అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

పశ్చిమ సముద్రంలోనే కాదు, నెమ్మదిగా బంగాళాఖాతంలో కూడా మొదలయ్యింది మరపడవల తగులాటమ్. చట్టసమ్మతం కానీ, కాకపోనీ – ఏది ఏమైనా కానీ, ఇట్టే వచ్చి అట్టే, భారతీయ తీరజలాల్లో ఆధునికమైన పద్ధతులలో వేట సాగించి, దేశీయమత్యకారుల కూట్లో దుమ్ముకొట్టి, మన సముద్రాల్లోని మత్స్య సంపదను దోచుకుపోడం మొదలుపెట్టారు విదేశీ మరపడవలవాళ్ళు. క్రమంగా బిలబిల లాడే చేపల గుంపులు కనిపించడం మానేశాయి. తూరుపు తీరంలో కూడా నాటుపడవలలో సముద్రం మీదికి వెళ్ళి వేటచేసుకుని పొట్టగడుపుకునే వాళ్ళకి గడ్డురోజులు వచ్చాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించడం మానేసింది. ఎంతో కష్టం మీద బ్రతుకులు వెళ్ళమార్చవలసిన దుర్దశ పట్టింది వాళ్ళకి. అది చాలక ధనమదంతో స్టీమ్ బోట్ల వాళ్ళు, తాము ఇదివరకు చేసుకున్న ఒప్పందాన్ని పాటించడం మానేసి, తీరానికి ముఫ్ఫై మైళ్ళలోపులోనే వేట చేస్తూ కనిపించసాగారు. అంతేకాదు, రాత్రుల్లో దీపాలు ఎరగాపెట్టి, పాటలు పెట్టి వేట సాగించడం మొదలుపెట్టారు. దీపం పురుగుల్లాగే చాలా రకాల చేపలు ఆ దీపాల వెలుగుకు ఆకర్షించబడి గుంపులు గుంపులుగా ట్రాలర్లచుట్టూ చేరగానే వాటిని యంత్రాల సాయంతో వేగంగా తోడిపోసుకుని ఫేక్టరీలకు పట్టుకుపోతున్నారు. చూస్తూoడగా సముద్ర తీరజలాల్లోని మత్యసంపద తరిగిపోతోoది.

చేపల ఫేక్టరీలలో చేపలను శుభ్రం చేసి, వాటిని చెడిపోనీకుండా డబ్బాల్లో నిలవచేసి, దూరపు ఊళ్ళకు రవాణా చేసే రకరకాల పరికరాలు ఉంటాయి. చేపల పరిశ్రమ ఈ యంత్రాల వల్ల మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కానీ వీటివల్ల నాటుపడవలపై వెళ్ళి చేసే చేపలవేట కుంటుపడింది. తీరప్రాంతంలో చేపలగుంపులు అంతగా కనిపించడం మానేశాయి. నానాటికీ రాబడి తగ్గిపోవడంతో బెస్తవాడికి బ్రతుకు భారమయ్యింది.

మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్నట్లు, జనం మధ్య వినిపిస్తున్న వదంతి మత్యకారుల మనోవేదనను మరింతగా పెంచింది. ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్న పరిశ్రమల్లో వచ్చిన వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి వదిలిపెడుతున్నారనీ, వాటిలోని రసాయనిక పదార్ధాలవల్ల సముద్రజీవుల్లో వాసి, రాశి కూడా తగ్గిపోయిందనీ జనం అనుకోడం మొదలుపెట్టారు. అంతేకాదు, రేడియోధార్మిక కేంద్రాలలో విడుదలైన వ్యర్ధపదార్ధాలను సీసపు డ్రమ్ములలో ఉంచి సీలుచేసి, వాటిని సముద్రాల్లో పడవేస్తున్నారనీ, కాలక్రమంలో ఉప్పునీటివల్ల ఆ పీపాలు శిధిలమై, వాటిలో ఉన్న విషతుల్యమైన పదార్ధాలు సముద్రజలాల్లో కలవడం వల్ల చాలా రకాల చేపజాతులు పూర్తిగా నశించిపోయాయనీ కూడా వదంతులు వినిపించసాగాయి. మొత్తంగా చెప్పాలంటే సముద్రసంపద ఇదివరకటి కంటే చాలా తగ్గిపోయింది. బెస్తవాడలు దరిద్రదేవతకు ఆవాసాలయ్యాయి.

స్వంత పడవల యజమానులు చేపల దిగుబడి తగ్గడంతో పడవలమీద పనిచేసేవాళ్ళను తగ్గించేసి, మరింత శ్రమపడి, తామే ఆ పనులన్నీ చేసుకోసాగారు. వేటపడవలమీద కూలికి పనిచేసేవాళ్ళకు పనులు పోవడంతో గతిమాలి, చాలామంది చెయ్యతిరిగిన జాలర్లు కూడా కులవృత్తిని విడిచిపెట్టి, వేరే పనులు వెతుక్కుంటూ పొరుగూళ్ళకు వలసపోవడం మొదలుపెట్టారు. బెస్తవాడలో క్షామం ప్రబలింది. పెద్దపడవ కామందులే ఇల్లు గడపలేక గడగడలాడుతూంటే ఇంక సామాన్య జాలర్ల విషయం చెప్పాలా! వలసపోయే వాళ్ళసంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. స్వంతపడవలున్నవాళ్ళు మాత్రం వేటకు వెడుతూ, దొరికినమట్టుకు తెచ్చుకుని తింటున్నారు.

వేటపడవలకి వెలియైన కన్నయ్య ప్రతిరోజూ రెండుపూటలా తన దోనె మీద సముద్రం మీదికి వెళ్ళి, గాలాలువేసీ, డోకి వలతో దేవీ - చేపలు పట్టి ఎంతోకొంత సముద్రపు సంపదను ఇంటికి తెస్తున్నాడు. ఏరోజునా ఎంతోకొంత ఆదాయం తెచ్చి చూపిస్తున్నా, ఆ డబ్బు అవసరాలకు సరిపడా ఉండడం లేదు. రాధమ్మ ఎంత పొదుపుగా వాడినా, పడవకొనడం కోసం కూడబెట్టిన దానిలోనుండి కొద్దికొద్దిగా డబ్బు తీసి వాడక తప్పడంలేదు. అదికూడా ఐపోవచ్చింది.

చీమలు తింటే చాలు, కొండలు తరుగుతాయంటారు. అలాగే నెమ్మదిగా ఆ డబ్బు ఖర్చై పోయింది. ఆ తరవాత వాళ్ళ బ్రతుకు మరీ దుర్భరమైపోయింది. ఇంట్లో నలుగురి కడుపులూ నిండడమన్నది కష్టమైపోయింది. నోరెరగని పసివాళ్ళను, కాటికి కాళ్ళుచాచుకు కూర్చున్న ముసలమ్మకి వండినదేదో ముందుగా వడ్డించి, ఆ తరవాత కన్నయ్యకు పెట్టి ఆపై మిగిలినది తనుతిని, రామాలయంలోని నూతి నుండి తెచ్చుకున్న నీళ్ళు కడుపునిండా తాగి గుట్టుగా కాలంగడుపుతోంది రాధమ్మ.

కన్నయ్యకు నాణ్యమైన చేపదొరికి నాల్గురోజులు దాటింది. రోజూ ఆశగా సముద్రం మీదికి వెళ్ళి, దొరికిన కాస్తా తీసుకుని నిరాశతో ఇంటికి తిరిగిరావలసి వస్తోంది.

ఎప్పుడూ సందడిగా ఉండే బెస్తవాడలో ఇప్పుడు మౌనం రాజ్యమేలుతోంది. ఒకరినొకరు పలకరించుకొని కబుర్లు చెప్పుకోడానికి ఇప్పుడెవరికీ మనసు రావడంలేదు. పలకరింపులు, పరాచికాలూ కరువయ్యాయి. ఎవరిమట్టుకు వాళ్ళు మాడుమోహాలతో తిరుగుతున్నారు. ఈ పరిస్థితి తప్పాలంటే ఏమి చెయ్యాలో ఎవరికీ తోచడం లేదు. వెళ్ళదలచినవాళ్ళు రేవుకు వెడుతున్నారు, లేనివాళ్ళు లేదు. శ్రమకు తగిన లబ్ధి లేకపోడంతో వాళ్లకి కులవృత్తిమీద ఆసక్తి తగ్గిపోయింది. ఎవరో కొంతమంది మాత్రం, ఆసక్తి చచ్చిపోయినా అలవాటు ముందుకి నడిపించడంతో వెళ్లి వేటచేసి వస్తున్నారు. మందిలో వలస ధ్యాస ఎక్కువయ్యింది. తల్లిగడ్డని, కులవృత్తిని విడిచి దూరంగాపోతే  ఏదో ఒక పని చేసుకుని బ్రతకవచ్చునన్న ఆలోచన ఉంది చాలామంది జాలర్లకి. రోజురోజుకీ బెస్తవాడల జనాభా తగ్గిపోతోంది.

ఈ బెస్తవాడలో కూడా క్షామదేవత ప్రవేశించింది. రోజురోజుకూ వలసపోయీవాళ్ళ సoఖ్య పెరుగుతోంది. వాళ్ళను చూస్తూoటే రాధమ్మకు అదే తమకూ మంచిదేమో అనిపించడంతో భర్తతో సంప్రదించింది. ఆమె ఎంత జాగ్రత్తగా ఇల్లు గడిపినా దాచుకున్న కొంచెం డబ్బూ ఐపోవచ్చింది. ఆ కాస్తా కూడా త్వరలోనే అయిపోవచ్చు. ఆ దన్ను కూడా లేకుండాపోతే ఇల్లుగడవడమే కష్టం కావచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి - అంటారు. ఇప్పుడే మరోదారి వెతుక్కోడం మంచిది - అనుకున్న రాధమ్మ

ఆ రాత్రి కబుర్ల మధ్య నెమ్మదిగా భర్త దగ్గర ఆ ప్రసక్తి తీసుకువచ్చింది ఆమె ...

"కన్నయ్యా! ఇక్కడనుండి చాలామంది రోజు గడవక వేరే చోట పని వెతుక్కోడానికి వెళ్ళిపోయారు. త్వరలోనే మనకూ ఆ దశ రాబోతోoది. దాచుకున్న డబ్బు చివరకు వచ్చేసింది. ఇప్పుడే మనం కూడా మేలుకోడం బాగుంటుంది. ఈ వెలి గిలీ లేని చోటికి మనం కూడా వెళ్ళిపోయి ఏదైనా పని వెతుక్కుందాము" అంది గారాలుపోతూ.

"నాకూ వచ్చింది రాదమ్మా, ఈ ఆలోశన. కాని, నేను పుట్టింది ఈడనే, పెరిగిందీ ఈ సముద్దరం ఒడ్డునే! అలలే నాకు అమ్మ ఒడిగా, సముద్రపు హోరే సంగీతంగా నా సిన్నతనం గడిసిపోయింది. ఆడినా, పాడినా, ఉయ్యాలలూగినా సముద్దరమే నా సైదోడు! నేను నా కులవుర్తినే నేర్సుకున్నా, పెద్దగా సదూకున్నోడినిగాను. సదవనూ రాయనూ తప్ప మరేమీ సేతకాదు. నాకు సేతనైనది నా కులవుర్తి  ఒక్కటే. మరో సోటికెడితే నేను ఒడ్డునబడ్డ సేపనౌతాను. మనబతుకు మర్రోoత ఈనమౌద్ది. రెంటికీ సెడిన రేవల్లమౌతాము. ముందు కాలు గట్టి నేలను ఆనాకగాని ఎనక్కాలు ఎత్తేయ్యకూడదు." అంటూ భార్యకు హితబోధ చేశాడు కన్నయ్య.

రాధమ్మ అవాక్కయ్యింది. ఇంకేమీ మాటాడలేక "సర్లే! నారోసిన ఆ భగవంతుడు నీరొయ్యక మానడులే" అని భగవంతునిమీద భారం వేసి ఊరుకుంది.

కన్నయ్యకు పది రోజులనుండి నాణ్యమైన చేప ఒక్కటీ దొరకలేదు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలవల్ల తిండికే కటకటగా ఉండడంతో ముసలమ్మకు మందులూ, పిల్లలకు చిరుతిళ్ళూ కొనడం కష్టమౌతోంది. నల్లమందుకు బదులుగా ఎల్లమ్మ తాగుతున్న గసగసాలపొట్టు కషాయం తగినంతగా పట్టివ్వకపోడంతో ఆమె గిజాటు పడుతోంది. రెండు రోజులనుండి ఎల్లమ్మకు నలతగా ఉంది. ఆమెకు నల్లమందు కొనాలన్నా, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి వైద్యం చేయించాలన్నా చాలినంత డబ్బు సిద్ధంగాలేదు. రాధమ్మ చేసే చిట్కా వైద్యాలవల్ల పెద్దగా ప్రయోజనo కూడా మేమీ ఉండటం లేదు.

రాధమ్మ తనకు తెలిసినంతవరకు గచ్చాకు, పుచ్చాకు వైద్యాలతో అత్తగారికి రవంత ఉపశమనం కలిగేలా చేస్తోంది. చిరుతిళ్ళకోసం ఏడ్చే పిల్లల్ని, చవగ్గా దొరికే గుప్పెడు అటుకులు, రవంత బెల్లం ముక్క ఇచ్చి ఊరుకోబెడుతోంది. ఈ వేళ పరిస్థితి మరీ నిప్పచ్చరంగా ఉంది. కన్నయ్య వేటచేసి ఏమైనా పట్టుకొస్తేగాని, రేపటి రోజున పొయ్యిలోని పిల్లిని తోలాల్సిన పనిలేదు, పొయ్యి ముట్టించాల్సిన అగత్యమూ లేదు.

పరిస్థితులు సింహావలోకనం చేసుకుంటూ దంపతులిద్దరూ రాత్రి చాలాసేపటివరకూ నిద్రపోలేకపోయారు. ఎంతో రాత్రి గడిచిపోయాక ఎప్పటికో వాళ్లకు కునుకుపట్టింది.

కాని, బాధ్యతలు తట్టి లేపడంతో రాధమ్మ శల్యూష (శల్య+ ఉష = false dawn) సమయం కాగానే రాధమ్మ లేచి కూర్చుంది. తనపక్కనే ఆదమరచి నిద్రపోతున్న కన్నయ్యని చూసింది. జాలిగా అనిపించి లేపడానికి ఇబ్బందిపడింది. ఒక్క క్షణం తటపటాయించింది. కాని, కర్తవ్యమ్ హెచ్చరించడంతో లేపకతప్పలేదు. రాధమ్మ కన్నయ్యను మృదువుగా తట్టింది.

ఉలికిపడి, గభాలున లేచికూర్చున్నాడు కన్నయ్య. "ఏందిది రాదమ్మా! బెగే లెగ్గోట్టమన్నా గందా" అన్నాడు కన్నయ్య మూతలుపడుతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ. ఇంకా నిద్రమత్తు వదలకపోడంతో, లేచి నిలబడి ఆవులించి ఒళ్ళువిరుచుకున్నాడు కన్నయ్య.

కన్నయ్య కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి వేటకు కావలసిన సామానంతా ఒకచోట చేర్చి, మధ్యలో తినడానికి చద్దిముంత, ఇంకా కావలసినవన్నీ సద్ది ఉంచింది రాధమ్మ. అతడు తయారై రాగానే రాధమ్మ అతని దగ్గరగా చేరి మెడచుట్టూ చేతులువేసి, “ఈ రోజు సుదినం కావాలి! వేట బాగా సాగాలి. క్షేమంగా వెళ్ళి, లాభంగా రా” అంటూ ప్రియమార వీడ్కోలు చెప్పింది.

రాధమ్మ కులుకులు కన్నయ్యకు పెద్దగా సంతోషాన్నివ్వలేదు. అతని మనసంతా గుబులుగా ఉంది. “ఊరంతా ఏకమై మనమీన అన్నేయంగా కులతప్పేశారు. సివరాకరికి ఆ బగమంతునికి కూడా మనపై కనికరం లేదనిపిస్తా ఉంది. ఇలా ఎన్నాల్లెల్లాల! నేనో నిరనయానికొచ్చేశా, మంచి ఏట సిక్కాకగానీ ఇంటికి తిరిగి రాను, ఎంతాలీశమైనా సరే! గురుతెట్టుకో రాదమ్మా! నా ప్రేనాలు ఇయిగో, నీ సేతుల్లో ఎట్టి వెడుతున్నా, బద్రంగా సూసుకో! నువ్వు నా రాదమ్మవే ఐతే నాకు ఏ ఆపదా రాదు” అన్నాడు.

తెల్లబోయింది రాధమ్మ. కానీ అంతలోనే సద్దుకుంది. “నీ నోట కానిమాట రాకూడదు కన్నయ్యా! ఈ రాధమ్మకి నీతి ఉంది. కడలమ్మ “కట్ట” దాటుతుందేమోగాని, ఈ రాధమ్మ “కట్టుబాటు” తప్పదు. బాగా గుర్తెట్టుకో! మనకీ తిప్పలు కలిగేలా చేసిన వాళ్ళకి తగిన శాస్తి జరిగితీరుతుంది, ఇది నా శాపం" అంది. రాధమ్మ కళ్ళు బుడ్డిదీపపు చిరువెలుగులో చిరుతపులి కళ్ళలా మెరిశాయి.

ఆ ఉగ్రం చూసి జడుసుకున్నాడు కన్నయ్య. వెంటనే చెంపలపై కొట్టుకుని, “ఒద్దు రాదమ్మా, వద్దు. అంతలేసి శాపాలు ఎట్టమోకు. పతివ్రత శపిస్తే తప్పకుండా జరుగుద్ది, ఊకో రాదమ్మా! ఊకో” అంటూ రాధమ్మను దగ్గరగా తీసుకుని  ఒంగి రాధమ్మ పెదవులపై ముద్దుపెట్టుకున్నాడు కన్నయ్య. సమస్తమైన ఇబ్బందుల్నీ మర్చిపోయి, కొంతసేపు తమదైన స్వర్గంలో విహరించారు ఆ యువజంట.

రాధమ్మే తన్మయత్వం నుండి ముందుగా తెప్పరిల్లింది. భర్త బుజంపై చెయ్యివేసి, “వేళ మించిపోతోంది, ఇక వెడదామా” అని అడిగింది.

తెరచాప, నావలో వేసే వెదుళ్ళ చాప, తెడ్డు, రాటం లాంటి బరువుసామాను కన్నయ్య తీసుకున్నాడు. ఎరలబుట్ట, గాలాలున్న సంచీ, చద్దిముంత, మంచినీళ్ళ సీసా లాంటి బరువుతక్కువ సామాను రాధమ్మ అందుకుంది. ఇద్దరూ కలిసి గడపదాటారు. మళ్ళీ అంతలో రాధమ్మకి ఏం గుర్తుకి వచ్చిందో ఏమో, కన్నయ్యను ఆగమని ఇంట్లోకి పరుగెట్టింది. ఆమె ఇంట్లోకెళ్ళి కొద్దిగా అటుకులు, బెల్లంముక్క కాగిరంలో పొట్లం కట్టి తెచ్చి ఎరలున్న బుట్టలో ఒక వారగా ఉంచి చెప్పింది, “అటుకులు, మధ్యాహ్నం రావడం ఆలస్యమైతే కొంచెం తింటావని ...”

వెంటనే అడిగాడు కన్నయ్య, “పిల్లలకున్నాయా?”

“ఆ” భర్తమొహంలోకి చూడకుండా వేరేవైపుచూస్తూ చిన్న అబద్దం చెప్పింది రాధమ్మ.

ఆలస్యమంటే ఎంతాలస్యమో ఏమో! మధ్యాహ్నం భోజనానికి వస్తాడో- రాలేకపోతాడో... ఎందుకైనా మంచిది. ఆకలేస్తే కొంచెం అటుకులు తిని, నీళ్ళుతాగితే బాగుంటుంది - అని అటుకులకోసం వెళ్ళింది రాధమ్మ. కానీ అటుకుల డబ్బాలో అడుగున కాసిని అటుకులే ఉన్నాయి. పిల్లల్ని, బెల్లంముక్క ఒక్కటీ చేతిలోపెట్టి  ఎలాగో సముడాయించుకోవచ్చునని, ఉన్న కొంచెం అటుకులు కన్నయ్యకోసం తెచ్చేసింది రాధమ్మ.

"అయి పిల్లలకి ఉండనీకూడదా ... అటుకులు తింటే దావతౌద్ది. మంచినీల్లే కూన్ని ఎక్కువుంటే శాను. ఈ యేల ఎంత దూరమైనా ఎడతా. మంచి ఏట తగిలితేగాని తిరుగుదారి పట్టను. నేను రావడం ఆలీశమైనా బయపడకు. మాయమ్మా, పిల్లలూ బద్రం. ఎల్లిరానా మరి"అంటూ తల్లిని, ఆమె పక్కనే పడుకుని ఉన్న పిల్లల్నీ కన్నార్పకుండా ఒకింతసేపు ప్రేమగా చూసి గడప దాటేడు కన్నయ్య. తలుపు మూసి అతని వెంట నడిచింది రాధమ్మ, అతని సహధర్మచారిణి!

సామాను మోసుకుంటూ తనవెంట వస్తున్న భార్యను చూస్తూంటే కన్నయ్య మనసు వికలమయ్యింది. గొప్పింట పుట్టినా, భేషజమన్నదిలేకుండా తమలో ఒకతెగా కలిసిపోయింది రాధమ్మ. అంతేకాదు, తన తల్లినీ, తననూ అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తూ ఎంతో ప్రేమగా సాకుతోంది. రాధమ్మ లేని తన జీవితం- ఊహకందని విషయం! రాధమ్మే కనక లేకపోతే కన్నయ్య ఏమైపోయేవాడో ...

ఆ ఆలోచన రాగానే కన్నయ్య వెనక్కి తిరిగి, "రాదమ్మా! నువ్వు నన్నింట బాగా, కంటికి రెప్పల్లా, చూసుకుంటూన్నావు, నీ ఋణం నేనెలా తీర్చుకోగలనో  తెలియడం లేదు" అన్నాడు ప్రేమగా ఆమెనే చూస్తూ.

రాధమ్మ చేతిలో సామాను కిందపడేసి, పక్కలట్టుకుని నిలబడి, హిస్టీరియా వచ్చినదానిలా పడీ పడీ నవ్వడం మొదలుపెట్టింది, "జాలరి కన్నయ్య బలే మాటకారి అయ్యాడే" అంటూ.

తనన్నదానిలో తప్పేమిటో కన్నయ్యకు తెలియలేదు. భర్తగా తన పెద్దరికం చూపించి, "సాల్లే, ఇక ఊరుకో! సిన్నపిల్లగాల్లు ఎవరైనా సూత్తే దడుసుకునీలా ఆ నవ్వేంటి" అన్నాడు.

"మరి నవ్వు తెప్పించే మాటలంటే నవ్వు రాదా! నీకూ నాకూ మధ్య ఋణమేమిటిట! ఉన్నదంతా ప్రేమే కదా" అంది గుడ్లురిమి చూసి కోపం నటిస్తూ. అంతలో అదాటుగా అతని మెడచుట్టూ చేతులువేసి, ముని వేళ్ళపై లేచి అతన్ని ముద్దుపెట్టుకుని, "ఇప్పుడు నీ కోపం పోయిందా" అని అడిగింది, కొంచెం దూరంలో నిలబడి తల వంచి అతనివైపు ఓరగా చూస్తూ.

రాధమ్మ అల్లరికి కన్నయ్యకు కూడా నవ్వొచ్చింది. "నువ్వు శానా గొప్ప శమత్కారివే రాదమ్మా" అంటూ తనూ నవ్వసాగాడు.

అలా నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ వాళ్ళు చిన్నరేవును చేరుకున్నారు. ఇంకా తెల్లవారకపోవడంతో అక్కడ జనసంచారం లేక వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేకపోయారు.

ఆ ప్రదేశంలో ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి ఉన్నతూరుపు సముద్రతీరంలో, బెస్తవాడకు దక్షిణపు దిక్కునున్న ఆఖరు ఇల్లు కన్నయ్యది. కన్నయ్య ఇంటి నుండి ఉత్తరంగా వెడితే పెద్దరేవు వస్తుంది. పెద్ద పెద్ద పడవలపై వేటకి వెళ్ళే వాళ్ళతో అటువైపు తెల్లవారకముందే సందడి మొదలౌతుంది. కాని వెలివెయ్యడం వల్ల కన్నయ్య అటు వెళ్ళడం మాని, దక్షిణపు దిక్కునున్న తుమ్మలబీడు పక్కనున్న చిన్నరేవుని తన అవసరాలకు వాడుకోసాగాడు. అక్కడ ఆ సమయంలో మానవ సంచారం ఉండదు. పెద్దపడవలకు చిన్నరేవు అనువైనది కాకపోవడమే దానికి కారణం.

తుమ్మలరేవులో, అలలకు అందకుండా అల్లంతదూరంలో బోర్లించి ఉంది కన్నయ్య నావ. దానిని తిరగదీసి, నీటిలోకి తోసి, విరిగిపడుతున్న కెరటాలను దాటించి దారిలోకి తెచ్చేటందుకు మరో చెయ్యి సాయం అవసరం. ఇదివరకు రోజుల్లో సాయమడిగితే దారినపోయే వారెవరో ఒకరు ఆసరా అయ్యేవారు. ఇప్పుడు కన్నయ్యకు వెలి ఉండడంతో పిలిస్తే పలికే వారెవరూ లేరు. రాధమ్మ చెయ్యాసరాతోనే ప్రతి రోజూ కన్నయ్య వేటకు వెళ్ళేవాడు. పని చిన్నదైనా, పెద్దదైనా కూడా తన శక్తియుక్తులన్నీ ధారపోసి అడుగడుగునా, ఒంటరియైన కన్నయ్యకు తాను చేదోడై రాధమ్మ, అతనికి తాను సహధర్మచారిణి అన్న మాటను సార్థకం చేసుకుంటోంది.

ఇప్పుడు కూడా రాధమ్మ సాయంతో కన్నయ్య దోనెను నీటిలోకి తొయ్యగలిగాడు. ఇద్దరూ కలిసి సామానంతా వేటి చోటుల్లో వాటిని దోనెలో ఉంచారు. కెరటాలను దాటించడంలోకూడా సాయం చేసింది రాధమ్మ. కెరటాలను దాటగానే ఎగిరి పడవెక్కి నిలబడి తెడ్డందుకున్నాడు కన్నయ్య. రాధమ్మ ఒడ్డును జేరి, వెనుదిరిగి భర్తనే చూస్తూ నిలబడింది, వీడ్కోలుగా చెయ్యూపుతూ.

ఆకాశంలో రెక్కలుచాపుకు గాలిలో దూసుకువెళ్ళే పక్షిలా, ఆ వినీల జలరాసిపైన తూరుపు వైపుగా శరవేగంతో సర్రున దూసుకు పోయింది ఆ చిన్నపడవ. దానిలో నిలబడి రాధమ్మని అనుకరిస్తూ తనూ చెయ్యూపుతూ ఆమెకు వీడ్కోలు చెప్పాడు కన్నయ్య. ఒడ్డుకు చేరువలో ఎడతెగకుండా విరిగిపడే తరగలు చిమ్ముతున్న నీటి తుంపుర్ల చాటునుండి కనిపిస్తున్న రాధమ్మ కన్నయ్య కళ్ళకు, తలనుండి జాలువారుతున్న తలంబ్రాల చాటునుండి వరుణ్ణి తొoగిచూసి ముసిముసి నవ్వులు నవ్వే కొత్త పెళ్ళికూతురులా కనిపించి, అతని మనసును గిలిగింతలు పెట్టింది. మనసంతా ఉల్లాసంతో నిండిపోగా, ఆ అగాధ జలరాసిలో అలవోకగా పడవని నడుపుకుంటూ ముందుకి సాగాడు కన్నయ్య.

వారి దాంపత్యం నిత్యనూతనం. ఇద్దరు బిడ్డల తల్లియైన రాధమ్మ అతనికి ప్రతి రోజూ నవ వధువులాగే కనిపిస్తుంది. రాధమ్మ నే తలుచుకుంటూ తెడ్డు మెడ్డి పడవను ముందుకి నడుపుతున్నాడు కన్నయ్య.

శల్యూష సమయం కావడంతో సముద్రమంతా ఒకవిధమైన కాంతితో నిండి ఉంది. ఆ కాంతిలో గుండె బలం, కండ బలం కలిగి ఉండి, మగసిరి ఉట్టిపడుతున్న కన్నయ్య సమున్నత రూపాన్నే కన్నార్పకుండా చూస్తూ, ఒడ్డుమీదికంతా తుళ్ళిపడే అలలు కాళ్ళక్రింద నున్న ఇసుకను కరిగించి గిలిగింతలు పెడుతున్నా పట్టించుకోకుండా, పడవ కనుచూపుమేర దాటి కనుమరుగైపోయే వరకూ కళ్లారా చూసి, ఆపైన ఇంటికి నడిచింది రాధమ్మ.

###############

అత్తగారికి భోజనం వడ్డించి ఇచ్చి, పిల్లలకు భోజనం తినిపిస్తున్న రాధమ్మ ఎవరో తనను పేరు పెట్టి పిలుస్తున్నట్లు అనిపించింది. అంతలో "రాదమ్మా! ఏం జేస్తున్నావు" అంటూ లోపలకు వచ్చింది రాగమ్మ.

రాగమ్మను చూసి తెల్లబోయింది రాధమ్మ. "వెలి భయం ఏమయ్యింది" అనుకుని ఆశ్చర్యబోయింది. లేచి నిలబడి ప్రేమగా ఆహ్వానించింది, "రా పిన్నీ!" అంటూ, "అంతా బావున్నారా? చాలా రోజులకు కనిపించావు!  ఈ వేళ గాలి ఇటు మల్లిందేమిటి" అని అడిగింది రాధమ్మ. అంతేకాదు, 'ఐతే, ఇన్నాళ్ళకి నీకీ కూతుర్ని చూడాలని మనసయ్యిందన్న మాట" అంటూ ఒక చిన్న నిష్టూరం కూడా వేసింది.

"అలా అనమోకు రాదమ్మా! నా కూతురు పేరు నీకు ఇచ్చినందుకు నువ్వు నా కూతురువే అనుకుంటున్నా. ఈ ఎలీ గిలీ అంటూ మనమద్దెన అడ్డుగోడలున్నాయి గందా! అయినా ఇన్నాళ్ళూ ఆటిని దాటడం ఎలాగా - అని ఆలోసిత్తానే ఉన్నా. ఇంక అయ్యేవీ అడ్డురావు మనకి. మేమీడనుండి ఎలిపోతన్నాము. అందుకే నిన్నోపాలి సూసి, ఊసులాడి, సెలవడిగి పోదారని ఒచ్చా.

గదిలో ఒకవారగా కూర్చుని అన్నం తింటున్న ఎల్లమ్మ రాగమ్మని గుర్తుపట్టింది. "ఎవరది, రాగమ్మేనా? రెండునాల్లనుండి నాకు ఒల్లుబాగోడంలేదు. బొత్తిగా ఊపిరాడనట్లు ఉంది. ఏంటో మరి!"

"ఏముంది ఇయ్యపురాలా! పెద్ద ఒయసుగందా, అలాగే ఉంటాది. ఓరోజు ఇందు, మరో రోజు మందు! మేమిక్కడ కాపురం ఎత్తికట్టేసి కొల్లేరు ఎలిపోతున్నాం. ఓపాలి సెప్పి, నిన్ను సెలవడిగి పోదారని ఇటచ్చినా."

"అలాగా ... సేమంగా ఎల్లి, లాబంగా రండి" అంది ఎల్లమ్మ

"పిన్నీ! అక్కడ చిన్నయ్యకు పనేదైనా దొరికిందా?" అడిగింది రాధమ్మ

"ఆ! దొరికింది. మా ఆడబిడ్డ పెనిమిటి కబురెట్టాడు, అక్కడ సెరువులు పెట్టి సేపల్ని, రొయ్యల్ని పండించి, ఆటితో యాపారం సేత్తున్నారంట కొందరు బూకామండులు. ఆటిని సూసుకునేందుకు ఒక మనిసి కావాలనీ, అక్కడకి వచ్చీ మాటైతే ఆ పని నీకిప్పిస్తాననీను. ఇక్కడ ఇల్లుగడవడమే కట్టంగా ఉంది గందా, అందుకే ఎలిపోదా మనుకున్నాము. తల్లి భూమి ఇడిసిపోవడం అంటే మనసుకు కట్టoగానే ఉoది, కాని బతకాలి గందా!

రాదమ్మా! అక్కడి కెల్లినాక పనేదైనా కాళీ ఉంటే మీకు కబురెడతాము. మీరుగూడా ఆడకు అచ్చేయ్యండి. ఈ ఎలిపీడ ఇరగడైపొద్ది. నెలకింతని జీతం డబ్బులు సేతికొస్తాయి. ఆయిగా బతకొచ్చు. ఈడ నున్న గాలి బతుక్కంటే ఏదైనా నయమే!"

"అలాగే పిన్నీ, నువ్వు చెప్పిన మాట కన్నయ్యకి చెపుతా. చేపల పెంపకం అంటే తప్పకుండా ఒప్పుకుంటాడు" అంది రాధమ్మ సంతోషంతో.

"నే నడంగు జేరినకాడినుండి మీపనిమీనే ఉంటా. ఆ గంగమ్మతల్లి మనల్ని సల్లగాసూత్తే మీకూ ఆడనే పని దొరుకుద్ది, అందరం ఓ కాడే ఉండొచ్చు. దిగులెట్టుకోమోకు."

"సరే, పిన్నీ! నువ్వు మాటాడకపోయినా, నువ్వు దగ్గరలో ఉన్నావని నాకు ధైర్యంగా ఉండేది" అంటూ దిగులుగా నిట్టూర్చింది రాధమ్మ.

"ఆట్టే రోజులు పట్టదు, మీరూ ఆడకే వచ్చేస్తారు. దిగులొద్దు. వెళ్ళొస్తా రాదమ్మా! ఇంక కొంచెం సేపట్లో భోజనాలు చేసి బయలుదేరుతాము. ఆడకు జేరేతలికి సందలడుద్ది. పొట్ట సేతపట్టుకుని, అన్నాన్ని ఎతుక్కుంటూ  పోయేవాల్లకి ఏ ఊరైతేనేoటిలే! ఈ ఊరితో మాకు ఉన్న రునం తీరిపోయింది." బొడ్డు దగ్గర దోపుకున్న కొంగు పైకితీసి కళ్ళు తుడుచుకుంది రాగమ్మ.

"బాధపడకు పిన్నీ! కొన్నాళ్ళు గడిస్తే అక్కడకూడా అలవాటైపోతుంది" అంది రాధమ్మ ఓదార్పుగా.

"నేనెల్లి పిల్లలకు బువ్వ దినిపించి, వంటసామాను తోమి, సద్ది ఆపైన ప్రయానమవ్వాలి. ఇక నేను సెలవు దీసుకుంటా. కన్నయ్యకి కూడా సెప్పు." అలా మాట్లాడుతూనే తనచేతి సంచీ లోంచి పసుపూ, కుంకం పొట్లాలూ, పూలూ, పళ్ళూ, రావికెలగుడ్డా పైకితీసి రాధమ్మకు బొట్టుపెట్టి చేతికందించింది రాగమ్మ.

రాధమ్మ ఆశ్చర్యపోయింది. "ఇవన్నీ ఏమిటి పిన్నీ! నీ అభిమానం చాలదా" అంది. భావావేశంతో జీరబోయింది రాధమ్మ గొంతుకు.

"రాదమ్మా! నువ్వు మా ఇంటి ఆడపిల్లవనుకున్నాక నీకు మరియాద సెయ్యడం నా దరమంగందా! నీకు పసుపూ కుంకం పెట్టకుండా నే నేలా ఊరు విడిసి పోగలను" అంది రాగమ్మ.

రాధమ్మ తిరిగి రాగమ్మకి బొట్టు పెట్టి, కాళ్ళకు దణ్ణం పెట్టింది. ఇద్దరూ భారమైన మనసులతో వీడ్కోలు చెప్పుకున్నారు.

###############

ఏదైనా ఒక అపవాదు పుట్టడమే ఆలస్యం, వెంటనే దాన్ని మరింతగా పెంచేసి ప్రచారం చెయ్యడం అన్నది (నీచ) మానవనైజం. భేతాళుడి పుణ్యమాని కన్నయ్య కుటుంబాన్ని వెలివేశారు బెస్తవాడ జనం. కానీ అది వాడికి తృప్తి నివ్వలేదు. దానికి కారణం వాడు ఆశించిన ఫలితం వాడికి దక్కకపోడమే.

రాధమ్మమీద నింద వేస్తే రాధమ్మ కన్నయ్యలు విడిపోతారనీ, ఒంటరి అయిన రాధమ్మ తేలిగ్గా తనకు చేరిక ఔతుందనీ ఆశపడ్డాడు భేతాలుడు. ఆలా జరిగిననాడు కొన్నాళ్ళు తాను ఆమెతో కలిసి ఉండి, ఆపై ఆమెను ఏ దుబాయి సేట్ కో అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో జీవితంలో సెటిలైపోవచ్చునని కలలుకన్నాడు. కానీ కన్నయ్య తీసుకున్న నిర్ణయం వాడి పన్నాగాన్ని ఆదిలోనే ముక్కలు చేసింది. అది వాడికి గిజాటుగా తయారయ్యింది. కానీ, కన్నయ్యా రాధమ్మల అభివృద్ధి చూసి ఓర్వలేని జనాలకు మాత్రం వాడు “హీరో” అయ్యి కూర్చున్నాడు. కొంతమంది వాడిని పలకరించి ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తున్నారు కూడా! దానికని వాడు విజయగర్వంతో విర్రవీగుతూ బెస్తవాడ వీధుల్లో బోర విరుచుకుని తిరుగుతున్నాడు. కానీ, అంతకంటే పెద్దపెద్ద ఆశలుండడం వల్ల అది ఎంతమాత్రం సంతృప్తి నివ్వడంలేదు వాడికి.

కన్నయ్య కుటుంబాన్ని వెలేసినప్పటినుండి, బ్రహ్మయ్య మనసుకు స్థిమితం లేకుండా పోయింది. “కన్నయ్య ఆణిముత్తెం లాంటోడు. వాడు పుట్టినకాడినుండీ సూత్తన్నా, ఆడిసంగతి నా కెరికే. కానీ, పట్టనవోసం నుండి కొట్టుకొచ్చిన ఆయమ్మి ఇశయం నాకేటెరిక? అందరూ సేరి అన్నన్ని మాటలు సెవుతా ఉంటే తీరుమానం సెయ్యక తప్పలేదు. నేయానికి సెవులేగాని కళ్ళు పనిసెయ్యవు. సాచ్చీకాన్ని బట్టేగందా ఉంటాది తీరుపు! అది నా తప్పు కాదు. ఆల్లు పడుతున్న కట్టాలు సూత్తావుంటే గుండె బేజారౌతావుంది. ఏదో ఒక పరిస్కారం సూడాల” అనుకున్నాడు బ్రహ్మయ్య.

వెలి అంటే సంఘ బహిష్కరణ. వెలి పడిన వాళ్లకి ఊరిలో ఎవరూ సహకరించరు. పన్నెత్తి పలకరించరు. సరుకులు అమ్మరు, సహాయం చెయ్యరు. అప్పుడు ఆ వెలిపడ్డవారికి బతుకు దుర్భరంగా మారుతుంది. మానవుడు సంఘజీవి. అందుకే ఏదైనా సంఘ విద్రోహక చర్య చేసినవారికి శిక్షగా "వెలి" విధిస్తారు. ఎవరైనా వెలిపడిన వ్యక్తితో, కలిసి ఉన్నా, పలకరించి మాటాడినా, అవసరంలో సహకరించినా వారినికూడా వెలివేస్తారు.  వెలివెయ్యడమంత తేలికకాదు వెలి ఎత్తేయడం! తగినంత కారణం చూపించవలసి ఉంటుంది. ఆ తరువాతి కాలంలో దానికొక పరిష్కారం ఏర్పాటు చేశారు - కులతప్పుకి సంఘం చెప్పినంత సొమ్ము జరిమానాగా సంఘానికి చెల్లిస్తే, వెలి రద్దైపోతుంది. వెలిపడ్డవాళ్లతో కలిసిపోయి సంఘంలోని పెద్దలందరూ సరదాగా తిని, తాగి ఆడబ్బుతో పండుగ చేసుకుంటారు.

"ఈడు ఊళ్ళోకి దిగమడ్డప్పుడే అనుకున్నా, ఎవరికొంపకో అగ్గెట్టడానికే వచ్చాడు ఈడని! అది ఎవరి కొంపో - ఏమో అనుకున్నానేగాని, పూలబుట్టలా నిచ్చేపంలా ఉన్న కన్నయ్య బతుకు నిలా బుగ్గిపాలు జేస్తాడనుకోలేదు. ఐనా నా ఎర్రిగాని, కన్నతల్లి సెయ్యిరిసినోడికి స్నేయితుడి బతుకోలెక్కా ఏంటి” అని నీలమ్మ బాధగా అనుకుంది.

కన్నయ్య కుటుంబం మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ భేతాళుణ్ణి, “ఇంతకింతా అనుభవించకపోడు! దిక్కుమాలిన సావు సత్తాడు” అంటూ చాటునా మాటునా శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు.

“కన్నయ్య పడవ కొంటాడంటే నేనూ ఆశపడ్డా, ఆడి పడవమీన పనిసెయ్యాలని! వాడు శానా మంచోడు. ఆడి పడవమీన కూలికి పని సేసినా, పాలికి పనిసేసినా – అది అదురుట్టమే ఔతాదని ఎంతో సంతోశించినా. శివరాకరుకి ఇలాగయ్యింది” అంటూ బహిరంగంగానే అని నిట్టూర్చాడు నాగభూషణం.

కన్నయ్య రాధమ్మలు పడుతున్న బాధలు చూడలేక, తొందరగా ఈ వెలి ఎత్తెయ్యాలంటూ రాములోరికి మొక్కెట్టుకుంది, ఆ కుటుంబం మేలు కోరుకునే అచ్చమ్మ. కానీ అందరూ ఆ వెలిని “తోసి రాజ”ని వెళ్ళి కన్నయ్య కుటుంబాన్ని పలకరించడానికి మాత్రం భయపడ్డారు.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. – స్వామి వివేకానంద