Alayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

మనిషికి మతానికి మధ్యన మహోన్నతమైన మరో అంశం దాగి ఉంది. అదే మానవత్వం. మానవత్వం మనుగడతో సిద్దించేదే దైవత్వం. మతాలు వేరైనా వాటి పరమార్థం ఒక్కటే. అదే మంచితనం. మనిషికి మంచి నడవడిక, మంచి ఆలోచనల స్థిరత్వం, మంచి సామాజిక విలువల మార్గనిర్దేశం తదితర ధర్మాలను ప్రభోదిస్తూ, ప్రతిబింబించే వేదికే, ప్రతి ఊరిలోనూ ఉండే పవిత్ర స్థలం ‘ఆలయం’ ‘దేవాలయం’. రూపాలు ఎన్నైనా అనంతమైన శక్తిపుంజము ఒక్కటే. అదే దైవత్వం.

ఆలయం అంటే ఆది నుండి లయం వరకు మానవ జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ ఆదర్శవంతమైన జీవిత ప్రాభవాన్ని వివరిస్తూ, తదనుగుణంగా మానవ విలువలను, మన సంస్కృతిని పరిరక్షిస్తూ, మన జీవన వైవిధ్యాన్ని వివరిస్తూ, నిక్షిప్తిస్తూ, మనిషి జన్మ యొక్క మాధుర్యాన్ని మన భావితరాలకు కూడా అందించే అద్భుత పవిత్ర స్థలం.

నాటి రాజుల నుండి నేటి సామాన్యుని వరకు ప్రతి భాషకు, సంస్కృతికి ఒక క్రమశిక్షణతో కూడిన విధానం వుంది. ఆ విధానాన్ని నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొంటే మన జీవితం, ఎంతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. 

మన సిరిమల్లె ద్వితీయ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా గత 12 సంచికలలో ప్రచురించిన వివిధ ఆలయాల సంగ్రహ సమాచారం మీ కోసం మరొక్కసారి అందిస్తున్నాం.

మీ ఊరిలోని దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ వద్ద ఏదైనా సమాచారం వుంటే, మాకు పంపిస్తే ఈ శీర్షికలో ప్రచురిస్తాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

Open All


సెప్టెంబర్ 2017: శ్రీ సూర్యదేవాలయం, అరసవిల్లి, శ్రీకాకుళం

తైత్తరియోపనిషత్ లో సూర్యుని విశ్వ చక్షువు (ప్రపంచానికి కళ్ళవంటివాడు) అన్న ప్రస్తావన ఉంది. నిజమేకదా! సూర్యుని వెలుగు లేనిదే,  జగత్తు తమోమయం. సూర్యోదయం లేనినాడు,  ప్రపంచం అంధకార బంధురం. జీవ జగత్తుకు సూర్యుడే ప్రాణం, దిశానిర్దేశం. అందుకే సూర్యుడే, జగతికి నేత్రములవంటివాడనటం, యెంతో యుక్తి యుక్తం. అంతే కాదు. సూర్యుని ఒక గ్రహంగా కాక, ప్రత్యక్ష దైవంగా కొలిచే సంప్రదాయం అనాదిగా వస్తున్నది.

పూర్తిగా ఇక్కడ చదవండి »

అక్టోబర్ 2017: లక్ష్మీనారాయణ ఆలయం, రాబిన్స్ విల్లె, న్యూ జెర్సీ, యు.ఎస్.ఎ.

అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది అదియే దైవం అని ఒక మహానుభావుడు అన్నాడు. దానర్థం ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి అందరిలోనూ ఉన్న దేవుడికి అంగరంగ వైభోగాలు, అపురూపమైన రత్నాభరణాలు, మణి మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అత్యంత విలాసవంతమై ముత్యాలు పగడాలు చెక్కిన నగిషీలు, పాలరాయి కట్టడాలు, గుడిగోపురాలు అవసరమా అంటే బహుశా ఆ దేవుడు కూడా సందిగ్ధంలో సమాధానం చెప్పలేడు.

వడ్డికాసుల వాడు తను కూడా వజ్ర వైఢూర్యాలు, బంగారు తాపడం చేసిన ఆలయాన్ని తన భక్తులచే నిర్మింపజేసి అందులో కొలువై తనతోపాటు 15 మంది దేవతామూర్తులను కూడా మన దర్శనార్థం, నిత్యపూజలు చేసుకునే మహాత్భాగ్యం కల్పించాడు.

పూర్తిగా ఇక్కడ చదవండి »

నవంబర్ 2017: ఐహోల్ దేవాలయ ప్రాంగణం, కర్నాటక రాష్ట్రం

ఈ ఐహోల్ దేవాలయ ప్రాంగణం, భారతదేశం లో ఉన్న అతిపురాతనమైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ దొరికిన సంస్కృత శాసనాల ప్రకారం ఈ ప్రాంగణం లోని ఆలయాలను క్రీ.శ. 470 నిర్మించడం మొదలుపెట్టారు. మొదట ఇక్కడ శివుని ఆలయం నిర్మించారు. ఆ తరువాత మిగిలిన ఆలయాల నిర్మాణం మొదలైంది. క్రింద చూపిన ఏడవ శతాబ్దం నాటి శిలాశాసనం ఈ ప్రాంగణంలోనే లభించింది. పూర్తిగా సంస్కృత లిపిలో ఉంది. ఇది చాలు ఈ దేవాలయల వైభవం ఎంత పురాతనమైనదో చెప్పడానికి.

మన సిరిమల్లె ఫిబ్రవరి 2016 సంచిక ఆలయసిరిలో, ప్రాంబనన్ త్రిమూర్తుల ఆలయం, జావా, ఇండోనేషియా గురించి వ్రాయడం జరిగింది. అది క్రీ.శ. 9వ శతాబ్దంలో, నేటి ఇండోనేషియా దేశం లోని జావా ద్వీపంలో నిర్మించిన త్రిమూర్తుల ఆలయం గురించిన సమాచారం. భాషా శాస్త్రజ్ఞులను అనుసరించి జావా భాషలో ‘ప్రాంబనన్’ అంటే ‘పరబ్రహ్మ’ అని అర్ధం. హిందూ పురాణాలలో చెప్పిన భూర్లోక, భువర్లోక, సువర్లోకాల వర్ణనలకు అనుగుణంగా మండల వాస్తుశైలిని పాటించి 224 దేవాలయాలను అక్కడ నిర్మించారు. అయితే మన దేశంలో అంతకు మునుపే ఐదు కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ఈ ఐహోల్ ప్రాంగణంలో దాదాపు 70 ఆలయాలవరకు నిర్మించారని పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా. కొన్ని ఆలయాలలో నేటికీ ఇక్కడ నిత్యపూజలతో పాటు అనేకరకమైన ఉత్సవాలు ఇంకా జరుగుతున్నాయి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

డిసెంబర్ 2017: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, బర్మింగ్హాం, యునైటెడ్ కింగ్డమ్

మన భారతదేశాన్ని ఆంగ్లేయులు దాదాపు 90 సంవత్సరాలు (1858-1947) పరిపాలించారు. తద్వారా ఇరువైపులా సాంస్కృతిక, సామాజిక వినిమయం అంటే మార్పిడి కూడా చోటుచేసుకున్నది. మన హిందూ మతం లోని అత్యంత విలువైన సనాతన ధర్మాలను, వేదాలను ఆంగ్లేయులు ఎంతో నిష్ఠతో అవగాహన చేసుకొన్నారు. మనలో కూడా ఎంతో మంది క్రైస్తవ ధర్మాలను ఆచరించడం మొదలుపెట్టారు. మనకు స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఎంతో మంది భారతీయలు ముఖ్యంగా దక్షిణ భారతం నుండి ఇంగ్లాండ్ కు వలస వెళ్ళారు. అయితే మన హైందవ ధర్మాలను ఆచరించడం కొంచెం కష్టమనిపించినా అవకాశం కొఱకు వేచియుండి చిన్న చిన్న ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేసుకొని పూజలు చేయడం మొదలుపెట్టారు. అలా సమిష్టిగా బర్మింగ్హాం ప్రాంతంలో మొదలుపెట్టిన ఆ కృషి చివరకు ఐరోపా ఖండం లోనే అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి ఆలయంగా ఆగష్టు 2006 సంవత్సరంలో వెలసింది. తిరుమల దేవస్థానం స్ఫూర్తితో ఈ ఆలయ నిర్మాణం అదే ఆకృతిలో కట్టడం జరిగింది.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జనవరి 2018: సూర్య దేవాలయం, సూర్యకుండ్, గుజరాత్, ఇండియా

“సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం తం సూర్యం ప్రణమామ్యహం...”

ఆది నుండీ, మన భారతీయుల మేధాసంపత్తి, వైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతో గొప్పది. అందుకు సరైన నిర్వచనం వందల ఏళ్ల పూర్వమే మనవాళ్ళు అందమైన శిల్పకళా నైపుణ్యంతో ఒకటికొకటి అనురూపముగా నిర్మించిన అద్భుత కట్టడాలు. అటువంటి అపురూపమైన శిల్పకళా చాతుర్యంతో, చక్కటి ఆకృతితో, వేలమంది ఒకేచోట కూడి ఏ కార్యాన్నైనా సులువుగా నిర్వహించుకునే వీలుతో నిర్మించిన ఈ సూర్యకుండ్, అదే సూర్య దేవాలయం, నేటి మన ఆలయసిరి.

ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో అంటే క్రీ.శ 1026-27 మధ్య కాలంలో నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న కోనేరు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. చాళుక్యుల నిర్మాణ శైలి అయిన మరు-గుర్జరా (Maru-Gurjara style) శైలి లోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ కోనేరులోని మెట్లు అన్నీ చక్కటి రేఖాకృతిని కలిగి ఉండి ఎంతో అందంగా కనిపిస్తాయి. ప్రతి మెట్టు మీదా చక్కటి ఆకృతితో నిర్మించిన గోపురాలు మంచి శిల్ప సంపదతో అందరినీ ఇట్టే ఆకట్టుకొంటాయి. అంతేకాక ఈ కట్టడాలలో కొన్ని వందల సంవత్సరాలు భౌగోళిక మార్పులను, వాతావరణ వత్తిడులను తట్టుకొని నిలబడుతున్నాయి అంటే నాటి పనిలో చూపిన నాణ్యత ఎంత గొప్పదో అర్థమౌతుంది.

పూర్తిగా ఇక్కడ చదవండి »

ఫిబ్రవరి 2018: శ్రీ శివ సుబ్రహ్మణ్య ఆలయం, నడి, ఫిజి దేశం

బ్రతుకు తెరువు కోసం మనిషి తన సొంత గడ్డ ను వదిలి వేరే ప్రదేశాలకు, ప్రాంతాలకు, చివరకు ఇతర దేశాలకు వెళ్ళినను, తనకు మంచి జీవన ధర్మాలను బోధించిన పద్దతులను, పూర్వీకులు అందించిన ఆచారాలను కూడా తనతోనే తీసుకెళ్ళి వాటి ఉనికిని సదా కాపాడుకొంటాడు. అందుకే మానవజన్మ ఎంతో ఉత్తమమైనదని మనం నమ్ముతున్నాము. ఏ మతంలోనైనా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. మన భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఎక్కడ ఉన్ననూ దైవచింతన అనేది సదా వెన్నంటే ఉంటుంది. కనుకనే మనం ఇన్ని దేవాలయాలను ప్రపంచం నలుమూలలా చూస్తున్నాం. ఈ నాటి సంచిక ఆలయసిరిలో ఫిజి దేశంలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయవిశేషాలను మీ కొఱకు అందిస్తున్నాను.

పూర్తిగా ఇక్కడ చదవండి »

మార్చి 2018: శ్రీ కాళహస్తి ఆలయం, శ్రీ కాళహస్తి, ఆంధ్రప్రదేశ్

త్రిమూర్తులందరిలో, భోళాశంకరుడైన ఆ మహాశివుడు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నింటా వ్యాపించి పంచభూతాత్మ స్వరూపుడైనాడు. ఆ లయకారుని పంచభూత లింగాలు, పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం, తేజోలింగాలు మన భారత దేశంలో ఐదు పుణ్యక్షేత్రాలలో వెలసి పంచభూతలింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ పుణ్యక్షేత్రాలు కాంచీపురం, చిదంబరం, జంబుకేశ్వరం, శ్రీ కాళహస్తి మరియు అరుణాచలం.

  1. పృథ్విలింగం: కంచిలో ఏకాంబరేశ్వర స్వామి గా ఈ మట్టి లింగం పూజలందుకుంటున్నది. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే ఈ లింగాన్ని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.
  2. ఆకాశలింగం: చిదంబరం లోని నటరాజస్వామే ఈ ఆకాశలింగం. చిదంబర రహస్యం లాగే ఈ ఆకాశలింగం మనకు కనపడదు.
  3. జలలింగం: జంబుకేశ్వర క్షేత్రంలో వెలసిన ఈ లింగం క్రింద ఎల్లప్పుడూ నీరు ఊరుతూనే వుంటుంది. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చింది.
  4. వాయులింగం: శ్రీ అంటే సాలీడు, కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు వెరసి శ్రీ కాళహస్తి. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు పై మూడు జంతువులకు మోక్షం ప్రసాదించి, వాటి పూజలను గుర్తించి శ్రీ కాళహస్తీశ్వరుడుగా వెలిశాడు. శ్రీ కాళహస్తి ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు.
  5. తేజోలింగం: అరుణాచలంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఏర్పడిన అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని నమ్మినందున ఈ కొండకు తూర్పువైపున అతిపెద్ద దేవాలయం నిర్మించి, ఆ అరుణాచలేశ్వరుణ్ణి భక్తితో కొలిచే పూజావిధానం గౌతమ మహర్షి రూపొందించారని ప్రతీతి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

ఏప్రిల్ 2018: కళారామ మందిర్, నాసిక్, మహారాష్ట్ర

శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

మన జీవితాలతో పెనవేసుకొని ప్రతి ఒక్కరూ పదే పదే పాడుకొనే ఈ పద్యం/శ్లోకం ఎవరికి సుపరిచితం కాదు. ఈ స్తుతి చాలు ఆ కోదండరాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. ఆయన పాటించిన నియమ నిష్ఠలు, నైతిక విలువల ప్రమాణాలు ఎంతో విలువైనవి, అందరికీ ఆమోదయోగ్యమైనవి. అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు.

మన తెలుగువారికి ఎంతో పవిత్రమైన గోదావరి నది పుట్టిన నాసిక్ ప్రాంతంలో కళారామ సంస్థాన ఆధ్వర్యంలో నిర్మించి నిర్వహించబడుతున్న శ్రీ కళారామ ఆలయ విశేషాలు శ్రీరామ నవమి సందర్భంగా మీ కోసం మన ‘ఆలయసిరి’ లో అందిస్తున్నాను.

పూర్తిగా ఇక్కడ చదవండి »

మే 2018: సరస్వతి ఆలయం, టొరంటో, కెనడా

ఉ: క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

అని పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవతం ప్రారంభంలో స్తుతించిన ఈ సరస్వతీ పద్యాలు ఎంత గొప్పవో తెలుగువారమైన మనకు విదితమే.

జ్ఞానసముపార్జనకు మూలస్తంభమైన ఆ చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయాలు మన దేశంలో ఎక్కువగా లేవు. మన ‘సిరిమల్లె’ లో పెద్ది సుభాష్ గారు ‘వరవీణ’ శీర్షిక ద్వారా ప్రపంచంలో ఉన్న సరస్వతి దేవాలయాల గురించి వివరణ ఇచ్చారు. ఇప్పుడు శృంగేరి మఠం వ్యవస్థాపకుడు శంకర భగవత్పాదులు 7 వ శతాబ్దంలోనే శృంగేరి లో నిర్మించిన ఆలయ నమానాతో, ప్రస్తుత మఠాధిపతి శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ ఆశీస్సులతో శృంగేరి మఠం వారు కెనడా దేశంలోని టొరంటో నగరంలో నిర్మించిన సరస్వతి ఆలయం గురించిన విశేషాలే నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జూన్ 2018: కోదండ రామాలయం, గొల్ల మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

మన సంస్కృతి ఎంత విలువైనది, పురాతనమైనది. అందుకు ప్రామాణికాలు, ప్రతి ఒక్క గ్రామంలో నిర్మితమైన మన దేవాలయాలు. తరాలు మారి అంతరాలు పెరుగుచున్నను తమ నిర్మాణ పటిమను చూపుతూ తమలో ఎటువంటి మార్పు ఉండదని ఠీవిగా నిలుచుని మన ప్రాచీన సంస్కృతిని, సామాజిక స్థితిగతులను ప్రతిబింబింప జేస్తున్నాయి. ఎన్ని ప్రకృతి విలయాలు ఏర్పడినను మేమున్నామని ధైర్యం చెప్పే ఆ మహా రాజగోపురాల రాజసం వర్ణించడానికి ఎన్నో కావ్యాలు వ్రాయాలి. ఒక విధంగా ఈ రాజగోపురాలు మనకు దిక్చూచి వంటివి. ఊరిలో ఏవైపు నుండి చూసినను ఎత్తుగా ఉండి మనకు దోవ చూపుతాయి. అటువంటి పెద్ద గోపురాలను కలిగి నిత్యపూజలతో అలరారుతున్న గొల్ల మామిడాడ శ్రీ కోదండరామ ఆలయం యొక్క విశేషాలే నేటి మన ఆలయసిరి.

తూర్పు, పడమర రెండు వైపులా రెండు ప్రధాన రాజగోపురాలతో ఈ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. తూర్పు వైపున ఉన్న రాజగోపురం దాదాపు 200 అడుగుల ఎత్తుతో అనేక అంతస్తులు కలిగి ఉంటుంది. ఆ గోపురం చివరి అంతస్తు నుండి చూస్తే దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఊళ్ళు, పచ్చటి గోదావరి పచ్చిక బైళ్ళు మనకు గోచరిస్తాయి. రాజగోపురాల మీద రామాయణ భారత భాగవత ఘట్టాలను అత్యంత శోభాయమానంగా చెక్కారు. మన సంస్కృతిని గుర్తుచేసుకోవడానికి ఇటువంటి ఆలయాలను సందర్శిస్తే చాలు. వేరే పుస్తక పఠనం అవసరం లేదు.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జూలై 2018: పరాశక్తి అమ్మవారి ఆలయం, కెన్నెత్ పోంటియాక్, మిచిగాన్ రాష్ట్రం, యు.ఎస్.ఎ.

మనం ఏ మంచి కార్యాన్ని తలపెట్టినా అందుకు భగవంతుని సంకల్పం, ప్రోత్సాహం, ఆశీస్సులు మెండుగా ఉంటేనే ఆ కార్యం ఎటువంటి అవాంతరాలకు లోనుకాకుండా పూర్తి అవుతుందని మానవులమైన మనందరి నమ్మకం. అటువంటి సన్నివేశం డా. కృష్ణ కుమార్ గారి విషయంలో జరిగి, ఆయన కలలో ఆ కుండలినీ అమ్మవారు, ఆది పరాశక్తి కనపడి, ప్రపంచ శాంతి పరిరక్షణ, సుఖశాంతులు పరిరక్షించడానికి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. పర్యవసానమే ఆరు మార్గాల హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా 1999 వ సంవత్సరంలో మిచిగాన్ రాష్ట్రంలో నిర్మితమైన ఈ ఆదిపరాశక్తి తీర్థపీఠం, నేటి మన ఆలయసిరి.

ఈ ఆదిపరాశక్తి ఆలయంలో అమ్మవారు పరాశక్తి కుమారి అంబిక గా మనకు దర్శనమిస్తారు. ఎన్ని రూపాలలో ఉన్ననూ ఆ అమ్మవారి కృపాకటాక్షాలు లేకుంటే అంతా వినాశనమే. ప్రపంచం అంతా నిండివున్న ఆ శివశక్తి లో, శక్తి ఉన్నచోట మరి లయకారుడు కూడా ఉండాలి కదా. అందుకే ఆ శంకరుడు కూడా కొలువై ఉన్నాడు.

పూర్తిగా ఇక్కడ చదవండి »

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. – స్వామి వివేకానంద