Alayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

శ్రీ ఉమా మహేశ్వర ఆలయం, యాగంటి కర్నూల్, ఆంధ్రప్రదేశ్

uma-maheswara-temple

సాధారణంగా శైవ క్షేత్రాలలో శివుని ఆలయం, అమ్మవారి ఆలయం ఇరువురి రూపాలు విడి విడిగా ఉంటాయి. అయితే, అర్థనారీశ్వర రూపంతో విలసిల్లె క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా యాగంటి లోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ.15 వ శతాబ్దంలో జరిగింది. కానీ, అంతకు మునుపే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడ అగస్త్య మహర్షి నిర్మించిన ఆలయం ఉన్నట్లు ఇక్కడి స్థాన చరిత్ర చెబుతున్నది. అయితే విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంతో విలసిల్లింది. రాతితో నిర్మించిన ఈ శిల్ప కళా వైభవం నేటికీ తన కళా కాంతులను ప్రసరిస్తూనే ఉంది. ఇక్కడి అర్థనారీశ్వరుడు నేటికీ నిత్య పూజలందుకుంటూ భక్తులకు కోరిన వరాలను తీర్చే భక్త వల్లభుడుగా వినతి కెక్కాడు.

uma-maheswara-templeఆ పరమశివుని ప్రత్యక్షంగా చూసిన తన్మయత్వంతో చిట్టెప్ప అనే శివభక్తుడు ‘నేగంటి’ అనగా ‘నేను కాంచినాను’ అంటే ‘నేను చూశాను’ అని మాహా పరవశంతో ఆ భోళాశంకరుణ్ణి ప్రస్తుతించాడు. నాటి నుండి ఈ ప్రదేశం పేరు ‘నేగంటి’ గా స్థిరపడింది. కాలక్రమేణా అది యాగంటి గా పరిచయమైనది. అగస్త్య మహర్షి ఇక్కడి సహజంగా ఏర్పడిన గుహలో చాలా సంవత్సరాలు తపమాచరించారని స్థల పురాణం చెబుతున్నది. అర్థనారీశ్వరుని ఏకశిలా విగ్రహం వీక్షించిన చాలు మన సంస్కృతి, మనవారి పనితనం ఏమిటో అర్థమౌతుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

uma-maheswara-templeసాధారణంగా రాయి కి వాతావరణ తాకిడికి తరుగుదల ఉండవచ్చు కానీ పెరుగుదల ఉండదు. అయితే ఇక్కడ రాతితో చేసిన నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతున్నది. ఇది నిజంగా ఒక విచిత్రమే. ముడుత పర్వతాలైన హిమాలయాలు కూడా పెరుతున్నాయని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకు కారణం భూమి పొరలలో ఫలకాల మధ్య ఏర్పడుతున్న వ్యత్యాసం మరియు వత్తిడి అందుకు కారణం. మరి ఇక్కడ ప్రస్తుతం ఈ ఏకశిలా విగ్రహం అయిన నంది పెరుగుటకు మరి ఆ విగ్రహం అడుగున భూమిలో ఏమి జరుగుతున్నదో శాస్త్రవేత్తలే చెప్పాలి.

సాధారణంగా రాయలసీమ లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడి పుష్కరిణిలో మాత్రం నీరు పుష్కలంగా ఉండి స్వామి వారిని దర్శించే భక్తులకు దాహార్తిని తీరుస్తున్నాయి.

uma-maheswara-temple

మరొక విచిత్రం. సాధారణంగాకాకులు లేని ప్రదేశాలు ఉండవు. కానీ ఈ యాగంటి ప్రాంతంలో కాకులు మనకు అసలు కనపడవు. అగస్య మహాముని శాపం వలన ఇక్కడ కాకులు సంచరించవని తద్వారా కాకి వాహనంగా ఉన్న శనైశ్చరుఁడు కూడా ఇక్కడ నివసించడని భక్తుల నమ్మకం. బహుశా కాకులను దూరంగా ఉంచే వృక్షం ఏమైనా ఈ ప్రాంతంలో ఉందేమో.

uma-maheswara-temple

 

Highway – the only way !, Tripadvisor, Go Tirupathi, Holidify, Wikimedia

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అభిమానవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా చెడ్డపనులు చేయడు – భర్తృహరి