Katha

Post a Comment


రోజులాగే ఆ రోజు కూడా నిద్ర లేస్తూనే "కాఫీ" అంటూ కేకపెట్టా. కాని, నా కేక విని మరుక్షణంలోనే ఎదురుగా కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యే నా శ్రీమతి - అన్నపూర్ణ, ఎందుకనో ఆ రోజు ఎంతకీ రాలేదు. అది నాకు చాలా వింతగా అనిపించింది.

ఏ రోజునా ఆమె ఆ సరికి స్నానంచేసి, పూజ ముగించి నిండు ముస్తాబుతో పరిశుభ్రంగా వంటినిండా నగలతో పూచిన తంగేడులా కలకలలాడుతూ ఉండేది. ఆమె చెదిరే ముంగురులచాటునుండి తొంగిచూసే కుంకుమ బొట్టు చుస్తుంటే నాకు ఆకాశంలో మేఘాల మాటున దోబూచులాడే సూర్యబింబం గుర్తొస్తుంది. ఉషోదయం లాంటి కాంతితో వెలిగే నవ్వుముఖంతో ఆమె ప్రతిరోజూ నాకు ప్రకృతి కాంతలా నిండుగా అందంగా కనిపించేది. ఆమె అందించిన అమృతంలాంటి కాఫీ తాగి మరీ మంచం దిగడం నాకున్న గొప్ప అలవాటు. అందుకు భిన్నంగా జరిగిన రోజు నాకు నిజంగా దుర్దినమే! సందేహం వద్దు.

అన్నపూర్ణ నాకు ఇల్లాలై దగ్గర దగ్గరగా ఏభై సంవత్సరాలు కావస్తోంది. మా అబ్బాయిలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళై, పెద్ద చదువులు చదివి, ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడాలన్న ఉద్దేశంలో ఉన్నారు. మాకు నలుగురు మనుమలు కూడా ఉన్నారు. ఇంకా చిన్నవాళ్ళు. అప్పుడప్పుడు - మేము అక్కడికి, వాళ్ళు ఇక్కడికి రాకపోకలు జరుగుతూంటాయి. అందరం కలిసి ఉన్నప్పుడు మాకు దినం ఒక క్షణంలా గడిచిపోతుంది. పూర్ణకి మనుమలంటే ప్రాణం. వాళ్ళు దగ్గరలేనప్పుడు కూడా వాళ్ళ కబుర్లతోటే మా కాలక్షేపం. జీవన మలిసంధ్యలో పడ్డ మాకు బిడ్డలు, మనుమలు మా దగ్గరలో ఉండాలన్న ఆశ సహజం. వాళ్ళు దగ్గర లేకపోవడం ఒక లోపం.

### ### ###

వీధి తలుపుమీద ఎవరో దబదబా బాదుతున్నారు. కరెంట్ పోయి కాలింగ్ బెల్ మూగబోయింది కాబోలు. అన్నపూర్ణ తలుపు తెరుస్తుందని ఒక్క సెకను ఎదురుచూశా. తలుపు బాదుడు జోరు పెరగడంతో "ఈ రోజు అన్నపూర్ణకి ఏమయ్యింది" అన్న భావం మనస్సుని చురుక్కుమనిపించింది. తప్పనిసరిగా లేచి వెళ్లి తలుపు తీశా.

"దండాలండీ అయ్యగోరు! మన అమ్మగోరు ఊళ్ళో లేరాండి" అంటూ లోనికి వచ్చింది పనిమనిషి రత్తాలు. అలా అడుగుతూనే, అది నా సమాధానం కోసం చూడకుండా దొడ్డివైపుకి వెళ్ళిపోయింది. కాఫీ కడుపులో పడక బద్ధకం తీరకపోడంతో నేను మళ్ళీ మంచమెక్కేశా. మరుక్షణంలో వినిపించింది రత్తాలు పెట్టిన వెర్రికేక!

"అయ్యబాబోయ్! కొంప మునిగిపోనాదం డయ్యగారండోయ్" అంటూ రత్తాలు పెట్టిన వెర్రికేక వినిపించేసరికి నేను అదాటుగా లేచి కేక వినిపించిన వైపుగా పరుగుపెట్టాను. అక్కడ నాకు కనిపించిన దృశాన్ని చూసేసరికి భయంతో నాకు ఒళ్ళు తెలియలేదు ...

తులసికోట ముందు సగం సగంగా వేసిన ముగ్గు మధ్య అస్తవ్యస్తంగా, అచేతనంగా పడి ఉంది పూర్ణ. ఆమె పక్కనే చతికిలబడి కూర్చుని, ఆమెను బుజం పట్టి కుదుపుతూ, "లెగండి అమ్మగోరూ, లెగండమ్మా" అంటూ గోడుగోడున ఏడుస్తోంది రత్తాలు.

నాకంతా అర్థమైపోయింది. ఒక్కసారిగా నవనాడులు కృంగినట్లై చేష్టలుదక్కి ఉన్నచోటనే ఉన్నట్లుగా కుప్పకూలి చతికిలబడిపోయా. నా ఇంటి దీపం ఆరిపోయింది అన్నది అవగతమయ్యింది. నా ముఖం కత్తివేటుకి నెత్తురు బొట్టు లేనట్లుగా వెల్లబారిపోయింది.

నా స్థితి చూడగానే రత్తాలు కంగారు పడుతూ లేచి, పరుగున వెళ్లి ఇరుగుపొరుగులవారికి మా ఇంటి పరిస్థితిని తెలియజేసింది. వార్త అందగానే వచ్చివాలాడు నా ఆప్తమిత్రుడు, పొరుగువాడు ఐన రాంజీ భార్యతో సహా. వాళ్ళతో వాళ్ళ కోడలు సుగుణ కూడా వచ్చింది. ఇంకా కొందరు వచ్చారు. తులసికోట పక్కన చాప పరచి, అన్నపూర్ణను లేవదీసి, దానిపైన పడుకోబెట్టారు. కళ్ళు మూసుకుని పడుకునివున్న ఆమె ముఖం, నిదురపోతున్న పసిపాప ముఖంలా ప్రశాంతంగా ఉంది. నాకుమాత్రం మనసంతా అంతులేని అలజడి. నా హృదయo ఛిన్నాభిన్నమైపోతున్నట్లు ఒకటే ఆవేదన! గుండెలు పిండేసే దుఃఖం నన్ను పట్టి కుదిపేస్తోంది. నా అర్ధాంగి, నా ఇంటిదీపం, నా పూర్ణ  నాకిక లేదన్న భయంకరమైన నిజాన్ని నేను అమోదించలేకుండా ఉన్నాను.

కొద్దిసేపట్లో అన్నపూర్ణ మరణవార్త చాలామందికి చేరిపోయింది. తెలిసినవాళ్ళు ఒక్కొక్కళ్ళే రావడం మొదలుపెట్టారు. అందరూ తలోమాటా మాటాడుతూండడంతో సందడి మొదలయ్యింది.
"పరోపకారం" అంటే ప్రాణం పెట్టేది, మహా ఇల్లాలు! అందుకే ముత్తైదువగా సునాయాసంగా ఇట్టే వెళ్ళిపోయింది. దంపతులు ఇద్దరూ కన్నులపండువుగా, చక్కగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉండేవారు" అంటున్నారు ఎవరో.

ఆ మాటలు నాకు కోపం తెప్పించాయి. "పార్వతీ పరమేశ్వరులా! అదేం పోలిక? పార్వతి ఎప్పుడైనా శివుణ్ణి విడిచి వెళ్ళిందా ఇలా? పక్కన ఉండీ కూడా తృప్తిపడలేక ఏకంగా ఆయనలో అర్థభాగమై కూచుంది కదా పార్వతి" అనుకునేసరికి నా దుఃఖం ఉప్పెనలా పొంగింది.

"పెద్దవయసులో ఆయన కెంత కష్టం వచ్చింది, పాపం! సమయానికి పిల్లలుకూడా దగ్గరలేరు కదా" అంటూ నిట్టూర్చారు సానుభూతిపరులు.

"ఎంత పిల్లలు దగ్గరున్నా వాళ్ళు నా అన్నపూర్ణ సాటి ఔతారా ఏమిటి" అనుకున్నా మనసులో. మగపుట్టుక పుట్టడమంతటి ఘోరం మరేదీ లేదు. హృదయం నిండుగా దుఃఖం సుళ్ళు తిరుగుతూన్నా, మనసు బరువుతీరా, కళ్ళ కరువుతీరా ఏడవడం కూడా చేతకాని జన్మ ఇది! అక్కడ చేరినవారు, కొందరు పూర్ణ ఔదార్యాన్ని, మరికొందరు ఆమె మంచితనాన్ని పొగుడుతుంటే, నేనుమాత్రం ఆమె నాకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ, పొడికళ్ళతో నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఒక పక్కగా చతికిలబడి కూర్చుని ఉండిపోయా.

### ### ###

క్రమంగా జనం సంభాషణ తదుపరి కార్యక్రమాల వైపు మళ్లింది. రాంజీ నా దగ్గరగావచ్చి నన్ను పొదివిపట్టుకుని నెమ్మదిగా అడిగాడు, "తరువాతి కార్యక్రమం ఏమిటి? పిల్లలు వచ్చేదాకా ఆగుదామా?"

నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని స్థితిలో నేనేం చెప్పగలను? కష్టపడి గొంతు పెగుల్చుకుని, "అంతా నీదే భారం, నాకేమీ తెలియడం లేదు" అన్నా గద్గదంగా. 

ఆ తరవాత, పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఫోన్ కాల్సు ఈ దుర్వార్తను మోసుకుని వెళ్ళాయి అమెరికా కొడుకులదగ్గరకి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చనిపోయిన తలిదండ్రులకు తలకొరివి పెట్టి, అపరకర్మలు జరిపించే హక్కు కొడుకులది. అంబులెన్సుకు కబురు పెట్టారు, కొడుకులు వచ్చేవరకు పూర్ణ పార్ధివదేహాన్ని తీసుకెళ్ళి మార్చురీలో ప్రిజర్వుచేసి ఉంచడానికని.

అంబులెన్సు పూర్ణ దేహాన్ని తీసుకు వెళ్లిపోతుంటే, ఎవరో బలాత్కారంగా నా దేహం నుండి నా ప్రాణాల్నే లాక్కుపోతున్నట్లుగా అనిపించి నా మనసు విలవిల లాడిపోయింది.

ఆ తరవాత ఒకరొకరు, సాంప్రదాయం ప్రకారం ఎవరికీ చెప్పకుండానే, ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాంజీ నన్ను బలవంతంగా చెయ్యిపట్టుకుని లేవదీసి, తీసుకెళ్ళి తలారా చన్నీళ్ళతో స్నానం చేయించి, పొడి బట్టలు  కట్టించి, తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు. రాంజీ భార్య ఒక ప్రమిదలో నూనిపోసి, వత్తి వేసి దీపం వెలిగించి, భూమిని వదిలి వెళ్ళిపోతున్న ఆత్మకు ప్రతీకగా, ఆ దీపాన్ని హాల్లో ఒక వారగా సుద్ధి చేసి ఆ దీపాన్ని అక్కడ ఉంఛింది. నెమ్మదిగా తెలిసినవాళ్ళు ఒకరొకరే పరామర్శకు రావడం మొదలుపెట్టారు.

### ### ###

మూడోరోజుకల్లా వచ్చి వాలారు మా అబ్బాయిలు తల్లికి అంత్యక్రియలు చెయ్యడంకోసం. హడావిడిగా రావడంవల్ల కుటుంబాలను వెంట తీసుకురాలేకపోయారుట. ఇమ్యునైజేషన్ ట్రీట్మెంట్ కి చాలినంత టైం లేక పిల్లలు, పిల్లలకోసం తల్లులు ఉండిపోవలసివచ్చిందని చెప్పారు.

వాళ్ళు రాగానే తల్లి అంత్యక్రియలు మొదలయ్యాయి. వెంటనే దహనం జరిగిపోయింది. ఐదవరోజు మొదలు, వాళ్ళు ముత్తైదువగా చనిపోయిన తల్లికి యధావిధిగా, వాళ్ళ స్టేటస్ కి తగినరీతిలో బ్రహ్మాండంగా కర్మకాండలు చెయ్యడం మొదలుపెట్టారు. అందులో నేనొక ప్రేక్షకుణ్ణయ్యా! ఇంట్లో పనుల విషయంలో ఆదుకునేందుకు ఆడమనిషి లేకపోవడంతో ఆ బాధ్యతలన్నీ తమపై వేసుకుని, సమర్ధతతో నిర్వహించారు రాంజీ భార్య, కోడలూను. కొడుకులు తల్లి పేరుమీద ఘనంగా మూసివాయనాలు పంచిపెట్టారు.

కర్మలు పూర్తికాగానే, చుట్టాలందరితోపాటుగా మా అబ్బాయిలు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. నన్నుకూడా తమతో తీసుకెళ్ళడం బాగుంటుందనుకున్నారు, కాని ఇక్కడి లావాదేవీలు చక్కబెట్టుకోడం, వీసా తీసుకోడం లాంటివి  తరవాయుండడంతో కుదరలేదు. అన్నీ చక్కబెట్టుకుని రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.

అన్నపూర్ణ కర్మకాండలకు వచ్చినవాళ్ళంతా వెళ్ళిపోవడంతో లంకంత కొంపలో ఒంటరిగా మిగిలిపోయాను. నా మనసులాగే ఇల్లుకూడా, అన్నపూర్ణ లేకపోడంతో శూన్యమై తోచింది. ఒక్కడినే, హాల్లో కూర్చుని నిస్సహాయంగా గది గోడల వంక చూస్తూ పొద్దుపుచ్చుతున్నా. బల్లమీద పడివున్న న్యూస్ పేపరు కూడా నా దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. అప్పుడు వచ్చాడు రాంజీ దేవుడిలా !

వస్తూనే, "శివా! నక్షత్రం మంచిది కాదుట, ఇల్లు ఆరు నెలలు వాడకానికి పనికిరాదుట, నువ్విక్కడ ఉండకూడదు, మా ఇంటికిరా. నీకు వీసా వచ్చేవరకు నీ మకాం అక్కడే. నువ్వూ మాలో ఒకడివిగా ఉందువుగాని. కాదంటే ఒప్పుకోనని చెప్పమంది నీ చెల్లెలు" అన్నాడు రాంజీ నా చెయ్యి పట్టుకుని.

"ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ..... !" రాంజీకి ధన్యవాదాలు. బహుశః, నేనే కనక మా ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయి ఉంటే; మతి పోయి, నేను పిచ్చివాడిగా మారిపోయీ వాడినేమో!

### ### ###

నా ప్రియమిత్రుడు రాంజీ! అతనిది ఒక మధ్యతరగతి సమిష్టి కుటుంబం. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అల్లుడికి ఆ ఊరిలోనే ఉద్యోగం కావడంతో వాళ్ళు కూడా ఇక్కడే - వీళ్ళతోటే కలిసి ఉంటున్నారు. ఆ తాతలనాటి పాత పెంకుటింట్లో కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, పిల్లలు - అందరితో కలిసి ఉంటారు రాంజీ దంపతులు. మొన్నమొన్నటి వరకు రాంజీ తల్లిదండ్రులు కూడా అందులోనే ఉండేవారు. వయసు ఉడిగి ఈమధ్యనే వారు కాలధర్మం చెందారు. వారి మరణంతో తరం మారింది. అక్కడితో ఆ సమిష్టి కుటుంబ బాధ్యతను పెద్దకొడుక్కీ, పెద్దకోడలు సుగుణకీ అప్పగించి విశ్రాంతిగా ఉంటున్నారు రాంజీ దంపతులు.

రాంజీ ఇల్లంతా ఆడీపాడే చిన్న పిల్లలతో బహు సందడిగా ఉంది. ఆ ఇంట్లో ఒక గది నా కోసం కేటాయించబడింది. పెద్ద సంపన్నులు కాకపోయినా ఆ ఇంట్లో సుఖ సంతోషాలకున్న ప్రాముఖ్యం గొప్పది. దేనికి లోటు ఉన్నా సంతృప్తికి మాత్రం లోటులేదు అనిపించింది. కలకలలాడుతూ సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఉండడంతో నాకు త్వరలోనే కొంత ప్రశాంతత దొరికినట్లయ్యింది. అందరికీ ప్రదర్శించకుండా, గుండెల్ని కోసే దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని నవ్వడం నాకు చేతనయ్యింది.  రాంజీ సాయంతో తొందరగానే పనులు పూర్తయ్యాయి. వీసా కూడా వచ్చేసింది.

(వారపత్రిక "ఈవారం" జనవరి 16 to 22 , 2011 సంచికలో ప్రచురించబడింది. ఆ తరువాత కలికి కథల్లో...)

*** సశేషం ***

 

divider

 

కామెంట్స్ పోస్ట్ చేయుటకు సూచనలు

మొదటగా, “Start the discussion…” అని వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మీరు రాయదలచుకున్న కామెంట్ రాయండి. తరువాత, “Name” అని రాసి వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు “I'd rather post as a guest” అనే బాక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే... మీరు ఏ విధమైన login అవసరం లేకుండా, కామెంట్ పోస్ట్ చేయవచ్చు! మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా లేదా ఏదైనా సందేహాలున్నా, మాకు editor@sirimalle.com ద్వారా తెలియజేయండి.


ఆశ లేని వాడికి అడవైనా ఇల్లైనా ఒకటే – బాలరామాయణం

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)