Pakshula Prapancham


గత సంచిక తరువాయి »

కలివికోడి

Jerdon’s courser

మానవుని స్వార్ధానికి అనేక జంతుజాలాలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం పొంచి కూర్చునుంది. మానవుడు తన మనుగడను ఆకర్ష ణీయంగా, అందంగా, ఆనందంగా, శోభాయమానంగా తీర్చిదిద్దుకోను ఏమి చేయడానికైనా వెనుకాడడు. దానివల్ల అనేక పశు పక్ష్యాదులు అంతరించి పోతున్నాయి.

అలాంటి వాటి కోవలోకే వస్తుంది ఈ ‘కలివి కోడి’. ఇది చాలా అరుదైన పక్షి. కలివి కోడి ని మొదటిసారిగా కనుగొన్నవ్యక్తి ‘జెరాన్’ అనే ఆంగ్లేయుడు. అందుకే ఆయనపేర దీన్ని ‘జెర్డాన్ కోర్సర్’ అని అంటున్నారు. మన సంస్కృతి ప్రకారం అన్ని జీవులనూ కాపాడే భారత ప్రభుత్వ "అటవీ జంతు సంరక్షణ చట్టం 1972" కింద ఈ కలివి కోడి సంరక్షించబడింది. కానీ దీని మనుగడ మాత్రం ప్రశ్నార్థకం గానే మారింది.

Jerdon’s courser
కలివి పొదలు

ఈ కలివి కోడి పక్షిజాతి దైన మన పెంపుడు కోడి వలె నడవడం, పరుగెత్తడం తప్ప ఎగరడం సరిగా రాని  కారణాన చిన్న చిన్న ముళ్ల పొదల్లో నివాసం ఏర్పర్చుకుంటుంది. తమ రక్షణ కోసం ఈ పక్షులు ముళ్ళ పొదలనే నివాసాలుగా చేసుకున్నాయి. ‘కలివి’ అని పిలువబడే ముళ్ళ పొదల్లో వీటిని ఎక్కువగా చూడటం వలన ఆ ముళ్ళపొద పేరుతోనే దీన్ని‘కలివి కోడి’ అని పిలిచారు.

ఈ పక్షుల ప్రయాణం ఇంచుమించు కాలి నడకనే కావటాన, ముళ్ళ పొదలు లేని ప్రాంతాల్లో వీటి రక్షణ కూడా సవాలుగా మారింది.

ఈ పక్షుల ప్రధాన ఆహారం చెదపురుగులే. కలివి పొదలు గుట్టలుగా కొమ్మలు, ఆకులూ నేలను తాకుతూ ఉండటాన చెద పురుగులు వీటి క్రింద నివాసాలు ఏర్పర్చుకోడంవల్ల ఈ పక్షులు చెదలనే ఆహారంగా ఎంచుకున్నాయి. చెద పురుగులు మట్టి కట్టలు కట్టుకుని దాన్లో దాక్కు న్నా కలివి కోడి తన తీక్షణ దృష్టితో తన ఆహారాన్ని కనిపెట్టి విందు చేసుకుంటుంది. పగలంతా తన నివాసం లో పదిలంగా విశ్రాంతి తీసుకుని, 'కార్తీక మాసపు ఉపవాస దీక్షా!' అన్నట్లుగా పగలంతా నిరాహారంగా ఉండి రాత్రివేళల్లో ఆహారం కోసం వెతుకుతుంది. ఈ కలివి కోడి రెట్టను పరిశోధించిన శాస్త్రజ్ఞుల ఫలితాల ఆధారంగా వీటి ప్రధాన ఆహారం చెదలని నిరూపణ ఐంది.

Jerdon’s courserబొంబాయి ‘నేచురల్ హిస్టరీ సొసైటీ’కి చెందిన సీనియర్ పరిశోధకులైన ప్రకాశన్ జగన్నాధన్ ఈ కలివి కోడి అరుపును కూడా రికార్డ్ చేయ డం గొప్పవిషయమే. ఈ పక్షి అరుపు ‘ట్విక్ టూ – ట్విక్ టూ’ అనే విధంగా ఉంటుంది. కోయిలలా ఈ పక్షి నవంబరు నెలనుంచి మార్చి వరకూ రోజూ అర్ధ గంటైనా అలసట లేక అరుస్తూనే ఉంటుంది.

ఈ పక్షుల నివాసాలైన ముళ్ళ పొదలు, అడవుల నరకివేత కారణంగా నశించిపోవటాన వీటికి ఆవాస ప్రాంతాలు కరువై కనుమరుగై పోతున్నాయేమో అనుకోవలసి వస్తున్నది. మానవుని దృష్టి పడిందంటే ఏదైనా వింత ప్రాణి  మనుగడ మాత్రం కష్టమనే చెప్పక తప్పదు.

భారత ప్రభుత్వం మాత్రం తనవంతు గౌరవం ప్రకటిస్తూ కలివికోడి బొమ్మతో ఒక పోస్టల్ స్టాంపును విడుదలచేసి చేతులు దులిపేసుకుంది.

 

divider

Images Source1, Images Source2, Images Source 3

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అభిమానవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా చెడ్డపనులు చేయడు – భర్తృహరి