Sahiti Sirikona

Post a Comment


“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018, గాంధీజయంతి నాడు ప్రారంభమైన తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః).

ప్రారంభించిన వారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ఆం. ప్ర., ప్రస్తుతం ఫ్రీమాంట్ నగర వాసి. అదే ప్రాంతంలోని సాహిత్య ప్రియులు శ్రీ వేణు ఆసూరి, ఉభయభాషావధాని, శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గార్లు కార్యనిర్వాహకులు.

ప్రారంభమైన వేళావిశేషమేమిటో కానీ, ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు, విమర్శకులు అద్భుతమైన రచనలతో సంచికను పరిపుష్టం చేస్తున్నారు... వారంరోజుల్లోనే ఒక మంచి సాహిత్య పత్రికగా రూపొందింది..

అందులోంచి ప్రతినెలా ఏర్చి, కూర్చిన రచనలను ‘సిరిమల్లె’ పాఠకులకు అందించాలని సంకల్పించాం...మొదటగా అక్టోబర్ నెలలోని ఆణిముత్యాలు...ఆయా రచయితల అనుమతితో....మీకోసం .....

చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.


డా. కాసుల లింగారెడ్డి

అతనేం చేసిండు?

అతనేం చేసిండు?

కుమ్మరి సారె మీద
మట్టికి ప్రాణం పోసి మహాద్భుతం చేసినట్టు
అక్షరాలకు నగిషీలు దిద్ది
సృజనను సాహితీ వీధుల్ల ఊరేగించిండు
జనారణ్యంల రాజ్యం పులినుంచి రక్షించేందుకు
అమాయకపు గొర్రెలకు తిరుగబడు దిక్కులు చూపిండు
నీరసించిన తరగతి గదులకు
కొస్సెగ పెన్సిల్లు చెక్కుడు నేర్పిండు
అతనేం చేసిండు?

హక్కులుడిగిన ఆదివాసీలకు
నినాద స్వరమిచ్చిండు
అణగారిన సమూహాలకు
పోరాట పిడికిలిచ్చిండు
ధిక్కార కలాల గుండెలల్ల
మండుతున్న సిరాగ మారిండు
అతనేం చేసిండు?

అడవిల ఆయుధాన్ని నువ్వు మసి చేస్తే
కొత్త అనల రవ్వై రగులుకున్నడు
నదిల,  నీళ్ళకు బదులు నువ్వు శవాల్ని పారిస్తే
దు:ఖపు నదై పొగిలిండు
నోరుతెరిచిన జైలు గుండె గొంతుల
కల్లోల సముద్రమై కలవరపెట్టిండు
అతనేం చేసిండు?

కేసులు బనాయించేవాడికే
కుట్రలు చేయడం తెలుస్తుంది
నీ సికిందరాబాదు చీకి
నాని నశించిన తీరు తెలుసు కదా
నీ రామ్‌నగర్‌ రూపం పోయి
నాలుక కరుచుకొని వాతలు తేల్చుకుంది కదా
మరి, అతనేం చేసిండు?

పారిస్‌ కమ్యూన్‌ పాటకు రాగం కట్టిండు
అక్టోబర్ మహావిప్లవంతో అడుగులు కదిపిండు
జనచైనా జైత్రయాత్రకు జేజేలు పలికిండు

వసంత మేఘ గర్జనలో తడిసి
పచ్చదనమై విస్తరించిన అడవిని
నెలబాలుడై ఆర్తితో అలుముకున్నడు

నిండు కలల సింగిడిని దింపి
నేల మీద పరిచిండు

అతనేం చేస్తుండా?

అతనిప్పుడు,
గాలికి ఝుంఝూతం నేర్పుతుండు
అలకు అడుగులు నేర్పుతుండు
ఇల్లును జైలు చేసిన నీ వ్యూహంల
అభిమన్యుడై భవిష్యత్‌ చిత్రపటానికి
కొత్త రంగులు వేస్తుండు.

 

సురేంద్ర నాగరాజు (ఎలనాగ)

'కంద'స్మితాలు

1. పెళ్ళాము చేతివంటను 
మళ్ళీ ఒకసారి మింగి మనలేనంటూ, 
ముల్లే మూటా సర్దుకు 
వెళ్ళాడొక భర్త ఊరి వెలుపలి బాటన్

మనవి: సోదరీమణులు నన్ను  మన్నించాలి.
ఈ పద్యాన్ని రాసినందుకు దేవుడు నాకు సరైన శిక్షనే వేశాడు. దాని ఫలితంగా నాలుగైదేళ్ల పాటు నేను సంగా రెడ్డిలో ఒంటరిగా ఉంటూ హోటలు కూడు తినాల్సి వచ్చింది! 

2. సిగరెట్టు మాననెంచిన 
మగరాయుడి నొకని చూడ మనసుకు బాధౌ;
వగ చెంది వంద మారులు 
పొగ పీల్చుట మాని యతడు పొందెను తృప్తిన్!

3. షోకులు మానని భార్యను, 
పోకిరి వెధవైన సుతుని, పోరెడి పుత్రిన్ 
ఏకముగా గొంతు పిసికి 
దూకెను తను గంగలోన దుఃఖము తోడన్ 

4. కాకిని యెంగిలి చేతితొ 
తాకని పిసినారి యొకడు దాచగ ధనమున్,
మూకగ దొంగలు దోచిరి,
ఆ కతమున అపుడు లోభి యసువులు వీడెన్ 

5. రోజొక్క 'షో' ను చూసెడి 
పోజుల రాయుళ్ల యింట పూటకు యెన్నో 
పూజలు హీరోలకు! ఆ 
మోజన్నది వారికెంతొ మోక్షము  నొసగున్
           (నా 'వాగంకురాలు' నుండి)

6. సన్ డే నైటున ఫ్రెండుతొ 
చెండాలపు పాటలున్న చిత్రము చూస్తే,
పండేందుకు వీలెక్కడ? 
ఉండును తలనొప్పి బాధ ఉదయము దాకా!

7. విందారగించ వచ్చిన 
బృందానికి హోస్టు భార్య పెట్టగ తిట్లే,
ముందీ తావును వదలా 
లందరమూ యనుచు వారు అరిగిరి యట్లే!

8. బడిలోని దుడుకు పిల్లల 
గడగడ లాడించునట్టి గణపతి శాస్త్రే,
పడకింట్లో తన భార్యను 
కడగంటితొ చూసి బెదురు కయ్యము వస్తే!

 

ఆచార్య గంగిశెట్టి ల.నా.

వెనక్కి వెళ్ళాలి

వచ్చిన చోటుకి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి
వెళ్లాల్సిన తారీఖు పత్రం సంతకానికి తలుపు తడుతోంది
ఆలస్యమైతే నీ 'తరీఖా' ఏమిటని నిలదీస్తుంది
దూరంగా సూఫీ గానం: ఉన్నవి రెండే, 'షరియా', 'తరిఖా' లని
షరియాకు లోబడే జీవితాన్ని గడిపేశాను
వింతల్ని చూస్తూ లోకం మ్యూజియాన్ని చుట్టేశాను
ఇక లోలో తరిఖాను సరిచూసుకోటమే తరువాయి,
గాలి ఓడలో ఎగిరి పోవటానికి షురువాయి
అక్కడైతే నాకంటూ ఏవీలేవు..
మరీ వెక్కిరించే ఒంటరితనం... వెనుకముందు ఎవరూ లేని  నిస్సహాయత భారం...
ఇక్కడంటే పిల్లలు, 'నా' అనుకొనే నా- మా లు..
చిరునామాల  అవసరం రాని  చిరు నా- మా లు...
ఆత్మ ప్రేమలు నిండిన 'వి'దేహ భూమిలో
అభిమానాలు, స్నేహాలూ అర్థాలు మార్చుకొంటున్నాయి
మనల్ని 'మనం'గా చూసే మనుష్యులు అరుదై పోతున్నారు
మనల్ని మనంగా భరించడానికి మన పిల్లలే మిగులుతున్నారు
ఇంత ప్రపంచం కదా అని పెద్దలు పెట్టిన నామానికి
శత, సహస్ర పర్యాయాలు కల్పించి
స్తోత్రావళి సృష్టించుకొని భజించడానికి,భజనచేయించుకోడానికి శ్రమిస్తే
కడకు నా నామమే వ్యుత్పత్తి అర్థాన్ని అడుగుతోంది
దాని సార్థక్యమేమిటా అని ప్రపంచం నిలదీస్తోంది
అన్ని నామాలకు అర్థం నిరుక్తిలోనట
అన్ని మాటలకు అర్ధం మౌనంలోనట
వయసు నేర్పిన పాఠమిది
ప్రపంచమిచ్చిన బహుమానమిది
స్నేహశీలీ! మళ్లీ గరుడుని రెక్కలమీద ఎక్కి కూర్చోడమెందుకు?
విష్ణు అంశ ఉందని విశ్వ విహారమెందుకు?
సహస్ర నామాల సిరీ,  నా-మా లో ఉందని తెలుసుకో
చిరునామా కోసం పెను ప్రాకులాట మానుకో
'చిరు'నామాను సిరి నా-మా గా మార్చుకో

 

డా.గాలి రాజేశ్వరి

మౌనం

నిజమే! మౌనాన్ని ఆశ్రయించా! మౌనినౌదామని! /మౌనం ఒకమంత్రమైంది, /మౌనంగా నన్నాక్రమించేసింది/నాకైతే మౌనంతో పని,/మౌనానికి నాతో ఏంపని!??/.....

మౌనమొక ఎడతెగని ధారావాహికం!/
ఎడతెరిపిలేని చేతనా ప్రవాహం/
మౌనం వెన్నంత మృదులం/ గట్టిపడ్డ హిమాచలం/

మౌనం లో మాత్రమే మనసు సేదతీరుతుంది/మౌనం లో శాంతి ,విశ్రాంతిగా చేరువౌతుంది /

మౌనంలో పిడుగు వినపడదు/మెరుపు కనపడదు/అక్కడ అవనీ ఆకాశం ఏకమౌతుంది /

మౌనంమాట్లాడుతుంది/ మనతో ఆట్లాడు తుంది, పోట్లాడుతుంది/దేన్నీ  పోనీయదు, మరోదాన్ని రానీయదు/

మౌనానికి ఇష్టం కంటే ప్రేమే ఎక్కువ/ఇష్టం పైపైన తేలిపోయే మేఘం/ప్రేమ మొలకెత్తించే బ్రతుకుభూమి సారం/

మౌనానికి మౌనమే అర్థమౌతుంది/రెండు మౌనాల ఏకత్వమే ఆనంద లాస్యం/ మౌనం ఓ కళ,ఓదార్పు!/

మసిలే మనసు పైన మంచుమంట మౌనం/మలిసంధ్యలో మసకబారే కిరణాల పంటమౌనం....

 

దివాకర్ల రాజేశ్వరి

గాలి రెక్కల ఉట్టి

అమ్మకు లేదు కొరత
తినడానికి కావలసినంత
ఉండడానికి ఇల్లు లంకంత.
విరిసిన పూలు కిటికీలోంచి పరిమళాన్ని వెదజల్లుతాయి కొంత.
వంటిట్లోంచి పనిమనిషి చేస్తుంటుంది గిన్నెల చప్పుడు విన్నంత.
దూరవాణి సంఖ్యతో సరకులు వచ్చి వాలుతుంటాయి కావలసినంత.
కొంతసేపు ఇంటి ముందుకు అమ్మకానికొచ్చిన
కూరల బండివాడితో బేరమాడుతుంది కొన్నంత.
పిలుపుల గంట మోగుతూనే ఉంటుంది తాపత్రయానికి సరిపోయినంత.
కొడుకు చికాగో
కూతురున్నది శాండియాగో,
ఒంటరితనమని అనుకోదు,
అంతర్జాలం గూళ్ళు అనంతం చూసినంత.
ముఖపుస్తకంలో బొటన వేలు చూపిస్తుంది ఇష్టాల పుంత
జాలాడితే గూగుల్ సమాచారం కొండంత
ఎలా గడుపుతున్నారని అడుగుతారు,
యోగ క్షేమాలను కనుక్కుంటారు.
సమయం జీవిత పుటలను తిరగేస్తుంటే
పరుషాక్షరాలను చక్కదిద్దుకుంది అమ్మ.
ఇప్పుడు సరళమైన  మనసుతో
జీవిత సంధిని చేకూర్చుకుంటుంది.
ఆశల కడలిని చిలికి
కన్న కలల ఉన్నతికి,
కరిగిపోని వెన్న ముద్దలనుగాలి రెక్కల ఉట్టికి కట్టి పంపింది
రాగి నాణాల చిల్లర పొదుపు కాలంలో
తూకానికందని విలువలను
దాచుకుంది అమ్మ.
మాతో ఉండమ్మా
అంటున్న పిల్లల మాటను దాట వేస్తుంది.
భూమి దూరాన్ని కరింగిచే నక్షత్రాల ఉదయంలో
ముద్దుమాటలమనుమరాలిని
తనివి తీరా యెత్తుకుని లాలించలేని
ఉత్తచేతులు వెనక్కి పోతుంటే ఆరాట పడుతుంది.
పాదలేపనం రాసుకుని
హిమగిరి యాత్రకు దిగిన ప్రవరుడు
అక్కడి పరిసర లావణ్యాలకు,
ద్రాక్షా గుళుచ్ఛాల మరంద భ్రమర నాదాలకు
తానెంతగా ప్రమత్తుడైనా
పద్ధతి నియమాచరణను మరువక
 తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరాలని పరితపించినట్లు
యిక్కడి మట్టి వాసనలను వంటికి పూసుకున్న అమ్మ
గట్టి మనసును చేసుకుంటుంది.
అమెరికాను  చుట్టి రావాలని యెంతగా అనుకున్నా
ఆయాసమన్నది లేక ఇట్టే
ఇంటికి తిరిగి రావాలని అనుకుంటుంది.
వయసు పిల్లి ముసలిదయింది కనుక
కిటికీలోంచి దూకి పోలేక
దొంగలా పట్టుబడుతుంది.

 

ప్రొఫెసర్. శనగవరపు కృష్ణ మూర్తి శాస్త్రి ఎం.డి.


పొగల కేళి - దృశ్య రూపకం

ఆత్మీయ సందేశం
చిన్నప్పుడు

సరదా సరదా సిగరెట్టంటే -
సినిమా పాటలు పాడేస్తుంటే
బడికేమో ఎగనామం బెట్టి-
బడుధ్ధాయితో నేస్తం గట్టి  -
గుడి వెనక్కు చక్కగ వెళ్ళి-
గట్టిగ సిగరెట్టెలిగించా

అమ్మ ఇచ్చిన గారాబంతో -
నాన్న పంచిన అనురాగంతో-
పొత్తాలంటూ డబ్బులు గుంజి-
ఫీజులు అంటూ డబ్బులు గుంజి  -
జేబులొ డబ్బులు కొట్టేస్తు -
ఎంతో హాయిగ పొగలొదిలా

అమ్మ  నాన్నల జాగ్రత్తలతో -
డబ్బులు దొరుకుట మానేస్తుంటే-
ఎంగిలి ముక్కలె నేస్తం అంటే -
అందులొ సుఖము నాకుంటే  -
దొరికిన ముక్కలె వెలిగించి-
హీరోలాగా పొగలను వదిలా

బళ్ళో పెట్టిన పరీక్షలలో-
జవాబు తెలియని ప్రశ్నలు వస్తే  -
నాలో టెన్షన్ మొదలైతే -
పరీక్ష హాల్లో దిక్కులు చూస్తూ-
మధ్య మధ్యలో పాసుకు వెళ్ళి-
పొగలలతోనే కాలం గడిపా.

పరీక్ష ఫలితాలొచ్చాయంటే -
అందులొ నంబరు లేదంటే -
అమ్మ నాన్నలు బాధలు పడ్డా -
తప్పినందుకు కోపగించినా -
జీరోలొచ్చే చదువులు వద్దని-
చదువుకు గుడ్ బై చెప్పేశా.

యుక్త వయసులో

చదువులు వచ్చిన రాకున్నా-
మగాణ్ణంటు పెళ్ళిని చేస్తే  -
పెళ్ళాం తెచ్చిన కట్నం డబ్బుతో -జల్సాగా తిరగాలంటూ-
లాల్చి పైజమ తొడిగేసి - హీరోలాగా ఫీలౌతూ
బావుట, బాణం బీడీలన్నీ  -
చార్మినార్, బర్కెలీ సిగరెట్లన్నీ  -
గుప్పు గుప్పున త్రాగేశా..

రింగు రింగులుగ పొగలను వదులుతు -
రింగుల కౌగిట భార్యను చేర్చి  -
తల్లిగ తాను కాబోతుంటే  -
ఆనందంతో పరవశించుతూ -
పొగలమయంలో ముంచెత్తా...
ఉక్కిరిబిక్కిరి చేసేశా....

పుట్టిన బిడ్డకు కాళ్ళు వంకర -
కళ్ళు వంకర - చెముడు పుట్టెడు  -
బుధ్ధి మాంద్యము  - దగ్గు దమ్ము  -
ఏల వచ్చెనో  - ఎందుకొచ్చెనో  -
తలపులు పోస్తు  - పొగలను వదులుతు- పొగలలోనే జవాబు వెతికా

పొగయే అందుకు కారణమంటే  -
పొగ పూర్తిగ మానేయాలని  -
ఆఖరి సిగరెట్టెలిగించా...

అందులొ చూసితి పొగల విలాపం-
పుష్ప విలాపానికి తక్కువ కాదది -
కిన్నెరసానికి మించినదే యది -
కంటికి మింటికి  ఏడుస్తుంటే  -
కన్నీరై వరదలు ఐతే  - కరిగిన గుండెతొ
బాసలు చేసి మళ్ళీ కౌగిట చేర్చేశా..

పొగ త్రాగుట ప్రమాద మన్నా  -
బస్సులో పొగ నిషేధ మన్నా  -
సినిమాల్లో ప్రకటనలున్నా  -
తోటి మిత్రులు వద్దంటున్నా  -
సిగరెట్టు పెట్టెపై వార్నింగున్నా  -
పక్కవాళ్ళు ఈసడించినా  -
నా నేస్తానికి ద్రోహం చేయక-
పొగలను త్రాగుతు జోతలు చేశా..

దగ్గు కఫము మొదలైతే  -
డాక్టర్లంత టెస్టులు చేసి-
టీ.బీ యే నా కొచ్చిందంటే -
మందులు వాడుతు- పొగలను త్రాగా.

అణువణువున నా నేస్తం -
నే నున్నా నీ తో నంటే
హృదయంలోను, ఊపిరి లోను-
ఎముకల లోను  - రక్తంలోను -
నేనంతా తానై ఉంటే .....
గాఢ ప్రేమకు జోహార్లిచ్చా..

అందుకే

కాళ్ళు తీసినా ఓ.కే. అన్నా -
కళ్ళు పోయినా ఓ.కే. అన్నా  -
గుండె కోసినా ఓ.కే. అన్నా  -
గొంతు పొయినా ఓ.కే అన్నా
అందుకే నేను పొగ నై పోయాను.
నా నేస్తంతో  ఒకటైనా.....

కనువిప్పు
ఇప్పుడు అయ్యెను కనువిప్పు-
ఆ నేస్తం నా నేస్తం కాదని..
నన్ను కబళించిన కబందమని-
నా పాలిటి దుష్మనని -
నన్ను పావుగ వాడిందని  -
అబద్ధాలు చెప్పించిందని  -
దొంగతనం చేయించిందని  -
చదువుల తల్లికి దూరం చేసిందని-
రోగాలకు పట్టం కట్టిందని  -
పెద్దల మాటలు విననివ్వ లేదని

ఓ నా మిత్రుల్లారా

బానిస కాకుడీ పొగల ఎత్తుకి -
చేరనీకుడీ పొగల పొందుని  -
సోక నీకుడీ పొగల గాలిని -
సాగనీకుడీ పోగల కేళిని

 

విశ్వర్షి వాసిలి

నేను (దీర్ఘ కవిత)

‘నేను’
ఆరుపదుల ఒరలో
అరిషట్ వర్గాల అరను
చీకటి వెలుగుల గమనంలో
ఉభయ సంధ్యల ఉనికిని.
దశావతార సహోదరత్వాన్ని
నవగ్రహ చిదంబరాన్ని
ద్వాదశరాశుల అంతర్యామిని
అష్టదిగ్బంధన గర్భ జవజీవాన్ని.
అవును, నేను
శుక్ర ఆచార్యుల గురుత్వాన్ని
శుక మునీంద్రుల అక్షరత్వాన్ని
వాల్మీక పురుషుల ధర్మ రహసాన్ని
వ్యాస ప్రభువుల విశ్వ దర్శనాన్ని.
రమణుల అచలాగ్నిని
అరవిందుల మానసవరాన్ని
పరమహంస యోగానందాన్ని
రామకృష్ణుల వివేకసిద్ధిని.
అవునవును, నేను
కణాలను రగిల్చి
క్షణాలను మేల్కొల్పి
శ్వాసను నిలిపి
స్వరాన నిశ్శబ్దాన్ని వొంపి
నరనరాన మౌనాన్ని నింపి
ప్రయాణం సాగిస్తున్నాను
గగనాన్ని చీల్చుకుంటూ
గ్రహమండలాలను దాటుకుంటూ.
రుషిమండలాలను
చేరుకుంటున్నాను
యౌగిక అక్షరంగా
- అక్షర క్షణంగా.

 

 

“సిరికోన” సాహితీ దినసంచిక సంపాదకులకు, కవులకు ధన్యవాదాలతో......

 

కామెంట్స్ పోస్ట్ చేయుటకు సూచనలు

మొదటగా, “Start the discussion…” అని వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మీరు రాయదలచుకున్న కామెంట్ రాయండి. తరువాత, “Name” అని రాసి వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు “I'd rather post as a guest” అనే బాక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే... మీరు ఏ విధమైన login అవసరం లేకుండా, కామెంట్ పోస్ట్ చేయవచ్చు! మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా లేదా ఏదైనా సందేహాలున్నా, మాకు editor@sirimalle.com ద్వారా తెలియజేయండి.


ఆశ లేని వాడికి అడవైనా ఇల్లైనా ఒకటే – బాలరామాయణం