కవితాంజలి

 

శ్రీ విప్పగుంట రాజగోపాల రావు, జీవితమంత చదువైన బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఎదిగే సమయం లో ఎన్నో కష్టాలను అనుభవించినా, ఆశించిన సహాయం అందకున్నా, జీవితం పట్ల ఎప్పుడూ సకారాత్మక దృష్టితోనే ముందుకు సాగి, తను తాను మలచుకున్న కష్ట జీవి, క్రమ శిక్షణ-సమయపాలన చక్రవర్తి. మరెందరికో జీవితాన్నిచ్చిన దొడ్డ చేయి.

ఎందరికో నిజమైన గురువు, స్ఫూర్తి ప్రదాత, జీవన ప్రదాత. నమ్ముకున్న విలువలకై రాజీ లేని నిత్య పోరాటం సాగించి జీవించడం అంటే ఏమిటో చాటిన సాహసి. దయార్ద్ర హృదయాన్ని మాట బిగువుతో రాతి లో నీటి లాగ దాచుకున్న లోతు మనిషి. ఆలోచనకి ఆచరణకి వారధియైన నిరంతర కర్మిష్టి. ఆయన మల్లె మనసే నిత్యం ధరించే తెల్లని చొక్కా... అసూయ కలిగించే ఆత్మ గౌరవమే చివరి క్షణం వరకు ఆయనను వరించిన ఆభరణం.

టీచర్ గా మొదలై, అంచలంచలుగా ఎదిగి కాలేజీ ప్రిన్సిపాల్ గా వేల మంది విద్యార్ధుల జీవితాలను ప్రభావితం చేసి, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి గా పదవీ విరమణ చేసారు.

పదవీ విరమణ తరువాత, లా డిగ్రీ, నెల్లూరు సంగీత కళాశాలలో 70 వయసులో సంగీత డిప్లొమా ఆయన జ్ఞాన తృష్ణ కి నిదర్శనాలు.

ప్రచురిత రచనలు:

  1. శ్రీ మార్తాండ లింగేశ్వర శతకం
  2. శ్రీ శిరిడీ సాయిదేవ లీలా బోధామృతమ్(శతకం)-

ఈ శతకాన్ని “షిరిడీ సాయి లీల” గా ఆదిత్య కంపెనీ వారు కాసెట్ గా విడుదల చేసారు. గానం చేసిన వారు “సాయి శ్రీకాంత్” (శ్రీకాంత్ ఈ గానం తరువాత సాయి శ్రీకాంత్ గా పేరు మార్చుకున్నారు)

  1. The Glory of Venkatadri (Translation) (TTD Publication)
  2. The Splendour of Sri Venkateswara (Sri Sinivasa kalyanam) (Translation) (TTD publication)
  3. భారతి,కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ ల లో సాహిత్య వ్యాసాలు,
  4. ది హిందూ,డెక్కన్ క్రానికల్  ప్రత్రిక లో విద్యా విషయిక వ్యాసాలు

అప్రచురిత రచనలు:

  1. వికీర్ణ శకుంతములు ( విశ్వ కవి రవీంద్రుని ‘స్త్రే బర్డ్స్’ ( Stray Birds) కి స్వేఛ్చానువాదము)
  2. తెలుగులో శ్రీ మద్భగవద్గీత- మాత్ర ఛందస్సు లో
  3. అనేక కవితలు,కథలు,గేయాలు, కీర్తనలు.

అటువంటి శిఖర సమానుడైన తండ్రికి ఏమిచ్చి ఋణం తీర్చాలో తెలీదు. అందుకే, ఈ కవితాంజలి. ఏ కొడుకైనా, కనుమరుగైన తన తండ్రికి రాసుకునే కవిత లాంటిదే ...


ఒక శిఖరం ఒరిగింది
- రామ మనోహర్

తారలు రాలుతున్న కాలం
తరాలు మారుతున్న కాలం
ఏడవ లేక కళ్ళు బీళ్ళౌతున్న కాలం
ఎండిన గుండెలెంత అవిసినా
గాయం మానని, గానం ఆగని కాలం
ఈ రాత్రి వెన్నెల ఎంత కురిసినా
నా చీకటి తీరని కాలం

నాన్నా!
చిన్నప్పుడు నే కాళ్ళ తో తన్నిన
నీ గుండెలపై కర్పూరం వెలిగించి
నీ చక్కని దేహ దహనం చేసిన తాపం
నాకెప్పటికీ చల్లారదు
నీపై శిఖ లై ఎగసి పడే నా మోహం లా
నాలో నువ్వు వెలిగించి
నువ్వై నిలిచి వెలుగుతున్న దీపం లా
నీవు పాడిన సమ్మోహన గీతం లా

ఓ రూపసీ!
భసితమైన
నీ చిరునవ్వు చిత్తరువుని
తిరిగి తిరిగి వెదికి వెదికి తనివి తీర చూడాలని
దేహం కనుమరుగై రగులుతున్న నుసి లో
వడి వడి గా కన్నుల తడి తడి గా
సంచయించిన అస్తికలు
నీ రాచ ఠీవి ఆనవాళ్ళ లో ఆవగింజంత లేవు
నీవు మిగిల్చి పోయిన విలువలలో
వీసమంత లేవు
నది లో నీ అస్తికలూ ...
మాలో నీ విలువలూ, నీ ఆనవాళ్ళూ...
ప్రవాహం ఆగదు

నాన్నా!
గడియారం ముల్లులా తిరిగి అరిగి
జీవితాన్ని కొలిచి గెలిచావు
దీప స్తంభమై నిలిచావు
దయలేని ఆ గడియారం
నీవు లేని ఆట లో గెలిచినట్లు గేలి చేస్తూ
ఆగిన నీ గుండెపై నిర్దయగా తిరుగుతూనే ఉంది
నీవు కాలాతీతం
నీ తలపు మాలో
ఆగిన గడియారంలో దాచిన కాలం

నీకు ఇవ్వడమే తెలుసు
దేహాన్నిచ్చి, ఈ బతుకునిచ్చి,
వెఱపు లేని స్వేఛ్చనిచ్చి
జ్ఞానమిచ్చి,
ఎదురొడ్డే ఎడదనిచ్చి
కటువు మాట వెనుక కొండంత దయ ఇచ్చి
చివరికికొక “థాంక్యూ నాయానా” ఇచ్చి
నన్ను నాకిచ్చి
చివరకు
ఋణగ్రస్తుడిని చేశావు
ఒంటరిని చేశావు
నీతో రాలేని అశక్తుణ్నిచేశావు
నిను మరవలేని
మరల పిలువలేని
వివశుణ్ని చేశావు

నీకు తెలుసు
బతుకునెలా మోయాలో
మనిషి తన దారి తనే ఎలా వేయాలో
గీత ఎక్కడెలా గీయాలో
జీవితాన్ని ఏ ఛందస్సు లో రాయాలో
నిన్ను నీవు చివరి దాక చెక్కి చెక్కి
ఇంత అందమైన అనుభవాన్ని
పంచగల సౌరభాన్ని
ఎదురులేని ఆత్మగౌరవాన్ని
కొత్త దారి తొక్కే సాహసాన్ని
ఎదుట నిలిపావు
ఎదలు నింపావు

నాన్నా
పదే పదే నువ్వు చెప్పిన బతుకు బాధలూ.. బాటలూ
తెల్ల చొక్కా వెనక నీ మల్లె మనసు కధలూ.. కన్నీళ్ళూ
సాహితీ వనం లో నీవు చేసిన సేద్యాలూ... పండించిన పద్య గద్యాలూ
దారి చూపేందుకు పైన కురిపించిన కోపాలూ .. విసుగులూ
ఎన్ని నీ తలపులు ఎన్ని నీ కరుణా స్పర్శలు
ఎన్ని నీ ఆత్మ సాక్షాత్కర వాక్యాలు
నా మది గది లో చెల్లా చెదురై
ఒలికిన సుగంధ పరిమళం లా
నిలకడ లేని అలల పై
నిలిచి వెలుగుతున్న చంద్రుని లా

ఎన్ని దోసిళ్ళ నింపను ?
ఎంతని నిన్ను నాలో నింపను ?

నీవన్న మాటే నా ఎదుట నిలబడి
నన్ను కళ్ళార్పకుండా చూస్తోంది
పసి వాడు తెలీని ప్రపంచాన్ని చూసినట్టు
సమయం లేదు
గది సర్దాలి ... పయనం లో
తిరిగి అడుగు పడాలి

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి తనని తానూ తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే – రామకృష్ణ పరమహంస