adarshamoorthlu


పాలం కల్యాణసుందరం

Ksundaram“మానవ సేవే మాధవ సేవ” అని మనందరం పదే పదే అనుకుంటూవుంటాం. కానీ ఆచరణలోకి వచ్చే సరికి మనలోని స్వార్థచింతన, స్వలాభం కోసం శ్రమించే విధంగా మన ఆలోచనల ధోరణిని మారుస్తుంది. అందుకే మనం “ముందు ఇంట గెలిచి తరువాత రచ్చ గెలువు” అని సర్దుకొని చెప్పుకుంటాం. మన కుటుంబ సౌఖ్యం ప్రధమ కర్తవ్యంగా భావించి, మన జీవన విధానాలు మెరుగయ్యేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. ఒక ప్రమాణం లేక, అంతం లేని కోరికల అలలతో కలిసి కొట్టుకుపోతూ, ఎంతో మానసిక, శారీరక అలసటలతో సతమతమవుతుంటాం. అంతేకాని మన గురించి కాకుండా ప్రక్కవారి గురించి, కనీస జీవన వసతులు లేక అలమటించే అభాగ్యుల గురించి ఆలోచించే విశాల హృదయం, సమయం మనకు ఉండదు. అదేమంటే తనకు మాలిన ధర్మం...అని ఇంకేదో అనుకొంటాం.

కానీ మనలో కూడా మానవత్వమే పరమావధిగా భావించి అభాగ్యులకు అండగా నిలిచేందుకు తమ జీవన సౌఖ్యాలను త్యజించి నిరంతరం సమాజసేవే తమ పరమార్థం అని ఉండే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ, వారు చేసిన మహోన్నత సేవలు సమాజం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి వారు ఎవరి మెప్పు కోసమో పని చేయరు. అందుకే వారికి ఎటువంటి పురస్కారాలు, గుర్తింపులు కూడా లభించవు. వారికి వాటి అవసరం కూడా లేదు. అటువంటి గొప్ప సామాజిక వేత్త శ్రీ పాలం కళ్యాణ సుందరం గారి గురించిన విశేషాలే నేటి మన ఆదర్శమూర్తులు శీర్షిక.

కళ్యాణ సుందరం గారు తన ముప్పై ఏళ్ల లైబ్రేరియన్ వృత్తిలో తన కంటూ మిగుల్చుకొంది ఏమీలేదు. ప్రతి నెలా తన జీతం మొత్తాన్ని అభాగ్యుల ఆకలిని తీర్చడానికే ఖర్చు పెట్టాడు. చివరకు తన పదవీవిరమణ డబ్బులు కూడా తనవికావు అని అనాధులకు ఇచ్చేశాడు. ప్రపంచం మొత్తం మీద ఇంతటి ఉదాత్తస్వభావి బహుశా ఎవ్వరూ ఉండరేమో. కలియుగ దానకర్ణుడు. మరి ఆయన జీవించడానికి డబ్బులు ఎలా అంటే, హోటల్స్ లొ సర్వర్ గా పనిచేసి తన కడుపు నింపుకునేవాడు.

ఆయన సేవా తత్పరతను మెచ్చి అమెరికన్ ప్రభుత్వం “మాన్ అఫ్ ది మెల్లీనియం” బిరుదుతో ఆయనను సత్కరించింది. మనందరికీ ఆయన గురించి చాల తక్కువ తెలుసు ఎందుకంటే ఆయనకు పలుకుబడి, రాజకీయ సంబంధాలు లేవు కదా. అయితే రజనీకాంత్ వంటి సాత్విక నటుడు కళ్యాణ సుందరం గారిని తన తండ్రిగారుగా అభివర్ణించి ఆయనను దత్తత తీసుకొన్నారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామని అంతర్జాలంలో ప్రయత్నిస్తే చాలా కొద్ది సమాచారం మాత్రమే లభిస్తున్నది. ఎందుకంటే ఆయన ఆడంబరాలకు, అవార్డులకు దూరంగా తన సంకల్ప బలాన్ని మరింతగా అభివృద్ధి చేసుకొని సమాజ శ్రేయస్సుకై తన జీవితకాలాన్ని వెచ్చించే పనిలో చాలా బిజీ గా ఉన్నారు. మరొక్కసారి ఆ మహానుభావునికి, ఆయనలోని సేవాతత్పరతకు ఆనందపూరిత నయనాలతో అభినందనలు తెలియచేద్దాం.

 

Source1, Source2

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మాటతీరు పాండిత్యాన్ని తెలియజేస్తుంది. – శివపురాణం