Sahithi Pudota

భాస్కర శతకము

 

మానిని చెప్పునట్లెఱుక | మాలినవాఁడటు చేసినన్ మహా
హాని ఘటించు నే ఘనుని | కైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁబల్కినన్ దశర | ధేశ్వరుఁ డంగనమాటకై  గుణాం
భోనిది రాముఁబాసి చని | పోవఁడే శోకముతోడ భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! కైకేయి మాటలను విని దశరథుడు సుగుణాల రాశియైన తన కుమారుడగు రామచంద్రుని అరణ్యవాసమునకు పంపెను. ఆ దుఃఖముతో దశరథుడు మరణించెను. అట్లే ఏ పురుషుడైననూ తన భార్య చెప్పిన మాటలు విని నడుచుకొన్నచో దానెంత గొప్పవాడైననూ ఆపదలు పొందుటయందు అనుమానము లేదు.

 

 

పట్టు చుందండ్రి యత్యధమ | వర్తనుఁడైనను గాని వానికిం
బుట్టిన పుత్రకుండు తన | పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ;
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయు | గొంచెము దాన బుట్టునా
చెట్టు మహోన్నతత్వమును | జెందదె శాఖల నిండి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మఱ్ఱి చెట్టు విత్తనము చాలా చిన్నదైననూ దాని యందు పుట్టిన వృక్షము శాఖోపశాఖలుగా పెరిగి మహా వృక్షము అగును. అట్లే తండ్రి అతి మిక్కిలి నీచ ప్రవర్తన గలవాడైననూ, వానికి పుట్టిన కుమారుడు తన పూర్వపుణ్యాన చాలా గొప్పవాడుగా కానవచ్చునని భావము.

 

 

వంచనయింతలేక యెటు | వంటి మహాత్ముల నాశ్రయించినన్
గొంచెమె కాని మేలు సమ | గూడ దదృష్టము లేని వారికిన్;
సంచితబుద్ధి బ్రహ్మనని | శంబును వీఁపున మోఁచునట్టిరా
యంచకుఁ దమ్మితూండ్లు దిన | నాయె గదా ఫలమేమి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! లోకములు సృష్టించెడు బ్రహ్మదేవుని తన వీపుమీద మోసిననూ, రాజహంసకు తామర తూండ్లే ఆహారముగా తినవలసి వచ్చినది గదా! అట్లే కుచ్చితము లేక ఎంత గొప్పవారి నాశ్రయించిననూ అదృష్టమున్నంత వరకే ఫలము లభించును గాని అధికముగా లభించదు.

 

 

రాకొమరుల్ రసజ్ఞునిఁది | రంబుగ మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁదమ | లోపల నుంపరు, నిక్కమే కదా!
చేకొని ముద్దుగాఁజదువు | చిల్కను బెంతురుగాక పెంతురే
కాకము నెవ్వరైన, శుభ | కారణ సన్ముని సేవ్య భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! శుభములను ప్రసాదించువాడా, మునుల చేత సేవింపబడువాడా! మనుష్యులు ముద్దుగా పలికెడి చిలుకను పెంచుకొందురే కాని, కాకిని పెంచరు. అటులనే, భూమి మీద రాజపుత్రులు రసికుని స్థిరముగా గౌరవముతో తమ సన్నిధిని ఉంచుకొండురు. కాని మూఢాత్ముని దరి జేయనీరని భావము.

 

 

సరసదయాగుణంబు గల | జాణమహిం గడునొచ్చి యుండియుం
దఱచుగ వానికాసబడి | దాయఁగవత్తురు లోకులెట్లనం
జెఱకురసంబు గానుఁగను | జిప్పిలిపోయిన మీఁదఁబిప్పియై
ధరఁబడియున్నఁజేరవె ము | దంబునఁ జీమలు పెక్కు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! లోకంలో దయాస్వరూపుడు అయిన దాత దరిద్రుడైననూ వాని యందాశ గల్గి జనులు వెళ్లి దానార్థము యాచించెదరు అది ఎట్లనగా గానుగ యందు చెఱకు గడ పెట్టగా రసమంతయూ కారి పిప్పియై పడి ఉండినను దాని యందు తియ్యదనమునకై చీమల దండు చేరును గదా!

 

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి తనని తానూ తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే – రామకృష్ణ పరమహంస