."

వెంటనే అతనిలో పట్టుదల పెరిగింది, "ఎట్ ఎనీ కాస్టు" అనుకున్నాడు దృఢంగా. ఆ పైన గుండె నిబ్బరం తెచ్చుకుని - పరిస్థితులు ఎటుపోయి ఎటు వచ్చినా  ధైర్యంగా ఎదిరించడానికే నిశ్చయించుకున్నాడు.

రామేశంగారి న్యాయనిర్ణయం విన్న సుబ్బులమ్మ ఆనందానికి అవధుల్లేవు. వెంటనే ఆ శుభవార్త కామాక్షికి చెప్పి, ఆమెను అభినందించాలని, కంగారుగా ఇంట్లోకి పరుగెత్తింది. విజయగర్వంతో అక్కడున్నవాళ్ళు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ప్రిన్సు "ఆపండి, వెంటనే గోల ఆపి, చెప్పేది శ్రద్ధగా వినండి....మా నాన్న ఆమెను కోడలిగా అంగీకరించి ఉండవచ్చు, కాని నేను ఆమెను భార్యగా అంగీకరించలేను! నేనా మాటను ఒప్పుకున్నట్లైతే, చెయ్యని తప్పుని నేను చేశానని ఒప్పుకోవడమే  ఔతుంది. అలాంటి పని నేను చెయ్యను. నేను చేసింది పరోపకారం మాత్రమే! అది కూడా నేరమే ఐతే దానికి తగిన శిక్ష నాకు వెయ్యండి, అనుభవిస్తా.. కాని, ఇలా చెయ్యని నేరాన్ని నాకు అంటకట్టి, జీవితకాలం అనుభవించేలా శిక్ష వెయ్యాలని చూడకండి. నేను ఒప్పుకోను" అన్నాడు ఖరాఖండీగా.

అతనిమాటలకు అక్కడున్నవాళ్ళు "హాహా"కారాలు చేశారు. "పితృధిక్కారం!" అంటూ అరిచారు కొందరు. "తండ్రి మాటంటే అసలు లక్ష్యం ఉన్నట్లు లేదు. పిదపకాలపు మనుష్యులు, పిదపకాలం బుద్దులు" అంటూ వాపోయారు మరికొందరు. అంతేకాని వారిలో ఒకరైనా ప్రిన్సు చెప్పిన మాట మనసా విన్నవారుగాని, విని అర్థం చేసుకున్నవారు గాని అక్కడ ఉన్నట్లు అనిపించలేదు.

హైబి.పి.తో కొట్టుమిట్టాడుతున్న రామేశానికి కొడుకు ఆవేదన అర్థం కాలేదు. జనాలు చేస్తున్న అవహేళనలు భరించలేకపోతున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు రెచ్చగొట్టడంతో బొత్తిగా ఆలోచన లేకుండగా మాటాడాడసాగాడు. ఇన్నాళ్ళూ తను గీసిన గీటు దాటని కొడుకు, అకస్మాత్తుగా ఈవేళ తనమాట లెక్కచెయ్యకుండా, అంతమంది మధ్య తనని అవమానించాడని, తన పెద్దరికాన్ని నవ్వులపాలు చేశాడనీ కొడుకుమీద ధ్వజమెత్తాడు రామేశం. అంతేగాని కొడుకు మాటలు బి.పి. పెరగడం వల్ల వచ్చిన చెవుల్లో హోరువల్ల ఆయనకీ కొడుకు చెప్పిన మాటలు వినిపించలేదు. .

కొడుకు వైపు చూసి,"అదే నీమాటైతే, ఇక నా మాటేమిటో విను - ఇక నీకూ నాకూ ఏ సంబంధం లేదు. నా కసలు కొడుకే పుట్టలేదని మనసు సరిపెట్టేసుకుంటా. మళ్ళీ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు" అంటూ కేకలు పెట్టాడు రామేశం, హిస్టేరియా వచ్చినవాడిలా, ఊగిపోతూ.

ప్రిన్శు నిర్ఘాంతపోయాడు. ఇటువంటి శిక్ష పడుతుందని అతడు కలలోకూడా అనుకోలేదు. ఆ తరవాత కొంతసేపటికిగాని అతడు తేరుకోలేకపోయాడు. తేరుకున్నాక మరొక్క క్షణం కూడా అతడు అక్కడ నిలబడలేదు. మనసుతోనే తల్లితండ్రులకు నమస్కరించి, సెలవడిగి, చెల్లెలిని పలకరించి, ముగ్గురి దగ్గర వీడ్కోలు తీసుకుని; నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

సుబ్బులమ్మ తిరిగి వచ్చేసరికి అంతా ముగుసిపోయింది. ఒంటరిగా నడుచుకుంటూ, పరిసరాలని ఆవరించివున్న చీకటిలోకి వెళ్ళిపోతూ దానిలో కలిసిపోతూన్న ప్రిన్సు రూపం లీలగా కనిపించింది ఆమెకు.

                         #                          #                                #                    

ఆరాత్రి ఆ రెండు కుటుంబాలవాళ్ళకీ కాళరాత్రే అయ్యింది.సుబ్బులమ్మ పన్నిన వ్యూహం "స్వపక్ష పరపక్ష నిర్ధూమధామమై" అందరికీ చెడుగానే పరిణమించింది. ఒక్కళ్ళకీ కంటిమీద కునుకు లేదు.

ఇక సుబ్బులమ్మకైతే పచ్చి వెలక్కాయగొతుకులో అడ్డుపడ్డట్టు, ఊపిరాడని పరిస్థితి వచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది.

సుబ్బులమ్మ ఒడిలో పడుకుని, కుమిలికుమిలు ఏడుస్తున్న కామాక్షి, "అత్తయ్యా!ఇలా జరిగిందేమిటి" అని అడిగింది ఏడుస్తూనే.

"ఊష్! గట్టిగా మాటాడకే బాబూ! మీ నాన్నకి నిజం తెలిస్తే ఊరుకోడు.... నన్నూ, నిన్నూ కూడా ఉన్నపళంగా ఇంట్లోంచి గెంటేస్తాడు, జాగ్రత్త!"

జవాబు చెప్పాలంటే సుబ్బులమ్మకు చాలా భయంగా ఉంది. నెమ్మదిగా కామాక్షికి ఒక్కదానికే వినిపించేలా చెవిలో గుసగుసలాడింది, "నూరు అబద్దాలాడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్న సామెతని నమ్మి, నువ్వు కోరుకున్నవాడితో నీ పెళ్ళి జరిపించడం కోసం ఈ పన్నాగం పన్నాను. కాని నీ పెళ్ళి ఇలా నూటొకటో అబద్ధంగా మారుతుందని ఏపాటి అనిపించినా కూడా ఒక్కనాటికి ఇలాంటి పాడుపని తలపెట్టేదాన్ని కాదు సుమీ!" అంది పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న సుబ్బులమ్మ.

 

…. సమాప్తం ....

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మసలే వేడి నీళ్ళు కూడా నిప్పును చల్లార్చగలుగుతాయి – గాథాసప్తశతి