Sravanthi

Father's Day


తే.గీ.

అమృతవాత్సల్య మొలికించి అంకమందు
నిల్పి దిద్దించు అక్షరశిల్పి అతడె
తాను పడినట్టి శ్రమను సంతాన మెపుడు
చెందకుండగ చూచు ఆనంద మొంది

కం.

క్రమశిక్షణ నేర్పుచు ఉ
త్తమబుద్ధుల గరపి ఉన్నతంబగు చదువుల్
శ్రమ నెంచక చదివించెడి
సుమనస్సే తండ్రి భువిని సురవరు డతడే

కం.

తనపిల్లల వృద్ధిని కని
అనయము మురియుచును బాహ్యమందున గర్వం
బణువంతయు రానీయక
తను పొగడని ధన్యజీవి తండ్రియె కాడే?

తే.గీ.

“దాశరథి” అంచు ఆ రామదాసు పిలిచి
శతక మర్పింప సంతోషజనక మయ్యె
రామచంద్రున కది పితృనామయుతము
కాన; జ్ఞానప్రదాతకు కలదె సాటి?

తే.గీ.

ఎవరు నీవన చెప్పెడి దెవరి పేరు
తొలుత? జానకి, మారుతి నిలుచు ఎవరి
సంతతికి చిహ్నమై అట్టి జనకునకును
అంజలిఘటించి దీవెన లంద వలయు

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మసలే వేడి నీళ్ళు కూడా నిప్పును చల్లార్చగలుగుతాయి – గాథాసప్తశతి