మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు

Post a Comment

తరువాతి భాగం »

క్రీస్తుశకం పధ్నాలుగు, పదిహేను శతాబ్దుల నడిమి కాలంలో కాకతీయ మహాసామ్రాజ్యం ఉత్థాన పతనవేళలలో ఆంధ్రదేశచరిత్రలోనూ, ఆంధ్రసాహిత్యచరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా రెండు మరపురాని దురంత దుర్ఘటనలు సంఘటిల్లాయి. శిల్పశాస్త్రంలో చెప్పబడే వాస్తుపురుషమండలదోషం వంటిదేదో సంభవించి సిద్ధసాధనులైన మహాత్ములు ప్రతిష్ఠించిన రెండు మహాద్భుతాలైన దేవాలయాలలో ఒకటి గుంటూరు మండలంలోనూ, ఒకటి ఓరుగల్లు పట్టణంలోనూ విధివైపరీత్యాలకు లోనై కూలిపోవటం జరిగింది. గుంటూరు మండలంలో కూలిపోయినది శుద్ధసత్త్వాత్మకమై సాక్షాద్బ్రహ్మప్రకాశకమైన శ్రీరామావతార దివ్యలీలను జగద్వ్యాప్తం చేసి శరణాగతులకు పురుషార్థలబ్ధిని, పరమార్థసిద్ధిని ప్రసాదింపబూనిన శ్రీరామాలయం. భాస్కర మంత్రి ప్రణీతమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం అది. ఓరుగల్లులో నేలకొరిగినది కర్మజ్ఞానశాస్త్రానుష్ఠానాలతో సాధింపరాని మోక్షఫలాన్ని హరినామసంకీర్తనతో అవలీలగా సాధింపవచ్చునని చాటిచెప్పి, వాసుదేవ కథా కలశరత్నాకరమై విభాసించిన శ్రీకృష్ణాలయం. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం అది. ఆశ్రితకోటి గుండెలలో శ్రీరామచంద్ర పరబ్రహ్మాన్ని, శ్రీకృష్ణ పరమాత్మను శ్రీకైవల్యపదస్వరూపులనుగా కొలువుతీర్చిన ఆ కోవెలలు రెండూ కూలిపోయి కాలగర్భంలో కలిసిపోకుండా శిథిల జీర్ణోద్ధారం చేసి, శేషించి ఉన్న భాగాలకు చిన్నెలు పెట్టి, చిత్రికలు పట్టి, గోపురాలు కట్టి, ప్రాకారాలు చుట్టి ఆ మందిరాలను ప్రధ్వంసాభావ వ్యాకులీభావం లేకుండా పరిపూర్ణించి పూజలకు సిద్ధంచేసిన పుణ్యాత్ములూ ఆ కాలంలో ఉన్నారు. భాస్కర రామాయణ దేవాయతనాన్ని సరిచేయబూని మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలార్యుడు శక్తివంచన లేకుండా నిర్మాణాన్ని పూర్తిచేసి లోకానికి సమర్పించారు. భాగవత దేవాలయ జీర్ణోద్ధారాన్ని వెలిగందల నారాయణామాత్యుడు మొదలుపెట్టిన తర్వాత బొప్పన గంగనామాత్యుడు కొనసాగింపగా ఆ మహత్కార్యాన్ని పూర్తిచేసి పునీతజనాశ్రయం కల్పించిన పుణ్యచరిత్రుడు మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు.

భాస్కర రామాయణం కాకతీయ మహాసామ్రాజ్యం సముజ్జ్వలంగా పరిఢవిల్లుతుండిన కాలాన క్రీస్తుశకం 14-వ శతాబ్దంలో మొదలై, 15-వ శతాబ్ది చివరి నాటికి పూర్తయింది. బాలారిష్టాలు దాటి బ్రతికి బట్టకట్టేనాటికి అనిర్వచనీయమైన విధివిలాసం వల్ల ఎక్కడెక్కడివో, ఎవరెవరివో రచనలు దానిలోకి వచ్చి కలిసిపోయాయి. ఏ కాండంలో ఎంత భాగం ఎవరు వ్రాశారో వింగడించి విస్పష్టంగా వివరించటం సులభమేమీ కాదు. ఆయా కాండల ఆశ్వాసాంత గద్యలలోని సమాచారం కొంతవరకు మాత్రమే ఉపకరిస్తుంది. ఏ దుర్విలంఘ్యకర్మపరిణామం వల్లనో అప్పటికే అంతరించిపోతున్న ఎర్రాప్రెగ్గడ గారి రామాయణంలో నుంచి ఎంత భాగం వచ్చి అందులో అంతర్హితమయిందో చెప్పలేము. వ్రాతప్రతులు పరిపరివిధాలుగా ఉన్నాయి. ఏదో ఒక తీరున అచ్చయిన గ్రంథం అందుబాటులో ఉన్నదన్న సంతోషమే తప్పించి, దాని కలరూపును ఇదమిత్థంగా నిర్ణయించి - నెల్లూ పొల్లూ ఏరివేసి, ప్రాథమిక రూపధేయాన్ని ప్రామాణికంగా పరిష్కరించటం పండితులకైనా సాధ్యం కాదు.

భాగవత రచన విషయమూ అంతే. కాకతీయ మహాసామ్రాజ్యం అస్తమించినప్పుడు ఓరుగల్లు పట్టణం ఒక విశ్వసనీయమైన రక్షణ కవచాన్ని కోల్పోయింది. బలి చక్రవర్తి దాడిచేసినప్పుడు అమరావతి అల్లకల్లోలమైనట్లు శత్రువుల దండయాత్రలతో సమస్తం అతలాకుతలమైంది. ప్రజాసంక్షేమం అతీతకాలపు స్మృతివిశేషంగా పరిణమించింది. క్రీస్తుశకం 1475 నాటికి జగత్ప్రసిద్ధమైన స్వయంభూ దేవాలయంతో సహా ఎన్నెన్నో గుడిగోపురాలు సపాటంగా సర్వనాశనమయ్యాయి. స్వధర్మరక్షాదీక్షితుల శ్రౌతస్మార్తకర్మలకు ముప్పువాటిల్లింది. పోతన్న గారు 1470-1475 దరిదాపుల భాగవతానువాదానికి శ్రీకారం చుట్టి, 1480–1485 ప్రాంతాల ఇతిశ్రీని వ్రాయించే నాటికి దండయాత్రల ఘోరకలి ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లున్నది. భాగవతంలోని ఎంత భాగం పోతన గారిచే రచితమై, ఎంత భాగం ధ్వంసమైపోయిందో స్థూలంగానే తప్ప సూక్ష్మంగా ఇప్పుడు మనము నిర్ణయింపలేము. ఏ కారణం వల్ల విధ్వస్తమైపోయిందో కూడా వివాదగ్రస్తమే. ఏదో ఒక తీరున అచ్చయిన గ్రంథం అందుబాటులో ఉన్నదన్న సంతోషమే తప్పించి, దాని కలరూపును గుర్తుపట్టి – చితుకూ మతుకూ తీసివేసి, మూలానుగుణమైన కవిత్వ భాగధేయాన్ని ప్రామాణికంగా పరిష్కరించటం పండితులకైనా సాధ్యం కాని పరిస్థితి.

భాగవతంలో మొత్తం పన్నెండు స్కంధాలున్నాయి. ఈనాటి పరిమాణాన్ని బట్టి అది రమారమి తొమ్మిదివేల ఇరవైరెండు పద్యగద్యాల బృహన్నిర్మాణం. మొదటి ఆరు స్కంధాలూ మూడువేల ఏడువందల ముప్ఫైనాలుగు పద్యాలు. సప్తమ స్కంధం మొదలుకొని దశమ స్కంధ పూర్వభాగ పర్యంతం మూడువేల ఏడువందల అరవైనాలుగు పద్యాలు. దశమ స్కంధం ఉత్తర భాగం నుంచి ఏకాదశ, ద్వాదశ స్కంధాల భాగం పదిహేను వందల ఇరవైనాలుగు పద్యాలు. వ్రాతలో అవి మూడు తాళపత్ర సంపుటాలవుతాయి. తాళపత్ర ప్రతులలోనూ, ఈనాటి ముద్రిత ప్రతులలోనూ ఈ పద్యాల సంఖ్యలు ఒక్కొక్క ప్రతిలో ఒక్కొక్క తీరున ఉంటాయి. నేను ప్రస్తుతానికి 1855లో శ్రీమాన్ మా. వెంకటకృష్ణశాస్త్రుల వారు అద్భుతావహంగా పరిష్కరింపగా కేశవ ముదలారి గారు చెన్నపట్టణంలో అచ్చువేసిన ఎంతో అపురూపమైన ఒక ప్రతిని బట్టి లెక్కచూపాను. 1925లో శ్రీ బుక్కపట్టణము రామానుజయ్య గారు సరిచూడగా ఎ. కణ్ణన్ శెట్టి అండ్ కంపెనీ వారు మద్రాసులో అచ్చువేసిన మరొక అరుదైన ప్రతితో ఈ పద్యసంఖ్య దాదాపుగా సంవదిస్తున్నది.

Singanamathyaతాళపత్ర సంపుటాలను ఆ రోజులలో ఈ ప్రకారం కట్టి ఉంటారని ఊహించటమే కాని, కవి జీవించి ఉన్న కాలంలో మొదటిసారి నిజంగా ఎట్లా కట్టారో మనకు తెలియదు. ఈనాటి లిఖిత గ్రంథ భాండాగారాలలో లభిస్తున్న వివిధ స్కంధాల సంపుటీకరణ వివరాలు గాని, వ్యక్తిగతసంచయాలలో లభిస్తున్న వివిధ తాళపత్ర సంపుటాల సంపుటీకరణ విశేషాలు గాని ఈ విషయాన్ని ఐకకంఠ్యంతో నిర్ధారించేందుకు ఉపకరింపవు. మొదటి ఆరు స్కంధాలను ఒక కట్టగాను, చివరి ఆరు స్కంధాలను ఒక కట్టగాను కట్టారని కొందరు విమర్శకులు ఊహించారు. అందువల్ల స్కంధాల అడుగు భాగాలు దెబ్బతిని, మొదటి కట్టలో అడుగున ఉన్న పంచమ, షష్ఠ స్కంధాలు; రెండవ కట్టలో అడుగున ఉన్న ఏకాదశ, ద్వాదశ స్కంధాలు లోపించినట్లు భావింపబడుతున్నది. జాగ్రత్తగా పరిశీలించితే అది సరికాదని తెలుస్తుంది. ప్రథమ స్కంధంలో అవతారిక పూర్తిగా దెబ్బతిన్నది. దానిని యథాయోగ్యంగా సరిచేయవలసి ఉన్నది. ద్వితీయ స్కంధంలో “అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందు” అని ఉన్న 93-వ పద్యం నుంచి తాళపత్ర ప్రతులలో “ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వప్రారంభము” అని ఉన్నది. 1855 నాటి వెంకటకృష్ణశాస్త్రులవారి ప్రతిలో “ఈ ఘట్టము మొదలుకొని వెలిగందల నారయ చెప్పిన కవిత్వప్రారంభము” అని ఉన్నది. ఆ మాట ఆ స్కంధాంతం వరకు వర్తిస్తుందని అనుకొంటే, ఆ భాగమంతా సరిక్రొత్తగా రచింపవలసినంత దెబ్బతిన్నదన్నమాట. మొదటి రెండు స్కంధాలను ఒక కట్టగా కట్టివుంటే, ముందు-వెనుకలు శిథిలమైనాయని ఊహించాలి. ఆ తర్వాతి రెండు స్కంధాలూ ఒక కట్ట. అందులోనూ లోపాలు లెక్కలేనన్ని కనుపిస్తున్నాయి. ఆపై ఇతరులు పూర్తిచేశారు కాబట్టి పంచమ, షష్ఠ స్కంధాలు; చిట్టచివరి ఏకాదశ, ద్వాదశ స్కంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న సంగతి ఎలాగూ స్పష్టమే. సప్తమ స్కంధం ఒక్కటే - అక్కడక్కడ కనుపించే కొన్ని లోపాలు తప్పించి, కొంత సురక్షితంగా వీనుమిగిలినట్లు కనబడుతుంది. అష్టమ, నవమ స్కంధాలలో చాలా చోట్లు దెబ్బతిన్న జాడలున్నాయి. పాఠక్రమంలో జారుపాటులు, పద్యక్రమంలో తారుమారులు కనబడుతున్నాయి. దశమ స్కంధం ఉత్తర భాగంలో పదమూడు వందల నలభైమూడు పద్యగద్యాలున్నాయి. అవన్నీ పోతన గారివి కావని, ఆ ఉత్తర భాగంలో 235-వ సంఖ్య గల “సాల్వ జరాసంధ చైద్యాదిరాజులు” అని ఉన్న సీసపద్యంలోని నాల్గవ పాదమైన “కాంతా తనూ జార్థకాముకులము గాము” అని ఉన్న చోటు నుంచి “ఇక్కడ నుండి వెలిగందల నారపరాజు గారి కవిత్వప్రారంభము” అంటూ - అది వెలిగందల నారయ గారి రచనమని వ్రాతప్రతులలో స్పష్టంగా వ్రాయబడినప్పటికీ, చాలామంది పరిష్కర్తలు ఆ శీర్షికను తొలగించి, మొత్తం పోతన గారి రచన గానే ముద్రిస్తున్నారు. తృతీయ స్కంధం ఆశ్వాసాంత గద్యలో అది పోతన గారి రచనమని ఉన్న ప్రమాణాన్ని పురస్కరించికొని పూర్తిగా పోతన గారి పేరిటనే అచ్చై ఉన్నది కాని, అది కూడా ఆసాంతం పోతన గారి రచన కాదేమోనన్న కర్తృత్వవిషయసందేహం చిరకాలంగా విమర్శకులను వేధిస్తున్నది. అదొక చర్చనీయాంశం. చతుర్థ స్కంధం పోతన గారిది కాకపోవచ్చునన్న నమ్మకం క్రీస్తు శకం 17-18 శతాబ్దుల నాటి కూచిమంచి తిమ్మన గారి కాలం నుంచే ఉన్నది. అదికూడా చర్చనీయాంశమే. ఆ లెక్క ప్రకారం మొదటి మూడు స్కంధాలు ఒక సంపుటం అయితే - ముందున్న అవతారిక, ద్వితీయ స్కంధంలో చివరి సగభాగం, తృతీయ స్కంధం పూర్తిగాను ధ్వంసమై ఉండాలి. పైని పేర్కొన్న ముద్రిత ప్రతిలోని పద్దెనిమిది వందల డెబ్భైనాలుగు పద్యగద్యాల భాగంలో తాళపత్ర ప్రతి చాలా వంతు దెబ్బతిన్నదన్నమాట. రెండవ కట్టలో చతుర్థ స్కంధం మాత్రం మిగిలి – పంచమ, షష్ఠ స్కంధాలు శిథిలమయ్యాయి. చతుర్థ స్కంధం కూడా పోతన గారి రచన కాకపోతే మాత్రం ఆ రెండవ కట్ట పూర్తిగా ధ్వంసమయిందని నమ్మాలి. ముద్రిత ప్రతిలో అది పద్దెనిమిది వందల అరవై పద్యగద్యాల భాగం అవుతుంది. సప్తమ, అష్టమ, నవమ స్కంధాల మూడవ కట్టలో అక్కడక్కడ ఛిద్రాలేర్పడినా, ఎన్నో అపపాఠాల చిక్కుముడులున్నా – దక్కినంత మేరకు ఆ మాత్రమైనా పోతన గారి రచనగా మనకు దక్కింది. ముద్రిత ప్రతిలో అది పంధొమ్మిది వందల అరవైతొమ్మిది పద్యగద్యాల భాగం. దశమ స్కంధాన్ని ఎట్లా కట్టారో చెప్పలేము. పదిహేడు వందల తొంభైఅయిదు పద్యగద్యాల పూర్వభాగం రక్షితమై, ఉపలబ్ధమైన పదమూడు వందల నలభైమూడు పద్యగద్యాల ఉత్తర భాగంలో కనుపిస్తున్నది కాక ఇంకా మరికొంత శాతం నశించిపోయి ఉండాలి. ప్రస్తుతానికి ఉపలబ్ధమైనంత మేరకు - పైని పేర్కొన్నట్లుగా - 235-వ పద్యం నడిమి నుంచి అది వెలిగందల నారయ గారి రచనమని వ్రాతప్రతులలో ఉన్నది.

తరువాతి భాగం »

 

కామెంట్స్ పోస్ట్ చేయుటకు సూచనలు

మొదటగా, “Start the discussion…” అని వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మీరు రాయదలచుకున్న కామెంట్ రాయండి. తరువాత, “Name” అని రాసి వున్న బాక్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు “I'd rather post as a guest” అనే బాక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే... మీరు ఏ విధమైన login అవసరం లేకుండా, కామెంట్ పోస్ట్ చేయవచ్చు! మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా లేదా ఏదైనా సందేహాలున్నా, మాకు editor@sirimalle.com ద్వారా తెలియజేయండి.


ఆశ లేని వాడికి అడవైనా ఇల్లైనా ఒకటే – బాలరామాయణం