సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

౨౦౧. తెలిసి చేసినా, తెలియక చేసినా నిప్పులో చెయ్యి పెడితే కాలక మానదు.
౨౦౨. గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు.
౨౦౩. రాట్నం వస్తోంది, బండిని అడ్డం తప్పించండి - అన్నట్లు ...
౨౦౪. ఎల్లీ! ఎల్లీ! నువ్వు పోటెయ్యి,  నేను డొక్కలెగరేస్తా _ అన్నట్లు ...
౨౦౮. పాడి ఎక్కువ, భాగ్యం ఎక్కువ ఉండవు.
౨౦౫. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉంది...
౨౦౬. యాదవ కుల నాశనానికి ముసలం పుట్టినట్లు...
౨౦౭. అన్నీఎక్కువ అనిపించినా, భాగ్యం ఎక్కువ అనిపించదు...
౨౦౯. పసిబిడ్డకు, పాలకుండకూ చాటూ మరుగూ ఉండాలి.
౨౧౦. పోట్ల గొడ్డుకి రోలడ్డం.
౨౧౧. స్వాతి చినుకులు పడితే ముత్యాలు పండుతాయి.
౨౧౨. మన బంగారం కల్తీకి ఓర్చకుంటే కంసాలి ఏంచెయ్యగలడు?
౨౧౩. చక్కదనానికి నేను - అని అందిట లొట్టిపిట్ట. వెంటనే సంగీతానికి నేను అందిట గార్ధభం. కాని దొందుకి  దొందే!
౨౧౪. చదువురాని మొద్దు కదలలేని ఎద్దుతో సమానం.
౨౧౫. చదవ్వేస్తే ఉన్నమతికూడా పోయిందిట!
౨౧౬. వెర్రికి వేయివేల విధాలు!
౨౧౭. వెర్రి కుదిరింది, ఇక తలకి రోకలి చుట్టొచ్చు - అన్నాట్ట!
౨౧౮. వెర్రికి తొర్రి తోడయ్యిందిట!
౨౧౯. రాచ పీనుగు తోడులేకుండా వెళ్ళదు.
౨౨౦. నన్ను చూడు, నా అందం చూడు, పక్కనున్న సహవాసం చూడు...
౨౨౧. అదృష్టం ఉంటే చాలు,పట్టినదంతా బంగారం, ముట్టినవన్నీ ముత్యాలు!
౨౨౨. చీర ఎరువిచ్చి, పీట పట్టుకుని వెనకాలే తిరిగిందిట!
౨౨౩. నా నోట్లో నువ్వు వేలు పెట్టు, నీ కంట్లో నేను వేలుపెడతా - చెల్లుకి చెల్లు - అన్నాడుట వెనకటికి ఒకడు.
౨౨౪. చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష!
౨౨౫. అల్పుడిని బలవంతుడు కొడితే, బలవంతుణ్ణి భగవంతుడు కొట్టాడు.
౨౨౬. తిన్న ఇంటి వాసాలు లెక్కించ కూడదు.
౨౨౭. ఉప్పు తిన్న చోట తప్పు చెయ్య కూడదు.
౨౨౮. అడిగేవాడికి, అడిగితే చెప్పేవాడు లోకువ.
౨౨౯. సుఖం మరిగిన దాసరి పదం మరిచాడు.
౨౩౦. చీమలు పుట్టలు పెడితే, పాములు దూరి కాపురం పెడతాయి.

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మాటతీరు పాండిత్యాన్ని తెలియజేస్తుంది. – శివపురాణం