అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

రాధమ్మ ఇల్లుచేరే సరికి బయటికే చంటిపిల్ల ఏడుపు గట్టిగా వినిపిస్తోంది. చెదిరిన మనసును చిక్కబట్టుకుని, కంగారుగా ఇంట్లో ప్రవేశించింది రాధమ్మ. అప్పటికే ఎడపిల్లాడు నానీ, మునివేళ్లపై లేచి, చెల్లెల్ని ఉయ్యాలలోంచి దింపే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎల్లమ్మ ఇదేమీ పట్టించుకునే దశలో లేదు. ఆమె విపరీతమైన జ్వరం వల్ల వచ్చిన మగతలో ఏమేమో కలవరిస్తూ, బాహ్యస్మృతి లేకుండా ఒళ్లెరుగని స్థితిలో పడి ఉంది. ఇల్లుచేరిన రాధమ్మ బిడ్డల్ని అక్కున చేర్చుకుని భోరున ఏడిచింది. ఎందుకో తెలియకపోయినా, తల్లి ఏడుస్తోందని వాళ్ళూ ఏడవసాగారు పిల్లలు కూడా. కానీ, వాళ్ళని పట్టించుకునే వారెవరూ లేకపోయారు.

"నాయనా, కన్నయ్యా! వచ్చేస్తన్నా ఆగరా..." అంటూ కలవరిస్తోంది ఎల్లమ్మ.

పిల్లల్ని వదలి ఆమెదగ్గరకు పరుగెత్తింది రాధమ్మ. నెమ్మదిగా ఆమెను లేవదీసి కాసిని మంచినీళ్లు తాగించి, మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది రాధమ్మ.

ఎల్లమ్మ కళ్లుతెరిచి చూసింది. "రాదమ్మా! ఏంటా ఓరు" అని అడిగింది.

రాధమ్మ పొంగివస్తున్న ఏడుపుని బలవంతంగా బిగబట్టి, "గాలి హోరు అత్తమ్మా! చినికి చినికి గాలివానవుతుందేమోనని భయంగా ఉంది! కొంచెం సేపు పడుకో, గంజికాచి తెస్తాను" అంది.

"ఇటుమంటి సమయంలో ఎవరూ సముద్దరం మీదకి పోకూడదు. సముద్దరం బలికోరుతుంది. రాదమ్మా! కన్నయ్య ఎక్కడ?" కొడుకు జాడ కోసరం వెతుకుతున్నట్లు గా నాలుగువైపులా చూపుతిప్పి చూస్తూ అడిగింది ఎల్లమ్మ.

రాధమ్మ గుండె బద్దలయింది. కానీ, మళ్ళీ అంతలోనే మనసు సరిపెట్టుకుంది.

ఆమె ఆశ పూర్తిగా చావలేదు. ఏమో! ఏక్షణంలోనైనా కన్నయ్య రావచ్చు - అదే ఆమె కోరిక. వేటకు సముద్రం మీదకు వెళ్లాడని చెప్పి పెద్దామెను భయపెట్టడం ఎందుకని మనసు చిక్కబట్టుకుని ఆమెకు అబద్దం చెప్పింది. "పనుంది ఊళ్లోకి వెళ్ళాడు అత్తమ్మ! త్వరగానే వచ్చేస్తాడు" అంది.

ఆ ముసలితల్లి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమెకు దుప్పటీ సరిజేసి గంజికాచే పనిమీద వెల్లింది రాధమ్మ. అత్తమ్మ కళ్ళు తెరిచింది, ఇక ఆమెకు నయమై పోతుంది - అని భ్రమటిపడింది, అది చావు తెలివని గుర్తించలేని రాధమ్మ.
ఖాళీగా ఉన్న డబ్బాలు ఆమెను వెక్కిరించాయి. ఒక మూలనున్న పిడతలో కాసిని నూకలు కనిపిస్తే, వాటిని బాగుచేసి, పొయ్యెక్కించి జావకాచింది రాధమ్మ. బెల్లపు డబ్బాలో మిగిలి ఉన్న బెల్లం కాస్తా అందులో కలిపి, ఆ కొంచెం మూడు భాగాలుగా చేసి, పిల్లలిద్దరికీ చెరో కాస్తా పట్టించి, మూడవగ్లాసు తీసుకుని ఎల్లమ్మదగ్గరకు నడిచింది రాధమ్మ. కడుపు దుఃఖంతో నిండి ఉండడంతో ఆమెకు ఆకలనిపించలేదు.

కళ్ళు మూసుకుని పడుకుని ఉంది ఎల్లమ్మ. రాధమ్మ మంచం పట్టీమీద కూర్చుని, ఎల్లమ్మని మెల్లిగా తన ఒడిలోకి తీసుకుని, నెమ్మదిగా చెంచాతో జావ తీసి ఆమెచేత తాగించే ప్రయత్నం చేసింది. కానీ ఎల్లమ్మకు అది మింగుడుపడలేదు, చెలవుల వెంట కారిపోయిందది. మరు క్షణంలో కళ్ళు తేలవేసింది ఆమె. చూస్తూoడగానే రాధమ్మ ఒడిలో ఆమె ప్రాణవాయువు అనంత వాయువులో కలిసిపోయింది.

రాధమ్మ బేజారై పోయింది. ఆమెకు దిక్కు తోచలేదు. ఈ ఆపద గడిచి గట్టెక్కే విధం ఏమిటో ఆమెకు ఎంత ఆలోచించినా స్ఫూరించలేదు. ఏడుస్తూ, ఎల్లమ్మని మంచంపైన పడుకోబెట్టి, నిండుగా దుప్పటి కప్పింది రాధమ్మ. ఆపైన ఆమెకు ఏ కర్మలు చెయ్యాలన్నా కొడుకు కన్నయ్య రావాలి.

"కన్నయ్యా! ఎక్కడున్నావు? తొందరగా రా" అంటూ ఆక్రోశించింది రాధమ్మ మనసు. కానీ ఏ మూలో ఇక కన్నయ్య రాడన్న భావం ఎంత అణచిపెట్టాలన్నా అణగకుండా తన్నుకు వస్తోంది. తనకు ప్రాణాధికుడైన కన్నయ్య, మరి రాడు - అని అనుకోలేకుండా ఉంది ఆమె.

ఈ వాన కొద్దిసేపటిలో గాలివానగా మారనుంది - అనుకుంది రాధమ్మ గాలి వేస్తున్న ఊళలు వింటూ. ఇలా ప్రకృతి ఎదురుతిరిగిన వేళలో, ఎంత చెయ్యి తిరిగిన జాలరి అయినా నెగ్గించుకు రాలేడన్నది ఆమెకు తెలుసు. అయినా కన్నయ్య ఇకరాడు, మరి లేడు - అని ఆమె అనుకోలేక పోతోoది. ఏ క్షణంలోనైనా కునికిపోయే కొడిగట్టిన దీప కలికలా మినుకు, మిణుకుమంటోoది ఆమె ఆశ.

విపరీతమైన మనస్తాపంవల్ల ఆమె మనసు మూగబోయింది.

"మళ్ళీ భోజనాళవేళ అయితే పిల్లలకు ఏం తినిపించాలి? తనలాగా పసివాళ్లు కష్టాలతో కడుపు నింపుకోలేరుకదా!" అన్న ఆలోచన వచ్చింది ఆమెకు అదాటుగా. ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. దిక్కుతోచక తల్లడిల్లిపోతొంది.
కన్నయ్య లేకుండా చనిపోయిన తన అత్తగారికి అంత్యక్రియలు జరిపించడం ఎలాగ? ఇటువంటి పరిస్థితిలో తను ఇప్పుడేం చెయ్యాలి - అన్నది ఒక ప్రశ్నగా మారింది ఆమెకు. వెలివల్ల తమకు ఎవరి సహాయం దొరకదు కదా! "హే భగవాన్!" అనుకుంది రాధమ్మ అసహాయురాలై.

#         #            #

కలెక్టర్ ఆఫీసునుండి వచ్చిన వ్యక్తి బెస్తవాడలో ప్రమాద సూచిక ఎగురవేసి, ఈ వాన గాలివాన ఔతుందనీ, రాత్రికి తాడి ప్రమాణమున్న ఉప్పుకెరటం రావచ్చుననీ, శీఘ్రం బెస్తవాడ ఖాళీచేసి, సురక్షిత ప్రాంతాలకి తరలివెళ్లి, ప్రాణాలు దక్కించుకోవలసి ఉంటుందనీ హెచ్చరించి వెళ్ళాడు. రేడియోలు కూడా అదే విషయాన్ని ఎడతెగకుండా ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి.

బెస్తవాడలో అలజడి మొదలయింది. ఈదురు గాలి వీస్తూన్నా, జడివాన కురుస్తూన్నా కూడా, ఎవరికివారే మొయ్యగలిగినంత సామానుని మోసుకుంటూ, పెళ్ళాం బిడ్డల్ని వెంటతీసుకుని, తగిన చోటును వెతుక్కుoటూ వెళ్లిపోతున్నారు. భోరున కురిసే వానలో తడిసి ముద్దవుతున్నా, ఎముకలు కొరికే చలి గడగడా వణికిస్తున్నప్పటికీ, రయ్యిరయ్యిన వీస్తున్నగాలి నిలిచిన చోట నిలువనీకుండా ఎగరగొడుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదు. అలాగే పడుతూ, లేస్తూ, సురక్షితప్రాంతాలను చేరుకోవాలని  తొందరపడుతూ పరుగులుపెడుతున్నారు ప్రాణభయంతో.

షావుకారు గవురయ్య తన అత్తవారింటికి రెండెడ్ల బండిని పంపాడు, వెంటనే బయలుదేరి వచ్చి, మెరక ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ఆపద గడిచేవరకూ ఉండి వెళ్లమని కబురుపెట్టాడు. బండితోపాటుగా తానూ వచ్చిoది చుక్క. లోగుమ్మంలో పిల్లల నెట్టుకుని, దిగులుగా కూర్చునివున్న రాధమ్మను చూసి, గమ్మున బండి దూకి, "ఏందిది రాదమ్మా! ఏంటి అలా ఉన్నావు? ఏటైనాది" అంటూ దగ్గరగా వచ్చింది.

విపరీతమైన మనో వేదనతో, ఒంటరితనంతో రగిలిపోతున్న రాధమ్మ మనసు, ఆత్మీయమైన చుక్క పలకరింపుతో రవంత ఊరటపొందింది. అంతవరకూ అణచి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకున్న వరద గోదావరి ఐపోయింది. చుక్కను కౌగిలించుకుని భోరున ఏడిచింది రాధమ్మ. ఏడుస్తూనే తాను తెల్లవారుఝామున, చీకటుండగా తుమ్మలబీడు వైపుగా వెళ్ళినప్పుడు ఆ పాపిష్టి భేతాళుడు తనకు చేసిన అవమానo, వాడికి వచ్చిన ఆపద మొత్తమంతా ఏకరువు పెట్టింది. కానీ, తాను తుమ్మల బీడు వైపుకి ఆ సమయంలో ఎందుకు వెల్లిందో, ఆదిమాత్రం చెప్పలేదు. దాంతో, చుక్క వేరేగా అర్థం చేసుకుంది.

"ఆ పాపాత్ముని చెయ్యి నన్ను తాకింది. నేను మైలబడ్డాను. చుక్కా! కుక్కముట్టుకున్న కుడుము నైవేద్యానికి పనికిరాదు, కదూ!"

"అలా ఎందుకనుకోవాలి రాదమ్మా! నువ్వు మనిషివి, కుడుమువి కావు. అందులోనూ నీ తప్పేముందని నీకు శిఛ్చ పడాలా? పడాల్సినోడికి పడిందిగందా, సాలు. అయినా అయన్నీ ఆలోసించే టయం లేదిప్పుడు, మనం బే.గే ఈ సోటు ఇడిసి పోవాల. ఓ రేత్తిరికాడ ఉప్పెన వస్తాదంట! కన్నయ్యెక్కడ?"

"ఉప్పెన" అన్నమాట వినగానే రాధమ్మకు ప్రాణం కడంటిపోయినట్లైయింది. ఉందా లేదా తెలియని విధంగా మిణుకుమిణుకుమనే రవంత ఆశ కూడా కునికిపోయింది. ‘కన్నయ్య ఇకరాడు’, అన్న నిశ్చయానికి వచ్చేసింది రాధమ్మ. గుండెలు రగిలించే ఆవేదనని గుండెల్లోనే తొక్కిపెట్టి, గుండెని బండగా మార్చుకుంది. ఆమె మనసు భవిష్యత్తుని గురించి తీవ్రంగా ఆలోచించి ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చిoది. "కన్నయ్య లేనిదే రాధమ్మలేదు. ఇక కొద్దిసేపట్లో నాకీ బాధనుండి విముక్తి దొరుకుతుంది." అనుకుంది.

"కన్నయ్య ఎక్కడ, రాదమ్మా?" మళ్ళీ అడిగింది చుక్క.

అసలు విషయం చుక్కకు చెప్పి ఆమెను ఇప్పుడే బాధపెట్టడం ఎందుకు, తరవాత ఎలాగూ తెలియకపోదు - అనుకున్న రాధమ్మ మాట మార్చే ప్రయత్నం చేసింది, "చుక్కా! మాకు వెలి ఉందికదా, నువ్విలా నాతో మాటాడ్డం ఎవరైనా చూస్తే మీకూ "వెలి" పడుతుందేమో" అంది.

చుక్క తలెత్తి రాధమ్మ మొహంలోకి సూటిగా చూసింది, "ఎలేస్తారా! మమ్మలనా? సావుకారు గవురయ్య కుటుంబాన్ని ఎలేసే మొనగాడు ఈ బెస్తవాడలో ఇంకా పుట్టలేదు. నాలుగు డబ్బులు ఎక్కువుంటేసాను, అన్నీ ఉన్నట్టే" అంది చుక్క మూతి విరిచి హేళనగా, "ఆ సూత్తరం మా నాన్నకు తెలిసినంత బాగా మరెవరికీ తెలవదు. ఆయబ్బి సేసిన నిరువోకానికి కడుపు పండక నానేడుస్తుంటే ఇప్పుడు మా అయ్య, నాపెళ్ళికి ఓలిగా తీసుకున్న ఏటపడవ కాడ కూకుని ఈతలికి బోరున ఏడుస్తా ఉండి ఉంటాడు - సూత్తా సూత్తా దాన్ని ఒగ్గేయ్యనూలేడు, అలాగని తనతోపాటుగా మోసుకు పోనూలేడు గందా! ఈ రాత్తిరి గడిసిపోయి రేపు తెల్లారేతలికి ఇక్కడంతా డొల్లే! ఇసక తప్ప మరేమీ మిగలదు ."

రాధమ్మ ఒళ్ళు ఝల్లుమంది. "నిజంగా ఈ రాత్రికి ఉప్పుకెరటం వస్తుందంటావా" భయం భయంగా అడిగింది.

"రాత్తిరికి కాదు రాదమ్మా! సందలడే ఏలకైనా రావచ్చు. బద్రంగుండమని రేడియోలు ఆరిసరిసి సెవుతున్నాయి. అందుకే మంది ఊరొదిలి ఎలిపోతున్నారు. రాధమ్మా, మీరుకూడా బేగె బయలెల్లడం మంచిదౌద్ది. ఎల్లమ్మత్త నడలేదు. ఆ యమ్మిని బండెక్కిద్దారి, లెగు రాదమ్మా" అంటూ రాధమ్మ చేతిలోని పిల్లను అందుకుంది చుక్క. కొత్త తెలియని జానకీపాప చనువుగా ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె మెడలోని బంగారు గొలుసుతో ఆడుకోసాగింది.

"చుక్కా! నీ ఋణం తీర్చుకోలేనిది. మంచిసమయానికి వచ్చి చెప్పావు. లేకపోతే ఉప్పెన సంగతి మాకు తెలిసేదేకాదు. ముందుగా పిల్లల్ని నీతో తీసుకెళ్ళు, చాలు. మేము ముగ్గురం వెనకాల వస్తాము సామాను తీసుకుని."

"అదేంటి రాదమ్మా! అందరం కలిసే పోదాం. బేగ్ తెములు."

"కన్నయ్య ఇంట్లో లేడు కదా! ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. రాగానే మేమూ బయలుదేరుతాము" అంది రాధమ్మ. రేపు తెల్లారేసరికి అసలు సంగతి అందరికీ ఎలాగూ తెలిసిపోతుంది. ఇప్పటినుండే చెప్పి చుక్కని బాధపెట్టడం ఎందుకనుకుంది రాధమ్మ.

పిల్లని చంకనెత్తుకుని, ఒకచేత్తో పిల్లవాడి చెయ్యి పట్టుకుని తన ఎదుట నిలబడ్డ చుక్కని కళ్లారా చూసి మనసారా ఆశీర్వదించింది రాధమ్మ, మనసులోనే. సుఖ దుఃఖాలకు అతీతమైన ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది రాధమ్మ ...
మా బిడ్డల్లో ఒక బిడ్డను చుక్కకు పెంపిస్తానని కన్నయ్య ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇప్పుడు తాను రెండవ బిడ్డను కూడా ఆమెకే ధారాదత్తం చెయ్యబోతోoది. ఈ నాడు తాను, తన బిడ్డలిద్దరికీ మంచి భవిష్యత్తు నాశించి ఈ నిర్ణయం తీసుకుంది.  ఆమెకు పెంచుకోమని ఇద్దరినీ ఇచ్చేస్తోంది, కన్నయ్య పిల్లలకు అక్కడ ఏలోటూ రాదన్న నమ్మకంతో. ఈ ఆలోచన ఆమెకు ఊరటనిచ్చింది.

"అమ్మా! నువ్వు కూడా రాయే మాతో" అంటూ నాని తల్లి చెయ్యి పట్టుకున్నాడు.

తనచేయి పట్టుకున్న కొడుకు చేతిని ఎత్తి ముద్దుపెట్టుకుని, చుక్క చెయ్యి అందుకుని కొడుకు చెయ్యి ఆమె చేతిలో ఉంచింది  రాధమ్మ. "నాన్నా! మామ్మా, నేనూ, నాన్న సామాను తీసుకుని తరువాత వస్తాము. ముందు మీరు బండిమీద చిన్నమ్మతో కలిసి వెళ్ళండి" అంటూ కొడుకును బుజ్జగించి, నచ్చజెప్పింది రాధమ్మ. పిల్లల్ని ముద్దాడి, వీడ్కోలు చెప్పింది. ఆపై పక్కకి తప్పుకుని పిల్లలకి ఎడంగా నిలబడింది.

"ఈ గాలిలో, వానలో రాత్తిరి సీకట్లో మీరు ఆడంగు సేరాలంటే కష్టమౌద్ది. బేగే బయలెల్లండి. ఇదిగో రాదమ్మా! నీ బిడ్డలకే లోటూ రానీను. ఇన్నాళ్ళకి వీలు దొరికింది. అమ్మ యేసం కట్టి, నాముచ్చట తీర్చుకుంటా. నువ్వొచ్చి అడిగేవరకూ నేనే ఆళ్ళకి అమ్మను" అంది చుక్క సరదాగా.

పేలవంగా నవ్వింది రాధమ్మ. "వైద్యుడు పాలే పధ్యమన్నాడు, రోగీ పాలే కోరుకున్నాడు అన్నట్లైయింది మరి! నువ్వు వీళ్ళని నాకంటే బాగా చూసుకుంటావని, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది చుక్కా! అందుకే ధైర్యంగా వీళ్ళని నీకు అప్పగిస్తున్నా." అంది రాధమ్మ మనస్ఫూర్తిగా. అంతలో బండినిండా సామాను నింపుకుని వచ్చిన అచ్చమ్మ, "రాయే సుక్కా! ఏడనున్నవే" అంటూ దూరాన్నుoడే కేకపెట్టింది. తల్లి కేక విని, కంగారుగా రాధమ్మ దగ్గర సెలవు తీసుకుని, పిల్లల్ని వెంటతీసుకుని బయలుదేరింది చుక్క.

రాధమ్మ పిల్లల్ని కడసారంగా కళ్లజూసుకుంది. నాని నుద్దేశించి,"బాబూ, నానీ! చిన్నమ్మ చాలా మంచిది. ఆమెను విసిగించక బుద్ధిగా ఉండాలి. చెప్పిన మాట వినాలి. మీ నాన్నలాగే నువ్వూ అందరిచేతా మంచి వాడివనిపించుకోవాలి. చెల్లాయిని ఏడవనీకుండా జాగ్రత్తగా చూసుకుంటావుకదూ" అంది. అన్నింటికీ తలూపాడు నానీ "సరే" నన్నట్లుగా.

కురుస్తున్న వాన చినుకుల మధ్య, చుక్క కొంగు చాటున నక్కి బండి ఆగి ఉన్న చోటుకి వెడుతున్న పిల్లలవైపు చూస్తూ, గుమ్మంలో నిలబడిపోయిన రాధమ్మ, బండి బయలుదేరి కనుమరుగై పోయే వరకూ అక్కడే నిలబడి ఉండి పోయింది.

 

(ముగింపు వచ్చే సంచికలో...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అభిమానవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా చెడ్డపనులు చేయడు – భర్తృహరి