adarshamoorthulu


తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంచికలో తమ తమ రంగాలలో నిష్ణాతులై, నిస్వార్ధంగా నివసించి అందరికీ మంచి మార్గాన్ని చూపించిన ఒక మహానుభావుడి గురించిన సమాచారం నాదైన శైలిలో క్రోడీకరించి మీకు అందించే ప్రయత్మం చేస్తున్నాను. ఈ తృతీయ వార్షికోత్సవ సంచికలో గత 11 సంచికలలో ప్రచురించిన ఆదర్శమూర్తుల జీవిత గాథలు మరొక్కసారి సంగ్రహంగా మీకు అందిస్తున్నాం.

 

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

Open All


సెప్టెంబర్ 2017- అపర గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామానుజన్

“పుణ్యభూమి నా దేశం నమో నమామి! నన్ను కన్న నా దేశం సదా స్మరామి!”

ఇది నిజంగా అక్షరసత్యం. మన భారతదేశ చరిత్ర పుటలు ఎన్నో గొప్ప విషయాలు, సత్యాలతో నిండి ఉండాలి కానీ, కొన్ని విషయాలు మాత్రమే మనకు గోచరిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గణిత శాస్త్రాలకు ఆయువుపట్టై, నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక సాంకేతిక కంప్యూటర్ పరిజ్ఞానానికి మూలం అయిన సంఖ్య ‘సున్నా’ అని ఎంతమందికి తెలుసు? అంతేకాదు ఆ ‘సున్నాను’ కనుగొన్నది మన భారతీయుడు అని ఎంతమందికి తెలుసు? పిన్న వయసులోనే ఎంతో ప్రజ్ఞా పాటవాలను కలిగి గణితశాస్త్రం లో ఒక ముఖ్యభాగమైన త్రికోణమితి యొక్క ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన అపర మేధావి మన భారతీయుడని ఎంతమందికి తెలుసు? భౌతిక శాస్త్రంలో, వృక్ష శాస్త్రంలో భారతీయ శాస్త్రవేత్తల మేధాసంపత్తి అనిర్వచనీయమని మనలో ఎంతమందికి విదితం. అయితే ఈ మధ్య కాలంలో అంతర్జాల పరిజ్ఞాన సహాయంతో మనందరం గర్వపడే రీతిలో ఎన్నెన్నో స్ఫూర్తిని రగిలించే విషయాలు తెలుస్తున్నాయి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

అక్టోబర్ 2017- డా. అనసూయ కులకర్ణి

మానవ జన్మ ఎంతో మహత్తరమైనది. కనుకనే మన జీవితానికి ఒక సార్థకత చేకూరేలా మన జీవన ప్రయాణం సాగాలి. ప్రతి మలుపులో ఎన్నో మధురస్మృతులతో, సంకల్ప సిద్ధిని సాధించి, మనలోని మంచిని పదిమందికి ఉపయోగపడే ఉత్ప్రేరకంగా తయారుచేయాలి. అందుకు ఎంతో కృషి, పట్టుదల, సాధనా పటిమ అవసరం. ఆ సామర్థ్యం మనలో అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అటువంటి వారిని మనం కారణజన్ములు అని కూడా అంటాం. అటువంటి కారణజన్మురాలై, సర్వ రోగాలను సరిసమాప్తం చేసే సత్తా ఉన్న సంగీత విద్యను అభ్యసించి, అదే తన సంకల్ప సాధనగా చేసుకొని, తన సంగీత ప్రావిణ్యాన్ని ఎంతో మంది విద్యార్థులకు బోధించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న శ్రీమతి అనసూయ కులకర్ణి గారి గురించిన విశేషాలే నేటి మన ఆదర్శమూర్తులు శీర్షిక.

పూర్తిగా ఇక్కడ చదవండి »

నవంబర్ 2017- శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి

కత్తి కంటే కలం గొప్పది. కలం నుండి జాలువారే మాటల తూటాలు నేరుగా మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి.  పిమ్మట, మనిషి ఆలోచనలలో మార్పులు జరగడం సంభవిస్తుంది. కనుకనే రవి గాంచని చోటును కూడా కవి కాంచగలడు. రచయితలు తమ అమూల్యమైన రచనలద్వారా మనిషిని ఉత్తేజపరిచి, నూతన తలంపులను రేకెత్తించి తద్వారా జనస్రవంతిలో ఎన్నో వినూత్న మార్పులను, సమాజంలో మంచికి మరో మార్గాన్ని రూపకల్పన చేసే అవకాశం కలుగుతుంది. అందులో మాధ్యమాల పాత్ర కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా చలనచిత్ర రంగం. సాధారణంగా ఒక చిత్రం అధిక ప్రజాదరణ పొందిందంటే అందుకు కారణం అయిన రెండు అంశాలు, కథ మరియు సంగీత ప్రధానమై అందరికీ దగ్గరైన పాటలు.  మరి అటువంటి రంగంలో ఉండి ఎన్నో అపూర్వమైన జనపదాలతో తన పాటల అక్షరమాలను తడిపి ఆ పాటలన్నీ తమని ఉద్దేశించే వ్రాశారని సామాన్య జనాలు అనుకునే భావన కలిగించిన అభినవ సాంఘీక పాటల రచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

డిసెంబర్ 2017- సర్ శ్రీ చంద్రశేఖర వెంకటరామన్

సర్వసాధారణంగా మేధావుల పేర్లు ప్రపంచానికి తెలిసిన తరువాత వారు సాధించిన అంశాలు, సమాజం మీద వాటి ప్రభావం తదితర విషయాలు తెలుస్తాయి. కానీ, కొంతమంది, అతిముఖ్యంగా శాస్త్రవేత్తలు, తమ మేధస్సుతో సాధించిన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానానికి తమ పేర్లను జోడించి తద్వారా సమాజానికి తమను పరిచయం చేసుకుంటారు. అటువంటి కోవకే చెంది, విజ్ఞాన రంగంలో నోబెల్ పురస్కారాన్ని గ్రహించిన మొట్టమొదటి భారతీయుడు సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్,  మన సిరిమల్లె డిసెంబర్ సంచిక ఆదర్శమూర్తి.

ప్రపంచవ్యాప్తంగా రామన్ ఎఫెక్ట్ అంటే తెలియని విజ్ఞాన శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్ర విద్యార్థులు ఉండరు. అయితే సి వి రామన్ అని అంటే ఆయన ఎవరు అని అంటారు. కానీ ఆయన కనుగొన్న కాంతి యొక్క ప్రత్యేక ధర్మాన్ని రామన్ ఎఫెక్టు లేక రామన్ ప్రభావం అని యావత్ ప్రపంచానికి తెలుసు. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం ద్వారా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా తేజోవికిరణత చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుంది. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా వెలుతురును వెదజల్లుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జనవరి 2018 - స్వామి వివేకానంద

“ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని భగవానుడు చెప్పినట్లు, సనాతన ధర్మాలను పరిరక్షించుటకు ఆయన అంశం ఏ రూపంలోనైనా అవతరించవచ్చు. సర్వమానవాళికి బోధనల ద్వారా అర్థమయ్యే విధంగా ఆ ధర్మాలను నేర్పించేందుకు జన్మతః పరిపూర్ణ విజ్ఞానంతో కొంతమంది మహాపురుషులు జన్మిస్తుంటారు. తమ ప్రసంగాలు, నిబద్ధతతో కూడిన జీవనవిధానంతో, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, ప్రపంచశాంతిని నెలకొల్పి ఉత్కృష్టమైన మానవ జన్మ యొక్క సార్థకతను అందరికీ తెలియజెప్పడమే వీరి ప్రధాన బాధ్యత. అటువంటి మహత్తర కార్యంతో, మనిషిలోని అంతర్గత ఆత్మ వికాసం కొఱకు, సర్వమత సామరస్య ప్రధాన సూత్రంతో, అతి ప్రాచీనమైన మన వేదాలలోని ధర్మ సూత్రాలను ప్రపంచం అంతటా విదేశీయులకు వారి భాషలోనే విడమరిచి వివరించిన మహాపురుషుడు, మన భారతీయుడు,  స్వామి వివేకానంద నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

ఫిబ్రవరి 2018 - కల్పనా చావ్లా

మనిషి జన్మకు ఒక సార్థకత అనేది ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవనాన్ని సాగించాము అనేది ముఖ్యం కాదు. మన జీవన ప్రయాణంలో ఏవైనా స్ఫూర్తినందించే కార్యక్రమాలు చేపట్టి అందులో సఫలీకృతులు అవడమనేది ఉండాలి. అయితే అది అందరికీ సాధ్యంకాదు. పట్టుదల, బలమైన సంకల్పం, సామాజిక పరిస్థితులను అనుసరించి అవసరమైతే ఎదురొడ్డి నిలిచే ధైర్యం కూడా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అందుకే అటువంటి వారు మిగిలిన వారికి ఆదర్శమౌతారు.

సంకల్ప బలం, కృషి పట్టుదల ఉంటే కన్న కలలను సాకారం చేసుకోవడానికి లింగ బేధం లేదని, మనిషైతే చాలని నిరూపించిన ఆధునిక వ్యోమగామి, ధీరోదాత్త మహిళ, మన భారతీయురాలు డా. కల్పనా చావ్లా, ఈ సంచిక ఆదర్శమూర్తి. సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక జీవనశైలిలో కూడా ఇమిడిపోయి ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందంజ వేసిన ఈ శాస్త్రవేత్త ఎంతో మంది భావితరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

పూర్తిగా ఇక్కడ చదవండి »

మార్చి 2018 - బ్రహ్మర్షి రఘపతి వెంకట రత్నం నాయుడు

సకల జీవరాశిలో మానవ జన్మ అత్యుత్తమమైనది. అందుకు కారణం మన మేధోసంపత్తి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఈ మేథోపరిజ్ఞానం వివిధ రకాలుగా నిక్షిప్తం అయివుంటుంది. ఆ జ్ఞానాన్ని, ఆ ఆలోచనలకు వాస్తవరూపం కల్పించాలంటే అందుకు అక్షరజ్ఞానం ఎంతో అవసరం. కానీ, వంద సంవత్సరాల క్రితం వఱకు ఆ అక్షరాస్యత అనేది కేవలం కొద్దిమంది మాత్రమే పొందగలిగారు. అందుకు కారణాలు అనేకం. 19వ శతాబ్ద చివరలో ఎంతో మంది విద్యావేత్తలు, అందరిలోనూ అక్ష్యరాస్యత కలిగిచాలని, ముఖ్యంగా బడుగు వర్గాలలో విద్య యెక్క విలువలను, చదువు వలన కలిగే లాభాలను, తద్వారా జీవితంలో పొందే అభ్యున్నతిని వివరించి వారిలో నిరక్షరాస్యతను రూపుమాపాలని కృషి చేశారు. వారిలో ప్రధముడుగా నిలిచిన పరమ భాగవత్ శిఖామణి, గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త శ్రీ రఘుపతి వెంకట రత్నం నాయుడు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

ఏప్రిల్ 2018 - డా. ఎల్లాప్రగడ సుబ్బారావు

మనిషి మేధస్సు యొక్క గొప్పతనం, అందులో ఉద్భవించే ఆవిష్కరణ వెల్లువలకు అలుపు అనేది లేదు. ఎంతోమంది మేధావులు తమ మస్తిష్కంలో జనిస్తున్న ఆలోచనలకు సరైన రూపకల్పన చేసి ఎన్నో అనూహ్యమైన విజ్ఞాన మార్పులకు, సిద్ధాంతాలకు కారణభూతులైనారు. ఆ విషయంలో నాటి నుండి నేటి వరకు మన భారతీయుల బుద్ధి బలము, పాశ్చాత్యులతో పోల్చిన కొంచెం ఎక్కువనే చెప్పాలి. కాకుంటే మన వారికి తగిన ప్రోత్సాహము, ఆసరా లభించుటలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే మన మేధోసంపత్తి, విదేశీయులకు ఒక కల్పతరువైనది.

ఐదవ శతాబ్దంలోనే ‘సున్న’ ను కనిపెట్టిన ఆర్యభట్ట మొదలు, ఒక రామానుజన్, ఒక రామన్, ఒక చంద్రశేఖరన్, ఒక కలాం, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు... ఇలా చెప్పుకుంటూ వెళితే మన భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బుద్ధికుశలత గలగిన ఎంతోమంది మహానుభావులు మనకు తారసపడతారు. ఆ జాతి ముత్యమే, ప్రపంచానికి టెట్రాసైక్లిన్ అనే సూక్ష్మజీవనాశక  ఔషధాన్ని కనుగొని ఎన్నో మహామారి వ్యాధుల నియంత్రణకు పాటుపడిన జీవ రసాయన శాస్త్రవేత్త, మన తెలుగువాడు డా.ఎల్లాప్రగడ సుబ్బారావు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

మే 2018 - ఆంగ్ సాన్ సూకీ

ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ధీరోదాత్త మహిళలు తమ సంకల్ప బలంతో, అకుంఠిత సేవా భావంతో, తమ జీవితానుభవాలను, సామాజిక స్పృహను ఆయుధాలుగా వాడి ఎన్నో ఉద్యమాలను నడిపి, రాచరికపు ఆనవాళ్ళతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే స్వార్థపూరిత ప్రభుత్వాల నుండి సామాన్య ప్రజలను కాపాడి వారు సుఖమయ జీవితాన్ని గడిపేందుకు ఎంతో కృషి సల్పారు. పాలకుల నిరంకుశ పాలనను ప్రశ్నించినందులకు రాజకీయ ఖైదీగా శిక్షను అనుభవించారు. అయినను తమ ఆశయాల కొఱకు శ్రమించి సాధించారు. అటువంటి గొప్ప మహిళల పట్టికలో మొదటి పది అంకెలలోపే ఉండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందిన నాటి బర్మా, నేటి మయన్మార్ దేశ ప్రముఖ రాజకీయ వేత్త, ప్రజా ప్రతినిధి శ్రీమతి ఆంగ్ సాన్ సూకీ, నేటి మన సిరిమల్లె ఆదర్శమహిళ.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జూన్ 2018 - శ్రీ ఎస్.వి.రంగారావు

మన తెలుగు చలనచిత్ర రంగం ప్రారంభంలో కథకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండి, అందులోని నాయక, నాయకి, ప్రతినాయక పాత్రలు సందర్భోచితంగా వచ్చి వెళుతూ ఎంతో సందేశాత్మకంగా ఉండేవి. అందుకే నేటికీ మన పాత సినిమాలు మనకు ప్రీతిపాత్రమైయ్యాయి. అంతేకాదు, పాత సినిమాలలో నటించిన నటీనటులందరూ కూడా ఆయా పాత్రలకు జీవం పోశారు. ప్రతిఒక్కరూ వారికంటూ ఒక అభినయాన్ని సొంతం చేసుకొన్నారు. అది వృత్తి పట్ల వారికున్న త్రికరణశుద్ధికి నిదర్శనము.

రాముడు, కృష్ణుడు ఎట్లుంటారో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల ద్వారా మనకు రాముడైనా, కృష్ణుడైనా మన నటరత్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే. అలాగే ప్రతినాయక పాత్రలో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ‘సాహసం సేయారా డింభకా, రాజకుమారి సిద్ధించును’ అన్న నేపాలి మాంత్రికుడు అంటే మనకు గుర్తుకువచ్చేది ఒకే ఒక ఆజానుబాహుడు, తెలుగు, తమిళ భాషలలో అనర్గళంగా డైలాగులను చెప్పగలిగి, నాయకులతో సరితూగే ప్రతినాయకుని పాత్రలో మరియు మంచి నైతిక విలువలు ప్రధాన అంశాలుగా వచ్చిన ఎన్నో కుటుంబకథా చిత్రాలలో అత్యత్భుతంగా నటించి, తన నటనా చాతుర్యంతో మనలను మెప్పించిన మహానుభావుడు, మనందరికీ ఎస్.వి.రంగారావు గా సుపరిచితమైన శ్రీ సామర్ల వెంకట రంగారావు గారు, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి »

జూలై 2018 - పాలం కల్యాణసుందరం

“మానవ సేవే మాధవ సేవ” అని మనందరం పదే పదే అనుకుంటూవుంటాం. కానీ ఆచరణలోకి వచ్చే సరికి మనలోని స్వార్థచింతన, స్వలాభం కోసం శ్రమించే విధంగా మన ఆలోచనల ధోరణిని మారుస్తుంది. అందుకే మనం “ముందు ఇంట గెలిచి తరువాత రచ్చ గెలువు” అని సర్దుకొని చెప్పుకుంటాం. మన కుటుంబ సౌఖ్యం ప్రధమ కర్తవ్యంగా భావించి, మన జీవన విధానాలు మెరుగయ్యేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. ఒక ప్రమాణం లేక, అంతం లేని కోరికల అలలతో కలిసి కొట్టుకుపోతూ, ఎంతో మానసిక, శారీరక అలసటలతో సతమతమవుతుంటాం. అంతేకాని మన గురించి కాకుండా ప్రక్కవారి గురించి, కనీస జీవన వసతులు లేక అలమటించే అభాగ్యుల గురించి ఆలోచించే విశాల హృదయం, సమయం మనకు ఉండదు. అదేమంటే తనకు మాలిన ధర్మం...అని ఇంకేదో అనుకొంటాం.

పూర్తిగా ఇక్కడ చదవండి »

 

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. – స్వామి వివేకానంద