Sahithi Pudota

Post a Comment

భాస్కర శతకము

 

సిరివలెనేని సింహ గుహ | చెంత వసించినఁజాలు సింహముల్
కరుల విధింపగా నచటఁ | గల్గును దంతచయంబు ముత్యముల్
హరువుగ నక్కబొక్కకడ | నా శ్రయమందిన నేమి గల్గెడుం
గొరిసెలుఁదూడ తోకలును | గొమ్ములు నెమ్ములు గాక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! సంపద కొరకు సింహములు నివసించు చోటునకు పోయి వసించిన అచ్చట ఏనుగు దంతములునూ, వాని కుంభస్థలమందలి ముత్యములు దొరుకును. గాని నక్కయుండిన కలుగు స్థలములందు, కాపుకాసిన దూడ తోకలు, గిట్టలు, కొమ్ములు, ఎముకలు తప్ప మరేమియునూ దొరకవు. కావున గొప్పవారిని ఆశ్రయించుట మేలుకాని, నీచు నాశ్రయించిన ఫలము శూన్యమని భావము.

 

 

హీనకులంబులందు జని | యించిన వారికి సద్గుణంబు లె
న్నేనియుఁ గల్గియున్న నొక | నేరము చెందకపోదు పద్మముల్
భూనుతిగాంచియున్ బురద | బుట్టుటవల్ల సుధాకరోదయం
బైననుసహ్యమొందవె ప్రి | యంబున జూడగలేక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  లోకంలో మిక్కిలి ఖ్యాతి గల తామర పువ్వులు బురదయందు పుట్టుటచే గల్గిన దోషము వలన అవి చంద్రోదయ సమయమున ఏవగించి చూచుచుండును. కాని ప్రియముతో జూడవు. (చంద్రోదయం కాగానే పద్మములు ముడుచుకొని పోవునని కవి సమయము). అట్లే తక్కువ కులమునందు పుట్టిన మానవున కెన్ని సద్గుణములు ఉన్ననూ ఒక్క చెడు గుణమైనను ఉండనే ఉండగలదని భావము.

 

 

హాళి నిజప్రబుద్ధి తిర | మైన విధంబున బెట్టు బుద్ధు లా
వేళల కంతెకాని మఱి | వెన్కకు నిల్వవు; హేమకాంతి యె
న్నాళుల కుండుగాని యొక నాఁడు పదంపడి సాన బట్టినన్
దాళక యుండునే యినుప | తాటకు జాయలు పోక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  మనుష్యునకు స్వత సిద్ధముగా పుట్టుకతో వచ్చిన బుద్ధి స్థిరమై నిలిచి యుండును. కానీ పెట్టు బుద్ధులు లేక తరువాత వేరొకరు నేర్పిన బుద్ధులు నిలిచి ఉండక ఆయా సమయములందు మాత్రమే నిలువగలవు. ఇనుమును ఒక రోజంతా తోమినను వచ్చు తళుకు కొద్ది కాలము మాత్రమే ఉండగలదు. గానీ బంగారమునకు సహజముగా ఉండు కాంతి వలె ఎల్లప్పుడునూ ఉండదు.

 

 

స్థిరతర ధర్మవర్తన బ్ర | సిద్ధికి నెక్కినవాని నొక్కము
ష్కరుఁడతి నీచ వాక్యములఁ  | గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొఱఁతవహింపఁడయ్యెడ, న | కుంఠిత పూర్ణ సుధాపయోధిలో
నరుగుచుఁగాకి రెట్టయిడి | నందున నేమి కొఱంత భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  అమృత సముద్రము మీదుగా కాకి ప్రయాణము చేయుచున్నప్పుడు, ఆ సముద్రంలో అది రెట్ట వేసిననూ సముద్రమునకు ఏ లోటునూ రాదు. ఎట్లనగా ధర్మావలంబియగు మానవుని, ఒక నీచుడు మిక్కిలి హీనములైన మాటలచే నిందించి ననూ ధర్మవర్తనునకు ఏ మాత్రము లోపము రాదని భావము.

 

 

ఇంచుక నేర్పు చాలక వి | హీనతఁ జెందిన నా కవిత్వమున్
మించు వహించె నీ కతన | మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్
మంచి వివేకి వాని తెర | మాటున నుండి ప్రశస్తరీతి నా
డించిన నాడవే జనుల | డెందము నింపవె ప్రీతి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! నేర్పరియగు వాడు తాను తెరచాటున నుండి తోలుబొమ్మల నాడించుటచే ప్రజల యొక్క మనస్సులు అమితానందము పొందుచున్నట్లు కవిత్వ రచనలో తగినంత నైపుణ్యము లేక అంతగా శోభించనిదైననూ నా కవిత్వము నీ కారణము చేత మిక్కిలి కీర్తి పొందినది.

 

 

సేనగవాంఛితాన్నము భు | జింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట నిజ | మేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ
నేనిజభోజ్యముల్ గుడుచు | నేనియుఁబుష్టివహించు లేని నా
డూని విభూతిలో నడఁగి | యుండఁడె తేజము దప్పి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! తేజశ్శాలియైన అగ్నిదేవుడు తన కిష్టమైన పదార్థములను తిని పుష్టితో ప్రకాశించుచుండును. ఆహారము లేనిచో బూడిద యందు మరుగుచుండును గదా! అట్లే ప్రాణులు తమ కిష్టమైన పదార్థములను పుష్టిగా తినుటచే శరీరకాంతిని పొందుదురు. లేనిచో మిక్కిలి కృశింతురని భావము.

 

ఇంతటితో భాస్కర శతకము పూర్తైనది. వచ్చే సంచికలో మరొక మహోత్తర శతక పరిచయంతో మీ ముందుకు వస్తాను.

 

మూలం: పెద్దబాలశిక్ష

 

divider

 

కామెంట్స్ పోస్ట్ చేయుటకు సూచనలు

మొదటగా, “Start the discussion…” అని వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మీరు రాయదలచుకున్న కామెంట్ రాయండి. తరువాత, “Name” అని రాసి వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు “I'd rather post as a guest” అనే బాక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే... మీరు ఏ విధమైన login అవసరం లేకుండా, కామెంట్ పోస్ట్ చేయవచ్చు! మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా లేదా ఏదైనా సందేహాలున్నా, మాకు editor@sirimalle.com ద్వారా తెలియజేయండి.


ఆశ లేని వాడికి అడవైనా ఇల్లైనా ఒకటే – బాలరామాయణం

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)