అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

రాత్రి గడుస్తున్నకొద్దీ వాతావరణంలో మార్పు కనిపించింది. చల్లని గాలి వేగంగా వీయసాగింది. ఆకాశంలో మేఘాల జోరు పెరుగుతోంది. చెదురుమదురుగా ఉన్న మేఘాలు క్రమంగా దగ్గరౌతున్నాయి. క్షణక్షణానికీ గాలి విసురు పెరుగుతోంది. తూరుపుదిక్కున మేఘాలు కమ్మెయ్యడంవల్ల తెల్లారినా వెలుగు రాలేదు. హోరుమని గోలచేస్తోంది సముద్రం. నెమ్మదిగా వాన మొదలయ్యింది. అసలే శీతాకాలం, ఆపై జడివాన - చలి నిలువునా వణికించడం మొదలుపెట్టింది. చూస్తూoడగా జనం ఇల్లు వదిలి రావాలంటేనే భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది.

కన్నయ్య సముద్రం మీదికి వెళ్ళి అప్పుడే ఒక రాత్రి గడిచిపోయింది. రాధమ్మ గుండెలనిండా గుబులే! ముందు రాత్రంతా నిరీక్షణతో ఆమెకు జాగారమే అయ్యింది. “ఆలస్యంగా వస్తానని చెప్పే వెళ్ళాడు గాని, మరీ ఇంత ఆలస్యమా” అనుకుంది బాధగా.

ఎల్లమ్మ వల్లమాలిన జ్వరంతో కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. కొడుకటు వెళ్ళగానే ఇటు జ్వరంతో మంచమెక్కింది ఆ ముసలితల్లి. గొంగళి కప్పుకుని ముడుచుకుని పడుకుని గాఢంగా నిద్రపోతున్నారు పిల్లలు. వాళ్ళు ఇప్పుడప్పుడే లేచేలా లేరు. రాధమ్మ ఇక ఉండబట్టలేకపోయింది. తలుపు దగ్గరగా లాగి, కొంగు తలపై కప్పుకుని పరుగులాంటి నడకతో తుమ్మలబీడు వైపుగా బయలుదేరింది. ఆ ఆత్రానికి అర్థంలేదు. ఏ తర్కానికీ అందని ఉత్కంఠ అది!

వేట పూర్తిచేసి కన్నయ్య రేవుకి చేరితే ఇంటికి రావడం ఎంతసేపు? రాధమ్మ పనిగట్టుకు వెళ్లి రేవులో నిలబడితే గాని అతడు రాలేడా? - అని అడగకూడదు. మనసు నిండా ఆరాటం, ఏదో చెయ్యాలన్న ఉబలాటం తలమునకలు కాగా, కన్నయ్య పడవ సముద్రం మీద రేవు వైపుకు వస్తూ కనిపిస్తుందేమోనని, వెళ్లి చూడాలని రేవుకు బయలుదేరింది రాధమ్మ.

వర్తకం తక్కువగా వున్న చిన్నరేవుని బెస్తవాడ జనం ఎక్కువగా వాడుకుంటారు. రకరకాలైన ఉపయోగాలు ఉండడంతో చిన్నరేవులో ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు. కానీ, ఆ రోజు చలికి, వానకి బెదిరి అక్కడకు ఎవరూ రాలేదు. రాధమ్మ అక్కడ ఒంటరిగా ఉండి. చెయ్యి ఓరజేసి తలనుండి కళ్ళమీదికి కారే వాన నీళ్ళకు అడ్డుచేసి, సముద్రం మీదికి దృష్టి సారించి, అవిరళంగా కారే వర్షాధారలమధ్య కన్నయ్య పడవ పొలకువకోసం చూపులతో గాలించసాగింది.

పొద్దెక్కినకొద్దీ వెలుగు పెరగడానికి బదులుగా తరుగుతోంది. సముద్రంపైన చీకటి దట్టమౌతోంది. క్షణ క్షణానికీ గాలి ఉధృతమవుతూండగా అలలఎత్తు కూడా పెరుగుతోంది. వాటిని గమనించిన రాధమ్మ మనసులోని భయం ఉవ్వెత్తుగా లేచింది. తన బాధలో తానున్న రాధమ్మకు తన వెనకాల వస్తున్న మనిషి అడుగుల చప్పుడు తెలియలేదు.

రాధమ్మ కంగారుపడుతూ ఒంటరిగా తుమ్మలబీడు వైపుగా వెళుతూండడం బహిర్దేశానికి వచ్చిన భేతాళుడి కళ్ళబడింది. వాడు రవంత దూరంలో వెనకాలే నక్కుతూ, రాధమ్మ వెంటపడ్డాడు. ఆమె రేవులో ఒంటరిగా నిలబడి ఉండడం చూడగానే అతనిలో కామం ప్రకోపించింది. ఒక్కసారి ఆమెను లొంగదీసుకుంటే తనకు శాన్నాళ్ళుగా ఉన్న కోరిక తీర్చుకోడమే కాకుండా, వాళ్ళపైన ఉన్న తన పగ కూడా తీరిపోతుంది - అనుకున్నాడు. వెంటనే - బెంగతో, బాధతో పరాకుగా ఉన్న రాధమ్మను వెనుకబాటుగా వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు.

పరాకుగా ఉండడంతో రాధమ్మ ఒక్కక్షణం దిగ్భ్రాంతితో మ్రాన్పడిపోయింది. కానీ వెంటనే తెలివితెచ్చుకుని భేతాళుడి పట్టు విడిపించుకోడం కోసం పెనుగులాడడం మొదలుపెట్టింది. తేరతిండితిని బలిసిన భేతాళుణ్ణి విడిపించుకోడానికి, సరైన తిండిలేక బక్క చిక్కిఉన్న రాధమ్మకు సాధ్యపడటం లేదు. ఐనా ఆమె పెనుగులాడడం ఆపలేదు.

సముద్రకెరటాలు ఒడ్డునున్న తుప్పలపైకంతా లేస్తున్నాయి. ఒక పెద్ద కెరటంవచ్చి ఒడ్డున పెనుగులాడుతున్న వాళ్ళని తాకింది. కెరటం తాకిడికి రాధమ్మ నిలబడలేక పడిపోయింది. అదే అదునని భేతాళుడు ఆమెపైబడి ఆక్రమించుకోబోయాడు.

అసహాయురాలైన రాధమ్మ దుఃఖంతో, అవమానంతో, “కన్నాయా” అంటూ పెద్దగా కేకపెట్టింది.

వెంటనే “బుస్సు” మన్న శబ్దం, “చచ్చాను బాబోయ్” అన్న భేతాళుడి చావుకేక, కెరటాల హోరును, గాలి వేస్తున్న ఊళల శబ్దాన్ని మించి గట్టిగా వినిపించింది. భేతాళుడి పట్టుసడలడంతో లేచి నిలబడింది రాధమ్మ. అప్పుడు మెరిసిన మెరుపుకాంతిలో ఒడ్డునున్న ఇసుకలోపడి బాధతో కొట్టుకుంటున్న భేతాళుడు, వెనక్కివెడుతున్న కెరటంపైన తేలియాడుతున్న పెరజు – భయంకరమైన విషాన్ని కలిగి ఉన్న సముద్రసర్పం - కనిపించింది  రాధమ్మకు.

భేతాళుడి నుండి విడిపడిన రాధమ్మ, బాధతో, భయంతో నేలమీదపడి గిలగిలా కొట్టుకుంటున్న భేతాళున్ని పట్టించుకోకుండా ఇంటివైపుగా పరుగుపెట్టింది బెగ్గతిల్లిపోతూ. భేతాళుడు తనకు చేసిన అవమానం ఒకపక్క, క్షణక్షణానికీ ఉధృతమౌతున్న సముద్రం మీద కన్నయ్య ఏమి అగచాట్లు పడుతున్నాడో - అన్న భయం ఒకపక్క కుదిపేస్తూ ఉండగా అసహాయంగా దుఃఖిoచింది రాధమ్మ. అలవాటుపడిన కాళ్ళు ఆమెను ఇంటికి చేర్చాయి.

-----------------------------

తన గాలానికి చిక్కిన ఆ చేప పరిమాణాన్ని చూసి బేజారైపోయాడు కన్నయ్య. దాని ముట్టె మీదున్న ముల్లు మూరెడు పొడవుండి, సూదిగా మొనదేలి ఉంది. చేప ఒళ్ళు పలకరంగులో ఉంది. దానిపై ఏటవాలుగా గీయబడిన గులాబీరంగు చారలతో ఉండి ధగధగా మెరుస్తూ అందంగా కనిపిస్తోంది ఆ చేప. దానిని చూస్తున్న కన్నయ్య కళ్ళు ఒక్కసారిగా జిగేల్మన్నాయి. చేప నోరుబాగా తెరిచి మళ్ళీ మూసుకుంది. బాధతో మూలిగింది కాబోలు, ఒక విధమైన వింత ధ్వనితో గాలి కంపించింది. గాలి జోరు, వానహోరులోకూడా ఆ ధ్వని కన్నయ్యకు విపించింది. అంతలో ఒక్కసారి ఎగిరిపడి, తోకతో నీటిని “ఛెళ్ళు"న కొట్టింది. ఆ దెబ్బకు పైకంతా లేచింది నీరు. తెడ్డు పట్టుకుని పడవలో నిలబడివున్న కన్నయ్య పై జడివానలా కురిసి అతన్ని నిలువునా ఉప్పునీటిలో తడిపింది. అంతవరకూ ఆ చేప పొలుసులకింద దూరి, దాని రక్తం తాగి బ్రతికిన పరాన్నజీవి, "పైజరుకట్టు", రాబోయే ఆపదను గుర్తించిన దానిలా ఆ చేపను విడిచి మరో చేపకోసం వెతుక్కుంటూ కాబోలు ఈదుకుంటూ వెళ్ళిపోయింది.

అకస్మాత్తుగా కన్నయ్యకు ఒక ఆలోచన వచ్చింది, గడబిడగా ఉన్న ఈ వాతావరణంలో ఇంత పెద్ద చేపను తను ఒక్కడూ ఎత్తి దోనెలో పెట్టడం సాధ్యమేనా - అనుకున్నాడు. వెంటనే అతనికి మరో ఊహ వచ్చింది - మిగిలిన రెండు గాలాలకు కూడా ఇలాంటి చేపలే తగులుకుంటే ఏం చెయ్యాలి?

విధి లీలలు బహు విచిత్రంగా ఉంటాయి. మనిషి కావాలనుకున్నవి సాధారణంగా దొరకవు, వద్దనుకున్నవి మాత్రం వరసగా వచ్చిపడతాయి! ఇంతసేపూ తనుపడ్డ శ్రమకు ప్రతిఫలంగా ఈ చేప చాలు. మరోచేప నింక తను సరిదియ్యలేడు. ఎందుకైనా మంచిది, నీటిలోంచి గాలాలను తీసేయాలి – అనుకున్న కన్నయ్య వాటివైపు చూశాడు. ఎర్రనిబెండు ములుగుతూ తేలుతూ నీటిలో నాట్యం చేస్తోంది. అంటే - ఇరవై మూరలలోతులో  గాలానికి కట్టి ఉన్న ఎరని ఏదో చేప కొరుకుతోందన్నమాట! అంత లోతులో అంటే అదీ పెద్ద చేపే అయ్యి ఉంటుంది - అనుకున్న కన్నయ్య, గుండెలమీద చెయ్యి ఉంచుకుని “అయ్య బాబోయ్! ఇక నావల్లకాదు” అనేసుకున్నాడు. వెంటనే మహా వేగంగా ఆ గాలాన్ని నీటి నుండి చేది పడవలో పడేశాడు.

ఆపై చేపనుద్దేశించి సవాలు చేశాడు, "ఇదిగో సేపా! నా నెత్తురు నువ్వు కళ్ళజూపావు గందా – ని నిన్నొగ్గేస్తాననుకోమోక.  నేను నిన్నోదిలేది లేదు. తశ్శదియ్య, ఈడు ఎవరనుకుంటున్నావె!? ఛత్రియున్నే! ఇజయమో, ఈరసొరగమోఅత్తప్ప ఏ! - రేమాట తెలీనోడు ఈడు ! తమాసాలు సేసి తప్పించుకోవాలని సూడమో. అయ్యేమీ సాగవు నాకాడ" అంటూ సవాలు విసిరాడు కన్నయ్య. అంతలోనే మళ్ళీ, తను చేపతో మాటాడడమేమిటీ – అనుకున్నాడు.

కారుతున్న రక్తాన్ని ఆపడం ఎలాగో తెలియలేదు కన్నయ్యకు. చివరకి, తాడుని కాలితో తొక్కిపెట్టి, చేతిని నీటిలో ముంచాడు. రక్తం చారలా ఏర్పడింది నీటిలో. ఆ రక్తపు చారిక అలా కొంత దూరంవెళ్ళి నీటిలో కలిసిపోడం చూస్తున్న కన్నయ్యకి అల్లంత దూరంలో వేగంగా ఈదుకువస్తున్న సొరచేప (షార్కు) తాలూకు మూపు మీది త్రిభుజాకారపురెక్క (డోర్సాల్ ఫిన్) కనిపించింది. తనవైపుగా శరవేగంతో వస్తున్న మృత్యువుని గుర్తించి, అదిరిపడి చెయ్యి పైకి తీసేసుకున్నాడు కన్నయ్య.

సముద్ర సామ్రాజ్యానికి రారాజని చెపుతారు ఈ దొడ్డసొరని. ఇది పైనంతా బూడిదరంగులోఉండి, పొట్టకింద తెలుపు ఉంటుంది. చేప జాతుల్లోకల్లా అందమైన రూపం! నీటిలో అతివేగంగా ఈదడానికి కావలసిన సౌష్టవమున్న శరీరలాఘవం, అతి శీఘ్రంగా దిశలు మార్చగల నాజూకైన తోక, ఎంత దూరాన్నుండైనా నెత్తురు వాసనను పసిగట్టగల సున్నితమైన ఘ్రాణ శక్తి, సునిశితమైన చూపు, నోటిలో – మనిషి చేతివేళ్ళలా తెరవడానికీ, ముడవడానికీ వీలుగల, గులాబీ ముళ్ళలా వంపుతిరిగిన ఆరు వరసల పళ్లు పుట్టుకతోనే ప్రసాదించబడ్డాయి దానికి! సొరచేపల్లో చిన్నా పెద్ద రకాల జారులు ఇంకా ఎన్నోఉన్నాయి గాని, వనములో పులి లాగ, ఈ జీవనరాశిలోని జంతువులలో ఇదే మగటిమికి ప్రశిద్ధి. అందుకే దీనిని పులిసొర (టైగర్ షార్కు) - అనికూడా అంటారు. అంతుపొంతులెరుగని ఈ అగాధ జలనిధిలో దీనికంటే పెద్దవైన చేపలు ఇంకా ఎన్నో ఉన్నాయిగాని, భగవంతుడు దీనికిచ్చినన్ని వరాలు మరి దేనికీ ఇవ్వలేదు. అందుకే దీనిని చూస్తే సముద్రంలో ఉండే ఇతర జీవులకే కాదు, వాటిని అవలీలగా వేటాడే జాలర్లకు కూడా హడలే. దీనిని వాళ్ళు దంతసిరి అని వ్యవహరిస్తారట.

కన్నయ్య చేతికైన గాయం నుండి కారిన పచ్చినెత్తురు వాసనను చాలా దూరంనుండే పసిగట్టి, తన కిష్టమైన వేట దొరకబోతోoదన్న సంతోషంతో ఈదుకుంటూ, మహావేగంగా ఆ వాసన వస్తున్నవైపుగా వస్తోంది ఆ సొరచేప. సరిగా సమయానికి చూడబట్టి, కన్నయ్య చెయ్యి శీఘ్రం పైకి తీసేసుకోవడం, అదే సమయానికి గాలానికి చిక్కిన చేప దిశమార్చి వేరే పక్కకి పడవను లాక్కునిపోవడం జరగడంతో, హఠాత్తుగా నెత్తురు వాసన ఆగిపోవడంవల్ల ఆ సొరచేప తబ్బిబ్బై నిరాశ చేసుకుని దారి తప్పించి ఎటో ఈదుకుంటూ వెళ్ళిపోయింది.

సొరచేప వేరేవైపుగా వెళ్ళిపోడం చూసి గండం గడిచిందనీ తనకింకా భూమిమీద నూకలు మిగిలి ఉన్నాయనీ సంతోషించాడు కన్నయ్య. అలా కాక అది నేరుగా వచ్చి తన పడవతో తలపడి ఉంటే - తనపని ఏమయ్యేదో! తనను మృత్యువునుండి కాపాడిన దైవానికి తలవంచి భక్తితో నమస్కరించాడు కన్నయ్య.

ముందు నీటిలో ఈదుకు పోతూ చేప, వెనకాలే దోనెలో కన్నయ్య – ఇలా ఈ ప్రయాణం ఎంతసేపు సాగాలి? కన్నయ్యకు విసుగనిపించింది. తాడు పట్టుకు లాగాడు. నీటిమీదికి తేలింది చేప. దానిని చూసిన కన్నయ్యకి చాలా సంతోషమయ్యింది. అతడు ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇంత అందమైన చేపను ఇంతవరకు చూడలేదు. ఏ దూరప్రాంతంనుండి వచ్చిందో  పాపం, మృత్యువును వెతుక్కుంటూ ఇక్కడికి! దీని చావు ఇక్కడ రాసివుంది మరి! కన్నయ్య తాడు వదలగానే చేప మళ్ళీ ఈదుకుంటూ ముందుకు పోసాగింది.

కొంతదూరం పోయాక సముద్రం మీద కెరటాలు బొత్తిగా లేకపోవడం గమనించాడు కన్నయ్య. కానీ, నీటిలో కెరటాలు లేకపోయినా విపరీతమైన వడిని చూశాడు అతడు. నీటిలోని అలజడిని గుర్తించాడు. తనచుట్టూ ఏటవాలుగా వ్యాపించివున్న జలరాశి ఎత్తు, క్షణక్షణం పెరుగుతోoది. అది చూడగానే కన్నయ్యకు అర్థమైపోయింది, తన పడవ ఒక నీటి ఉరవడిలో పడి గిరగిరా తిరుగుతోoదన్నది! అంటే, తానిప్పుడొక సుడిగుండంలో పడి, అదుపుతప్పి పడవతో సహా గిరగిరా తిరుగుతున్నాడన్నమాట!

అతని చుట్టూ ఉన్న జలపర్వతపు ఎత్తు పెరుగుతోందంటే అంతకంతకీ అతడు సుడిగుండపు లోతుల్లోకి దిగజారిపోతున్నాడన్నమాట! కన్నయ్యకు అది తలుచుకోగానే భయంతో ఒళ్ళు ఝల్లుమంది. విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చింది. ఇల్లు గుర్తు వచ్చి దిగులుతో గుండెవేగం పెరిగింది. తనవాళ్ళని చూచుకునే భాగ్యం తనకిక లేదని అర్థమైయింది.

బెస్తవాడలో ఏవేవో కథలు చెప్పుకుంటారు: సముద్రం అడుగున ఒక దివ్యలోకం ఉందనీ, అది కడలిసామ్రాజ్య రాజధాని అనీ, అక్కడున్న ఒక సుందర భవనంలో కడలిరాజు, కడలమ్మ సకుటుంబంగా కాపురముంటారనీ - ఆ దివ్యసౌధానికి వెళ్లేదారి సుడిగుండంలోనుండే ఉంటుందనీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

"ఐతే నేనిప్పుడా కడలమ్మ ఇంటికాడికి ఎల్లిపోతున్నా కాబోలు" అనుకున్నాడు కన్నయ్య దుఃఖంతో.

ఇంటిదగ్గర తన రాకకై ఆత్రంగా ఎదురుచూసే భార్యా, పిల్లలు, ముసలితల్లి గుర్తుకువచ్చి అతనికి చాలా దుఃఖం వచ్చింది. "నేనుగాని ఇంటికి తిరిగి వెళ్లకపోతే ఆ నలుగురూ ఏమైపోవాల!" ఈ ఆలోచన అతన్ని చాలా బాధపెట్టింది. తానిప్పుడు చిక్కుకున్న జలవలయం నుండి తప్పించుకుని బయటపడడం అన్నది ఉట్టిమాట - అనుకుని నిరాశ చేసేసుకున్నాడు కన్నయ్య. అన్ని ఆశలూ ఉడిగిపోడంతో అప్రయత్నంగా చేతిలోని తాడు బిగువు సడలింది.

"అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది" అనుకున్నాడు ముప్పిరిగొన్న నిరాశతో.

మరుక్షణంలో నీటిపర్వతం వాలుమీద వేగంగా ప్రయాణించి, అతడి దోనె సముద్రపు ఉపరితలం  మీదికి వచ్చేసింది అతని ప్రయత్నమేమీ లేకుండానే! కన్నయ్య సంతోషంగా అనుకున్నాడు, "నా రాధమ్మ గొప్ప పతివ్రత! అందుకే సావాల్సినోన్ని నేను బతికి బైటపడ్డా. ఈ సేపే నన్ను కాపాడిందంటే ఇంతకంటే కారణం ఇంకేమిటిట!

అంతలో చేప పైకితేలి ఈదడం మొదలుపెట్టింది. ఆ చేప నుద్దేశించి మాటాడసాగాడు కన్నయ్య. "ఓ సేపా! నువ్వు శానా గొప్పదానివే! నిన్ను బఛ్చిమ్చాలనుకున్న నన్ను రచ్చించావు. నువ్వు నన్ను ఛమించగలవా? సేపలవేట నా కులవృత్తి. నేను బతకాలంటే నిన్ను జంపాల! నా బతుకు తెరువుకోసం, నా పెళ్ళాం బిడ్డల్ని, ముసలితల్లినీ పోశించుకోడం కోసం నేను నిన్ను పొట్టన బెట్టుకోక తప్పడం లేదు, అంతేగాని నాకు నీమీద ఇరోదం గాని, పగ గాని ఏమీ లేదు. నన్ను చమించవా" అంటూ చెంపమీద కొట్టుకుంటూ జాలితో బేలగా ఏడ్చాడు కన్నయ్య.

తెల్లవారుఝామున మొదలైన వాన, చిలికి చిలికి గాలివానయ్యింది."గాలి ఊళలువేస్తూ వేగంగా విసురుతోoది. సముద్రపు కెరటాలు అంతకంతకీ ఎత్తును పెంచుతూ విరుచుకుపడుతున్నాయి. మెరుపులతో ఉరుములతో వాన భయంకరంగా కురుస్తోంది. చలి ఒణికిస్తోంది. కన్నయ్య సముద్రం మీదకి వచ్చి అప్పుడే ఇది రెండవరోజు. ఇదికూడా మూడవ వంతు గడిచిపోయింది.కన్నయ్యను ఆకలి పీడించసాగింది. రాధమ్మ ఇచ్చిన అటుకులు తిని నీళ్ళుతాగినది కూడా పూటగడిచింది. నీరసంగా అలసటగా ఉంది. ఇల్లు గుర్తుకు వచ్చింది.

"ఈ చేప ఎంతసేపు నన్నిలా తిప్పుతుంది" అని చేపమీద విసుక్కున్నాడు కన్నయ్య.

ఉన్నకర్మకు ఉపకర్మ కూడా తోడయింది - అన్నట్లు కన్నయ్యకిప్పుడు మరో కష్టం కూడా వచ్చిపడింది - వాననీటితో నిండిపోతున్న పడవను ఎప్పటికప్పుడు ఖాళీ చెయ్యడం తప్పనిసరి అయింది. దట్టమైన మేఘాలు కమ్మిఉండడంతో పట్టపగలే వెలుగు బాగా తగ్గిపోయింది.

రోజు గడుస్తున్నకొద్దీ చేప వేగం తగ్గిపోయింది. క్రమంగా వదులౌతున్న తాడుని దోనెలోకి తోడుకోవలసివస్తోంది కన్నయ్యకు. మరి కొంతసేపయ్యే సరికి చేప వలయాలు తిరగడం మొదలుపెట్టింది.

మెరుపు వెలుగులో దూరంగానైనా ఏ వేటపడవైనా కనిపిస్తుందేమోనని పరికించి చూశాడు కన్నయ్య. కానీ, వాటి జాడ ఎక్కడా లేదు. అతనికి ఇంటిమీద బెంగ పుట్టింది. ఇల్లు చేరాలంటే ఎటు వైపుగా వెళ్ళాలో తోచడం లేదు. ఏదైనా పడవ కనిపిస్తే, అటువైపుగా వెడితే ఒడ్డు వస్తుందేమోనని ఆశ పడ్డాడు గాని, ఈ రోజు సముద్రం మీదికి ఒక్కపడవకూడా వచ్చిన జాడలేదు. నిస్సహాయంగా దిక్కులు పరికించి చూశాడు కన్నయ్య.

క్రమంగా గాలివాన ఉధృతమౌతోoది. మహాజోరుగా వీస్తున్నగాలికి అలల ఎత్తు అంతకంతకీ పెరిగిపోతోoది. కన్నయ్యకు అలసట మొదలయింది. ఆ కల్లోల సాగరంలో తన చిన్న పడవ పల్టీ కొట్టకుండా ఉండాలంటే, తెడ్దుసాయంతో తన బలాన్ని ఉపయోగించి దాన్ని నిలబెట్టాల్సి ఉంది. ఆ బీభత్స వాతావరణంలో ఒక కెరటం మీదినుండి మరొక కెరటం పైకి పడవను దూకిస్తూ పడవను నడుపుతున్నాడు కన్నయ్య. ఇంత చల్లని వాతావరణంలో కూడా అతని నుదుట తుషారబిందువుల్లా చెమట కనిపిస్తోంది. ఆ చమట వాననీటితో కలిసి, కళ్ళలోకి జారి మంటపుట్టిస్తోంది.

ఇంకా సాయంకాలం కాకముందే పరిసరాలను చీకటి ఆవరించింది. అలలపై ఊగులాడుతున్న ఆ చిన్న పడవ చుట్టూ, విజృంభించి వీర విహారం చేస్తున్న కెరటాలు, తలలపై మెరిసే మణులున్న కాలనాగులు చుట్టుముట్టి కసితో బుసలుకొడుతున్నట్లుగా ఉంది.

ఆకాశం వైపుచూసి, నక్షత్రాలనుబట్టి దారి తెలుసుకోగల నేర్పు ఉంది కన్నయ్యకు. కానీ అసలు ఆకాశమే కనిపించని స్థితిలో అతడు ఏమిచేయగలడు! ప్రకృతి సహకరించినప్పుడే తన శక్తి యుక్తులను ప్రదర్శించుకోగలుగుతాడు మానవుడు. ప్రకృతి ఎదురుతిరిగినప్పుడు అతడు నిర్వీర్యుడు కాక తప్పదు.
అసహాయతతో తల్లడిల్లుతూ కూడా అతడు కడదాకా పోరాడడానికి నిశ్చయించుకున్నాడు. ఒక అలమీదనుండి మరొక అలమీదకు నడుపుతూ, పడవను తన భుజ శక్తితో మునిగిపోనీకుండా కాపాడుతున్నాడు.

రాత్రి ఔతున్నకొద్దీ గాలి వేగం, వాన జోరు పెరుగుతూన్నాయి. గాలి ఊళలు వేస్తూ వేగంగా వీయసాగింది. ఆ గాలి విసురుని తట్టుకుని నిలబడాలంటే చాలా కష్టమౌతొంది కన్నయ్యకు. వాన జోరు పెరిగేసరికి బారెడు దూరంకూడా సరిగా కనిపించడం మానేసింది. మరణ వేదనలో ఉన్న చేప పడవదగ్గరకు ఈదుకుంటూ రావడం కన్నయ్యకు మసకమసకగా కనిపించింది. కానీ అంతలోనే అది ఏమనుకుందో ఏమో - మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది.

"అబ్బా! ఈ సేపే ఇంత పెద్దది కాకపొతే బాగుండేది. ఈ గాలోనలో ఒంటి రెక్కమీద నేను దీనిని ఒడ్డుకు తీసుకెళ్లడం కుదిరే పనేనా!" దిగులుగా అనుకున్నాడు కన్నయ్య. ఇప్పుడతని ఆలోచనంతా, అది తనకు తేబోయే సంపదమీద కాకుండా, దానిని తీసుకుని ఇల్లు చేరడం ఎలాగా - అన్నదానిమీద కేంద్రీకృతమై ఉంది.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి తనని తానూ తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే – రామకృష్ణ పరమహంస